ETV Bharat / state

100 మంది రౌడీషీటర్లకు వినూత్న రీతిలో కౌన్సెలింగ్‌ - చెప్పుల్లేకుండా నడిరోడ్డుపై నడక

రౌడీషీటర్లపై పీడీ చట్టం ప్రయోగం - పోలీస్‌స్టేషన్లకు తరలించి, సంతకాలు తీసుకున్న పోలీసులు - రాష్ట్ర వ్యాప్తంగా 26,518 మంది రౌడీలు

counseling to rowdy sheeters by police
Counseling To Rowdy Sheeters By Police (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 11, 2026 at 7:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Police Special Counseling To Rowdy Sheeters : ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏ మాత్రం తమ తీరును మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడుతున్న కరడుగట్టిన రౌడీషీటర్లకు వినూత్న రీతిలో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా గుంటూరులో ఉన్న రౌడీషీటర్లను కాళ్లకు చెప్పుల్లేకుండా నడిరోడ్డుపై నడిపించి ప్రత్యేక రీతిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా రౌడీషీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం కూడా (ఆంధ్రప్రదేశ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ డేంజరస్‌ యాక్టివిటీస్‌ చట్టం-1986 (ప్రమాదకర కార్యకలాపాల నియంత్రణ చట్టం) ప్రయోగిస్తోంది. ఒకవేళ ఎవరిపైనైనా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు గరిష్ఠంగా ఏడాదిపాటు జైల్లో తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. దీనికి తోడు బెయిల్‌కు కూడా అవకాశం ఉండదు.

ఏదైనా కేసులో అరెస్టు చేసినా కొన్ని రోజులకే బెయిల్‌పై బయటకు వచ్చేసి పేట్రేగిపోతున్న రౌడీలను ఏడాదిపాటు ముందుగానే నిర్బంధించేందుకు ఈ చట్టాన్ని వాడుతోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్యం శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణను గాలికి వదిలేయటం, రాజకీయ అండదండలతో రాష్ట్రంలో రౌడీషీటర్లు కోకొల్లలుగా పెరిగిపోయారు. వారి నేరసామ్రాజ్యాలను విస్తరించుకుని ఇప్పటికీ అనేక నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నుంచి ఇప్పటి వరకూ సుమారు 220 మంది రౌడీషీటర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు.

వినూత్న రీతిలో కౌన్సెలింగ్‌ : తరచూ నేరాలకు పాల్పడుతుండడం, రౌడీయిజం చేస్తున్న సుమారు వందమంది రౌడీషీటర్లను పోలీసు డార్మెటరీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు సిబ్బంది వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఆ రౌడీషీటర్లను పోలీసు వాహనంలో ఎక్కించి, నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం కూడలి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాళ్లకు చెప్పుల్లేకుండా నడిరోడ్డుపై కిలోమీటరు మేర వారందరినీ నడిపించారు. అనంతరం వారిని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అక్కడ వారిచేత సంతకాలు తీసుకుని మంచిమార్గంలో నడవాలని సూచించి పంపించారు. రౌడీషీటర్లు వాళ్ల పద్ధతి మార్చుకోకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

ఈ జిల్లాల్లో రౌడీషీటర్లు అత్యధికం: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,518 మంది రౌడీలు ఉండగా ఈ ఏడాది దాదాపు 153 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 36 మందిపై, ఎన్టీఆర్‌ జిల్లాలో 23, గుంటూరులో 20, విశాఖపట్నంలో 14, ప్రకాశంలో 12, నెల్లూరు, పల్నాడులో చెరో 10 మంది రౌడీషీటర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. 11,728 మందిని బౌండోవర్‌ చేశారు. కర్నూలు, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కరిపైనా ఈ చట్టం ప్రయోగించలేదు.

రౌడీయిజం నియంత్రించే బాధ్యత ఉన్నతాధికారులదే: గతంలో కరడుగట్టిన రౌడీషీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. పదే పదే నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్న రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైల్లో పెడతామని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా వీటికి సంబంధించి ఎస్పీల నుంచి అందే ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో రౌడీయిజం నియంత్రించే బాధ్యత కలెక్టర్, ఎస్పీలదేనని ఈ సందర్భంగా సీఎం తేల్చి చెప్పారు. కలెక్టర్ల సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. నెల్లూరు లాంటి చోట్ల లేడీడాన్‌లు వస్తున్నారు. గంజాయి వంటి వ్యాపారం చేయటం, అడ్డమొస్తే ఆఖరికి చంపేయటం వంటి నేరాలను సినిమాల్లో చూసేవాళ్లమనీ, కానీ అవి ఇప్పుడు నిజంగా జరుగుతున్నాయి. అలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు - కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు

బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం - ఆ జిల్లాలకు వర్ష సూచన