కాకినాడ పేలుడు ఘటన - మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం : సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు ఘటనలో 20 మంది మృతి - మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు - సామర్లకోట ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించిన సీఎం

Published : February 28, 2026 at 5:19 PM IST
|Updated : February 28, 2026 at 10:37 PM IST
Kakinada Fire Accident Update : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ఘటనలో 20 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి పంట పొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్, రెవెన్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
తక్షణ సాయం అందించాలి : సమాచారం అందుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు విజయనగరం నుంచి హెలికాప్టర్‌లో కాకినాడ బయలుదేరారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పేలుడు జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ షణ్మోహన్ ఘటన వివరాలను చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు వెంట బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల సమాచారాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలంలో చేపట్టిన సహాయకచర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచి బాణసంచా తయారుచేస్తున్నరని సీఎం చంద్రబాబు అడగ్గా, చాలా కాలం నుంచి అనుమతులు లేకుండా పరిశ్రమ నడుపుతున్నారని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అధికారులకు సీఎం సూచనలు చేశారు.
సామర్లకోట ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను శవపరీక్ష కోసం అధికారులు సామర్లకోట ఆసుపత్రికి తరలించగా మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వారందరితో మాట్లాడిన సీఎం ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాణసంచా పేలుడు ఘటనలో గాయపడి సామర్లకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ముగ్గురు క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
నలుగురు అధికారులు సస్పెండ్ : అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేలుడు ఘటన బాధాకరం చాలా దురదృష్టకరమని, క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన ప్రభుత్వం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్డీవో, డీఎస్పీ, డీఎల్‌వో, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
"పేలుడు ఘటన బాధాకరం చాలా దురదృష్టకరం. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేస్తాం. కొందరు వ్యక్తులు పదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అనుమతి లేకుండా బాణసంచా తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తాం."- నారా చంద్రబాబు నాయడు, ఏపీ సీఎం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు : కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— PMO India (@PMOIndia) February 28, 2026
ప్రమాదంలో మరణించిన వారి…
ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి : వేట్లపాలెం ప్రమాదంలో పలువురు చనిపోయారని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారని, ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్తున్నాయని, ఫోరెన్సిక్ బృందాలు వెళ్లి విచారణ వేగవంతం చేశాయని వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు సమీక్ష : బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనను అధికారులు తెలిపారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ ప్రమాదం సూర్య ఫైర్ వర్క్స్‌లో జరిగిందని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు.
ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు : ప్రమాద తీవ్రత పెరగడానికి అక్కడి పరిస్థితులే కారణమని స్థానికులు చెబుతున్నారు. అతి తీవ్రస్థాయిలో విస్ఫోటనం జరగడం, రెండు గంటలపాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునే సరికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారని అన్నారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడికి ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదని ఆరోపించారు. వరిపొలాలు బురదమయంగా ఉండటం వల్ల వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఫలితంగా చాలా సేపటి వరకు పేలుళ్లు కొనసాగాయని, ఘటనాస్థలి వద్ద పరిస్థితి భీతావహంగా మారిందని, మంటల్లో కాలిపోయి, తీవ్రంగా గాయపడిన బాధితులను అతికష్టం మీద ఆస్పత్రికి తరలించారని వివరించారు.
9 మంది పరిస్థితి విషమం : పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందన్న ఆర్‌డీవో బాణసంచా పరిశ్రమ యజమాని పరారీలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడలో ఆరుగురు, సామర్లకోటలో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి : కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం - 20కి చేరిన మృతుల సంఖ్య

