ETV Bharat / state

ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై శోధన - ఐదు మండలాల పరిధిలో నమూనాల విశ్లేషణ

కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సహకారంతో కేజీహెచ్​ నెఫ్రాలజీ విభాగం పరిశోధనలు ప్రారంభం - శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్టు పేరుతో మూడేళ్లపాటు కొనసాగుతుందన్న డాక్టర్ టి. రవిరాజు

Researching For The Roots of Uddanam Kidney Disease
Researching For The Roots of Uddanam Kidney Disease (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2026 at 8:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Researching For The Roots of Uddanam Kidney Disease At Visakha KGH: శ్రీకాకుళం జిల్లాలోని ఉ్దదానం ప్రాంత వాసులను కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధులకు గల మూలకారణాలు, భవిష్యత్తులో ఈ తరహా వ్యాధుల బారిన పడేవారిని ముందుగానే గుర్తించేందుకు విశాఖ కేజీహెచ్​లో పరిశోధనలు క్రమంగా ఊపందుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) సహకారంతో కేజీహెచ్​ నెఫ్రాలజీ విభాగం ఈ పరిశోధనలను ప్రారంభించింది. అందుకు అనుగుణంగా శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్టు (ఎస్​కేఆర్​పీ) పేరుతో అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేకంగా లేబొరేటరీని కేజీహెచ్​లో నెలకొల్పారు.

5 మండలాల పరిధిలో నమూనాల విశ్లేషణ: ఉద్దానం ప్రాంతంలో గల దాదాపు ఐదు మండలాల పరిధిలోని ప్రజల నుంచి 5,000 రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలను చేస్తున్నారు. ఈ పరిశోధక ప్రాజెక్టుకు మార్గదర్శిగా ప్రముఖ కిడ్నీ వ్యాధుల నిపుణులు, ఎన్టీఆర్ హెల్త్​వర్శిటీ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ టి. రవిరాజు, కేజీహెచ్​ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి. ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​లుగా విధులను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పరిశోధన వివరాలన్నింటినీ మెంటార్ డాక్టర్ టి. రవిరాజు ఈ సందర్భంగా వివరించారు.

ముందుగానే గుర్తించే అవకాశం: ప్రధానంగా కిడ్నీకి సంబంధించిన 12 రకాలు, మూత్రానికి చెందిన దాదాపు 6 రకాలైన పరీక్షలను నిర్వహిస్తున్నారు. అధునాతన బయోమార్కర్ సాంకేతికత సహాయంతో పలు రకాలైన పరీక్షలను నిర్వహిస్తున్నారు. తద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందా? లేదా? అనేది ముందుగానే తేలనుంది. ఒకవేళ మాత్రం కిడ్నీ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందని తెలిసినట్లయితే ముందు నుంచే అందుకు అవసరమైన ఔషధాలను ఉపయోగిస్తే నియంత్రణలోకి తీసుకురావొచ్చని డాక్టర్ రవిరాజు తెలియజేశారు. అంతేకాకుండా కనిష్టంగా 18 డిగ్రీల ఫ్రీజర్​లో నమూనాలను భద్రపరిచినట్లయితే ఏళ్ల తరబడి చెడిపోకుండా ఉంటాయని వైద్యనిపుణులు వివరిస్తున్నారు.

మూడేళ్లపాటు కొనసాగనున్న ప్రాజెక్టు: ఉద్దానం ప్రాంతంలోని 5000 వరకు నీరు అదే విధంగా మట్టి నమూనాలను సేకరించిన విద్యార్థులు వాటికి పరీక్షలను నిర్వహించనున్నారు. దాదాపు మూడేళ్లపాటు ప్రాజెక్టు కొనసాగుతుందని డాక్టర్ రవిరాజు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా విశ్లేషిస్తూ అప్రమత్తం చేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా రెండో దశలో జెనిటిక్స్​కు సంబంధించిన అంశాలపైనా పరిశోధనలను జరుపుతామని పేర్కొన్నారు.

పరిశోధనలో భాగస్వాములవుతున్న విద్యార్థులు: ముఖ్యంగా పరిశోధనలో భాగంగా డేటా విశ్లేషణకు గాను అమెరికాకు చెందిన హార్వర్డ్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అజయ్​సింగ్, అమెరికన్ నెఫ్రాలజీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ప్రబీర్​రాయ్​ చౌదరిల సహాయాన్ని తీసుకుంటున్నారు. పరిశోధనలో భాగంగా విశాఖపట్నంలోని బుల్లయ్య కళాశాల, మన్యం జిల్లాలోని గిరిజన వర్శిటీకి చెందిన ఎమ్మెస్సీ కెమికల్ విభాగం చదువుతున్న విద్యార్థులు ఈ పరిశోధనలో భాగస్వాములవుతున్నారు.

"మూడేళ్లపాటు ప్రాజెక్టు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా విశ్లేషిస్తూ అప్రమత్తం చేస్తాం. అదే విధంగా రెండో దశలో జెనిటిక్స్​కు సంబంధించిన అంశాలపైనా పలు పరిశోధనలను నిర్వహిస్తాం". -డాక్టర్ టి. రవిరాజు, ఎన్టీఆర్ హెల్త్​వర్శిటీ విశ్రాంత ఉపకులపతి

పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట

ఉద్దానం ప్రజలకు ఊరట - విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స