ETV Bharat / state

సంక్రాంతి పండగకు 1,200 ప్రత్యేక బస్సులు - నగరం నలువైపుల నుంచి అందుబాటులో

హైదరాబాద్ నగరం నలువైపులా ఉన్న డిపోల నుంచి నడిపేలా అధికారులు కసరత్తు - డిమాండ్ ఆధారంగా బస్సులను నడిపేందుకు చర్యలు - సంక్రాంతి సెలవులకు ఊరెళ్తున్న వారు సమాచారం అందించాలని పోలీసుల విజ్ఞప్తి

RTC Special Buses For Sankranti
RTC Special Buses For Sankranti (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 5, 2026 at 12:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

RTC Special Buses for Sankranti in Telangana : సంక్రాంతి పండగకు నగరం నుంచి 1,200 బస్సులు అందుబాటులో ఉండేలా గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు నగరం నలువైపులా ఉన్న ఆర్టీసీ డిపోల నుంచి నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్‌ ఆధారంగా మరిన్ని బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఏపీలోని పలు ప్రాంతాలకు : నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు, విజయవాడ, రాజమండ్రి, ఉదయగిరి తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లోని బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్సీపురం నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్​ రోడ్డు మీదుగా అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్టు బీహెచ్‌ఈఎల్‌ డిపో అధికారులు ప్రకటించారు.

స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి : సంక్రాంతి సెలవులకు ఊరెళ్తున్న హైదరాబాద్​ నగర వాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించి వెళ్లాలని సీపీ సజ్జనార్‌ ఆదివారం సూచించారు. ఎక్కువ రోజులు విహార యాత్రలు, దూర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పండక్కి దొంగలు, అంతర్రాష్ట్ర ముఠాలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించనుంది. దీంతో రాత్రి గస్తీని మరింత పెంచారు. పాత నేరస్థుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు.

ముందస్తు చర్యలతోనే వేగంగా అడ్డుకట్ట : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేవారు విలువైన వస్తువులు, ఆభరణాలను ఇంట్లో పెట్టి వెళ్లొద్దన్నారు. బ్యాంకు లాకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాల్లో విలువైన వస్తువులను భద్రపరచాలని సూచించారు. ఊరెళ్లే ముందుగానే స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో, బీట్‌ ఆఫీసర్‌కు సమాచారమిస్తే పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసు సిబ్బంది ఆయా నివాసాలపై ప్రత్యేక దృష్టి ఉంచుతారని సజ్జనార్​ తెలిపారు. నేరం జరిగాక స్పందించటం మాత్రమే కాదని, ముందస్తు చర్యలతో వాటికి వేగంగా అడ్డుకట్ట వేయటం ఆధునిక పోలీసింగ్‌లో భాగమన్నారు. అత్యవసరమైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.

సంక్రాంతికి హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్​ సెంట్రల్​ రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, వాటిల్లో టికెట్లు చాలా వేగంగా అమ్ముడై పోయాయి. దీంతో కొంతమందికి రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారి కోసం మరో 11 సంక్రాంతి స్పెషల్​ ట్రైన్లను ప్రకటించింది. ఈ సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్లు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి? ఏయే తేదీల్లో ఉన్నాయి? వాటి బుకింగ్స్​ తదితర వివరాలను ప్రకటనలో పేర్కొంది.

జనవరి 7 నుంచి 12వ తేదీల మధ్య : జనవరి 7 నుంచి 12వ తేదీల మధ్య కాకినాడ నుంచి వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా ట్రైన్లలో 1ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా రైళ్లకు సంబంధించి ముందస్తుగానే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని తెలిపింది.

సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో అడ్వాన్స్​ టికెట్ బుకింగ్ మొదలైంది

సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్​న్యూస్ - స్పెషల్ ట్రైన్లలో రేపటి నుంచే అడ్వాన్స్​ బుకింగ్