ETV Bharat / state

పట్టణ ప్రజలకు గుడ్​న్యూస్​ - ట్రాఫిక్​ను తగ్గించేందుకు రింగ్‌రోడ్లు, బైపాస్‌లు

వాహన రద్దీ తగ్గించేలా కేంద్రం పాలసీ - రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రింగ్‌ రోడ్లు, సెమీ రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక - హిందూపురానికి తొలి సెమీ రింగ్‌ రోడ్‌

Ring_Roads_and_Bypasses
Ring_Roads_and_Bypasses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 8:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ring Roads and Bypasses in Urban Areas of AP: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రింగ్‌ రోడ్లు, సెమీ రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పట్టణాల్లోని రహదారులు వాహన రద్దీతో కష్టంగా మారుతున్నందున ఆ ట్రాఫిక్‌ను తగ్గించేలా కేంద్రం అమలు చేస్తున్న అర్బన్‌ డీ-కంజెషన్‌ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురానికి తొలి సెమీ రింగ్‌ రోడ్‌ను సాధించింది.

కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి లేపాక్షి మీదుగా హిందూపురం పెద్దచెరువుకు ఆవలి వైపు మడకశిర, సిర వరకు నేషనల్ హైవే (544ఇ)ని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించారు. దీనివల్ల హిందూపురానికి ఒకవైపు బైపాస్‌ ఉన్నట్లే అయితే పట్టణ శివారులో కర్ణాటక సరిహద్దులో పారిశ్రామిక ప్రాంతం ఉంది. అటునుంచి వచ్చే వాహనాలన్నీ హిందూపురం లోపలి నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు అర్బన్‌ డీ-కంజెషన్‌ పాలసీలో భాగంగా ఎన్‌హెచ్‌-544ఇలో లేపాక్షి నుంచి హిందూపురం మీదుగా పట్టణానికి రెండో వైపు నుంచి రోడ్‌ నిర్మించి పరిగి సమీపంలో హైవేకి కలుపుతారు. అంటే దాదాపు 20 కి.మీ. మేర సెమీ రింగ్‌ రోడ్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే హైవేని ఈ సెమీ రింగ్‌ రోడ్‌ను కలిపితే హిందూపురం చుట్టూరా రింగ్‌ రోడ్‌ వచ్చినట్లు అవుతుంది.

రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు సాధించాలని ప్రణాళిక: దీని వ్యయం రూ.700 కోట్లుగా ప్రాథమిక అంచనా. ఇందులో భూసేకరణకు అయ్యే రూ.120 కోట్లలో సగం ఏపీ ప్రభుత్వం భరించనుంది. ఇంక ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్‌) ఇటీవల అంగీకారం తెలిపింది. సలహా సంస్థను నియమించి, 3 అలైన్‌మెంట్లు సిద్ధం చేయాలని తెలిపింది. ఎన్‌హెచ్‌ అధికారులు టెండర్లు పిలిచి సలహా సంస్థను ఎంపిక చేయనున్నారు. ఇదే పాలసీ కింద రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాలకు కూడా రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

అర్బన్‌ డీ-కంజెషన్‌లో భాగంగా పట్టణాల చుట్టూ రింగ్, సెమీ రింగ్, బైపాస్‌ రోడ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్నీ భాగస్వామిని చేస్తోంది. రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వ్యయాన్ని కొంతమేర భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రం ఖర్చుచేయాలి. లేదంటే మెటీరియల్స్‌కు సీనరేజ్‌ ఫీజులు, వివిధ పన్నులు, రాష్ట్ర జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలి. ఈ రోడ్లకు ఆనుకొని పట్టణ ప్రాంతం అభివృద్ధి చెందితే దానిద్వారా వచ్చే రాబడిలో కొంత కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో వేటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే ఆయా రోడ్ల నిర్మాణానికి మోర్త్‌ ముందుకొస్తుంది.

రాష్ట్రంలోని ఆ మూడు జిల్లాలకు మహర్దశ - 102 కి.మీ. మేర అర్ధ చంద్రాకృతిలో సెమీ రింగ్‌ రోడ్డు

102 కిలోమీటర్లు - రూ. 4450 కోట్లు వ్యయం - మూడు జిల్లాలను కలుపుతూ సెమీ రింగ్​ రోడ్డు