ETV Bharat / state

తుని చిన్నారి మిస్సింగ్ కేసు - 70 రోజులైనా ఇంకా దొరకని జాడ

హైకోర్టుకు 15 రోజులకోసారి దర్యాప్తు వివరాలు అందజేస్తున్నామన్న తుని రూరల్‌ సీఐ - 5 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు - చిన్నారి ఆచూకీ కోసం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తండ్రి

Tuni Gnaneshwari Missing Case Updates
Tuni Gnaneshwari Missing Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 1:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tuni Gnaneshwari Missing Case Updates : కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించకుండా పోయిన కన్నబిడ్డ. బుడిబుడి నడకల సందడి పోయి ఇంటా బయటా అలుముకున్న నిశ్శబ్దం. రోజులు గడుస్తున్నా గుండె కోత మిగులుస్తున్న ఆచూకీ లేని అన్వేషణ. ఇది కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలంలోని సీహెచ్ ఆగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఉదంతంలో కన్నవారి ఆవేదన. రెండేళ్ల పసికందు అదృశ్యమై నేటికి దాదాపు 70 రోజులు కావస్తున్నా, ఆ పసిపాప జాడ మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఎవరైనా అపహరించి ఉంటే పాపను క్షేమంగా అప్పగించాలని, వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని పోలీసులు స్వయంగా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది.

చిన్నారి అదృశ్యంపై హైకోర్టుకు నివేదిక: మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి హైకోర్టుకు 15 రోజులకోసారి నివేదిక సమర్పిస్తున్నామని కాకినాడ జిల్లా తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 70 రోజులు కావోస్తుంది. ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన నుంచి నేటి వరకు చేపట్టిన దర్యాప్తు వివరాలు కోర్టుకు సమర్పించామని సీఐ తెలిపారు.

చిన్నారి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ న్యాయవాది జి. శ్రీకాంత్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక విచారణ చేపట్టింది. చిన్నారి అదృశ్యంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ చిన్నారి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలిస్తున్నట్లు రూరల్‌ సీఐ వివరించారు.

యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించిన తండ్రి: ఒకవైపు పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తుంటే, మరోవైపు కన్నకూతురు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి గణేష్‌ ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పాప అదృశ్యమైన రోజు నుంచి కరపత్రాలు పట్టుకుని ఊరూరు తిరుగుతూ, చిన్నారి జాడ కోసం వెతుకుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తన కుమార్తె జ్ఞాపకాలను, ఫొటోలు, వీడియోలను ప్రసారం చేసేందుకు ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. తన పాప సమాచారం ఇతర రాష్ట్రాలకు సైతం చేరాలనే ఆశతో యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించినట్లు తండ్రి గణేష్‌ తెలిపారు. ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటుందని, త్వరలోనే తన ఒడికి చేరుతుందనే ఆశతో ఆ తండ్రి చేస్తున్న పోరాటం అందర్నీ కదలిస్తోంది.

అసలేం జరిగిందంటే?: కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన సీహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవానిల రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి 2026 జూన్ 6న అదృశ్యమైంది. నెలలు గడిచినా పాప ఆచూకీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. చిన్నారి అదృశ్యమైన రోజునే కనిపించకుండా పోయిన వారి పెంపుడు కుక్క కొద్దిరోజులకు తిరిగి వచ్చినా, ఆ శునకం కూడా కొన్ని రోజులకే చనిపోయింది. పాప జాడ కోసం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ, హనుమాన్‌ బృందాలు రంగంలోకి దిగి బావులు, నీటి కుంటలు, అటవి ప్రాంతం, కొండపై జల్లెడ పట్టాయి. డ్రోన్ సాయంతో వెతికినా ఫలితం లేదు. సీసీఫుటేజ్‌తో పాటుగా వేలాది ఫోన్ కాల్స్ కూడా విశ్లేషించారు. అనుమానితుల్ని ప్రశ్నించారు. ఊరూరా పాప ఫొటోలతో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచినా ఆ పసిపాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు.

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్​ కేసు - 65 రోజులైనా చిక్కని జాడ

ఏడాదిగా అదృశ్యమైన చిన్నారుల వివరాలివ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం