'న్యాయ వ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది' : దిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కవిత
దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు - దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోదియాకు విముక్తి

Published : February 27, 2026 at 11:36 AM IST
|Updated : February 27, 2026 at 2:57 PM IST
DELHI LIQUOR POLICY CASE : దిల్లీ మద్యం పాలసీ వ్యవహారం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులందరిపైనా ఉన్న కేసులను కొట్టివేసింది. ఈ మేరకు సీబీఐ అభియోగాలు మోపిన 23 మందికి విముక్తి కల్పించింది. ఈ కేసులో కవితతో పాటు దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు కూడా ఊరట లభించింది. నిందితుల పేర్లను డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మద్యం కేసులో కోర్టు తీర్పు అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. 'సత్యమేవ జయతే' అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.
Satyameva Jayate ✊🏼
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 27, 2026
జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారు? : దిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలంగాణ ప్రజలకు తాను మొదటి నుంచీ చెబుతున్నానని ఆమె గుర్తు చేశారు. అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానన్నారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామన్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ఆమె ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు.
"మేము ముందు నుంచి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెబుతూ వచ్చామో అదేవిధంగా ఇవాళ కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. ఈ దేశంలో న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకాకుండా కాపాడింది. రాజకీయపరంగా కేసు పెట్టారని నేను పదే పదే చెప్పిందే నిజమైంది. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నేను ఇంతకు ముందే చెప్పాను. అదేవిధంగా రావడం జరిగింది. నేను జైలులో ఉన్న సందర్భంలో కార్యకర్తలు అనేక సార్లు వారి సొంత డబ్బులు ఖర్చు చేసి దిల్లీకి వచ్చి నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను"- కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారు : విచారణ సందర్భంగా సరైన ఆధారాలు లేకుండానే ఈ కేసులో పేర్లు చేర్చారని విచారణ సందర్భంగా సీబీఐపై రౌస్ అవెన్యూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని మండిపడింది. నిందితులు తప్పు చేశారనటానికి సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. తగిన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీబీఐ అధికారులపైనే దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపై సీబీఐ కేసులు కొట్టివేసింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టులో 45 రోజుల పాటు వాదనలు సాగాయి.
నాకు ఈ కేసుతో సంబంధం లేదని ఎన్నోసార్లు చెప్పా : దిల్లీ మద్యం కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఎన్నోసార్లు చెప్పానని, తాను అన్నదే నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలిందని కవిత అన్నారు. కొన్ని నెలలపాటు జైలులో ఉంచి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తెలకుండానే వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు. తనపై పెట్టిన కేసువల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నట్లుగా తన అన్న కేటీఆర్ పోస్టుచేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి తాను కారణమా? అని ఆమె కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం బీఆర్‌ఎస్ ఓటమికి కారణమన్నారు.
మూడు నెలల్లో కొత్తపార్టీ పెడుతున్నా : అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటం బీఆర్ఎస్ ఓటమికి ఓ కారణమని కవిత అన్నారు. దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అన్నింటికంటే ముఖ్యంగా వారి అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణమన్నారు. ఇవాళ కోర్టు తీర్పును వారికి అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదన్నారు. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానన్నారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నానని కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నాకు ఎప్పుడూ మద్దతు రాలేదన్నారు. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరమన్నారు.
దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు- కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
దిల్లీ మద్యం పాలసీ కేసు - రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు బిగ్ రిలీఫ్

