తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు ఏపీ వాసులు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం - కోదాడ మండలం ద్వారకుంట వద్ద కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు - కంటైనర్‌ను బస్సు వెనుకనుంచి ఢీకొట్టడంతో ఆరుగురు మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 6:57 AM IST
|Updated : August 26, 2026 at 9:52 AM IST
Road Accident in Kodada : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో కంటైనర్‌ను ఓ ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కంటైనర్‌ను అతివేగంతో ఢీకొట్టడం వల్ల బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమత్తం ప్రస్తుతం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించారు. తెల్లవారితే ఇంటికి వస్తారనుకున్న కుటుంబసభ్యులు ఈ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఐరన్ సామగ్రితో రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఐరన్ షీట్స్ బస్సులోకి చొచ్చుకెళ్లాయి. దీంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికుల తలలో గుచ్చుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత బస్సు డ్రైవర్ మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకోవాల్సిన బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎస్పీ కోదాడ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు.
మృతుల వివరాలు :
1. యాసారపు చిన్ని(32) - కృష్ణా జిల్లా తేల్లప్రోలు గ్రామం
2.బొల్లిపొంగు మేరీ జోష్న(29) - విజయవాడ
3.కేశవుల నాగేంద్రబాబు - విజయవాడ
4.సురవరపు షకీనా 5.భావన 6.లక్ష్మిగా గుర్తించారు.
క్షతగాత్రుల వివరాలు : చందన, భవాని, యశ్వంత్, విటల్, మనోహర్, అనిల్‌కుమార్, ధ్రువ, జయసింగ్ కుమార్, విజయలక్ష్మి, రమణమ్మ సుధాకర్, నవీన్‌కుమార్, అవినాశ్, వంశీగా గుర్తించారు.
Bus Collides Container in Kodad : కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-కంటైనర్ ఢీకొనడంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేలా తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.
కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
Road accident in Dorakunta : రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మండిపల్లి ఆదేశాలిచ్చారు. కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అనిత ఆకాంక్షించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి : కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ స్కూల్ బస్సు - విద్యార్థికి గాయాలు

