క్షణికావేశ నిర్ణయాలు వద్దు - ఉన్నది ఒకటే జిందగీ - పూర్తిగా చూడాలి దాని సంగతి!
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అడపాదడపా వెలుగులోకి వస్తున్న ఆత్మహత్య కేసులు - తొలుత విద్య, ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్న మానసిక నిపుణులు - ఆ ఆలోచన రాకుండా ఏం చేయాలంటే?

Published : January 8, 2026 at 12:01 PM IST
Increase Of Suicide Cases For Love : ప్రేమ అనేది రెండు మనసుల మధ్య చిగురిస్తుంది. దానికి ఏ తేడా ఉండదు. పరిణతి పొందని వారూ ఈ ఊబిలో చిక్కుకొని నిండు జీవితాలను గాల్లో దీపంలా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాలు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తును అంచనా వేయలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువత దీన్ని అధిగమించాలంటే తల్లిదండ్రులు, కుటుంబీకులు అండగా నిలవాలి. జీవితాన్నిప్రేమించేలా, లక్ష్యం వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలి. ఎందుకీ పరిస్థితి వస్తోంది? ఈ బెడద తప్పాలంటే ఏం చేయాలో మానసిక నిపుణురాలు డా.శాంతి ఇలా సూచిస్తున్నారు.
నవ యువతలో మార్పు తప్పనిసరి : తొలుత విద్య, ఆ తర్వాత ఉపాధి దిశగా అడుగేసి జీవితంలో స్థిరపడాలి. ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్న నవ యువత తప్పటడుగులు వేస్తోంది. మోసాన్ని ముందుగా గుర్తించలేక విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. చివరకు విషయం తెలుసుకొని కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు. మెదక్‌కు చెందిన ఓ యువతి మోసపోయి ఆత్మహత్య చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది.
బలవన్మరణం పరిష్కారం కాదు : సిద్దిపేటలో చదివే ఓ జూనియర్ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆమె కుటుంబ సభ్యుల ఆశలను ఆవిరిచేసింది. పేద కుటుంబం నుంచి ఉన్నత లక్ష్యంతో ప్రయాణించిన సదరు యువతి, ప్రేమలో మోసపోయి మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది. చదువు, క్రీడల్లో చురుగ్గా ఉండే అమ్మాయి, ప్రియుడి వంచనను అంచనా వేయలేకపోయింది. ఆమె బలవన్మరణం, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను చెబుతోంది.
ఎలా అధిగమించాలంటే :
- బాల్యం, టీనేజీ దశ ఏదైనా తల్లిదండ్రులు, పిల్లలను గమనించాలి. అనుభవాలను వివరించాలి.
- స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. స్నేహితులు, పరిచయాలపై ఆరా తీయాలి.
- పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అంతరం పెరగొద్దు.
- ఏ విషయమైనా పంచుకునేలా ప్రోత్సహించాలి.
- ఒకవేళ ప్రేమలో పడినా, విఫలమైనా, వెన్నుదన్నుగా నిలిచి మార్పు వైపు నడిపించాలి.
- విద్యాసంస్థలు చదువుతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలియజేయాలి.
వీటిని గమినిస్తేనే :
- ప్రవర్తన, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు గమనించాలి.
- నోటి నుంచి చనిపోతామనే మాట వస్తే, పర్యవేక్షణ పెంచాలి.
- ఒంటరిగా ఉండటం, నిద్రించకపోవడం, తరచూ ఏడుస్తుండటం ప్రమాదకరంగా భావించాలి.
- నిద్ర లేకపోవడం, వ్యసనాల బారినపడుతుంటే అప్రమత్తం చేయాలి.
- మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
- జీవితంలో స్థిరపడటం తొలి లక్ష్యంగా వివరించాలి. నచ్చిన రంగంలో ప్రోత్సహించాలి.
క్షణికావేశంలో చేసే పనులు : తల్లిదండ్రులు ఒప్పుకోలేదనో, ప్రేమించిన వాడు మాట వినడం లేదనో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారంగా చాలా మంది ఆత్మహత్యలను ఎంచుకుంటున్నారు. జీవితం విలువ తెలుసుకోలేక క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ సమస్యలను ఎదుర్కోలేక, ఒత్తిడి తట్టుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు చాలా మంది. దాంతో తమ ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
స్నేహితుల్లా ఉండాలి : తల్లిదండ్రులు అంతా జరిగిపోయాక కూర్చొని బాధపడడం కంటే ముందు నుంచే పిల్లలు ఏం చేస్తున్నారు? ఇతరులతో ఎలా ఉంటున్నారు? అనే విషయాలను గమనిస్తూ ఉండాలి. అలా అని ప్రతి క్షణం పక్కనే ఉంటూ, వారితో కఠినంగా వ్యవహరించకూడదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా మనతో చెప్పుకునేలా ఉండాలి. అప్పుడే వారిలో చనిపోవాలనే ఆలోచన పోతుంది.
వ్యక్తుల్లో మానసిక స్థితిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్యలతో కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో ప్రజల కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు : జీవితమన్నాక ఏదో ఓ సందర్భంలో సమస్యలు రావడం సహజమని, వాటికి సరైన రీతిలో ఆలోచిస్తే పరిష్కారమార్గాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, మీ సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటున్నా, మీకు సహకరించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24x7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కారమార్గాలను పొందవచ్చు.
ఎంత పని చేశావే రూపాయి - కొడుకు మోసం ఆత్మహత్య చేసుకున్న తండ్రి - Man Suicide in Attapur

