సెర్చ్ ఆపరేషన్ ముగిసింది - బాధిత కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది
సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ముగిసిన సెర్చ్ ఆపరేషన్ - తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న గంగపుత్రులు - కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయానికి కలెక్టర్‌కు అచ్చెన్న ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 11:46 AM IST
Vizag Fishermen Missing Updates : విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారు తిరిగొస్తారని వేయి కళ్లతో ఎదురుచూసిన వారికి కన్నీరే మిగిలింది! గత నాలుగు రోజులుగా సాగిన ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్త రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 72 గంటలపాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌ను ఇక ప్రయోజనం లేదని భావించి అధికారులు నిలిపివేశారు. అయితే బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు కోస్ట్‌గార్డ్ సహాయక చర్యలను బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించారు. అయినా దురదృష్టవశాత్తూ తప్పిపోయిన ఆరుగురు జాలర్ల ఆచూకీ మాత్రం లభించలేదు.
దీంతో సెర్చ్ ఆపరేషన్ ముగిసిందని ఇవాళ అధికారులు ప్రకటించారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయా అన్న కోణంలో తీర ప్రాంతంలో తనిఖీ చేయాలని గస్తీదళాలకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 72 గంటల గాలింపు పూర్తవగానే తక్షణ సాయం, పునరావాస చర్యలుంటాయి. మరోవైపు రూ.5 లక్షల చొప్పున గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీంకు అవసరమైన పత్రాలను మత్స్యశాఖ సిద్ధం చేస్తోంది.
జులై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జులై 4న వీరు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో కారి చిన్న సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురు జాలర్లు సముద్ర గర్భంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు ముగిసినట్లు ప్రకటించడంతో మత్స్యకార గ్రామాల్లో తీరని ఆవేదన నెలకొంది.
Vizag Boat Tragedy Updates : తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన గంగపుత్రుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇంటి పెద్దల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలంటూ హృదయవిదారకంగా రోదిస్తున్నారు. కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గల్లంతైన ఒక్కో మత్స్యకారుడి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
మరోవైపు బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ విశాఖ చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను, బాధితుల దీనస్థితిని స్వయంగా పరిశీలించనున్న ఆయన, ప్రభుత్వం తరపున ఆయా కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. కాగా ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు మరింత పరిహారం అందే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కొక్కరూ కనిపించకుండా పోయారు - బతకాలన్న ఆశతోనే 9 గంటల పాటు సముద్రాన్ని ఈదా!
నడి సంద్రంలో జాడ లేని జాలర్లు - మూడు రోజులుగా గాలిస్తున్నా లభించని ఆచూకీ

