ETV Bharat / state

ఎర్రని రంగులో పండ్లు, కూరగాయలు - ఆరోగ్యానికి ఎంతో మేలంటున్న శాస్త్రవేత్తలు

ఎర్రబెండ, ఎర్రముల్లంగి, ఎర్రని కాలీఫ్లవర్‌ సాగు చేస్తున్న అభ్యుదయ రైతులు - పంటల్లో ఈ రంగులేమిటి వాటికి అవి ఎలా వస్తున్నాయి అన్న సందేహం చాలామందిలో

అనంతగిరి రైతుల ప్రత్యేక పంటలు
అనంతగిరి రైతుల ప్రత్యేక పంటలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 29, 2026 at 4:42 PM IST

2 Min Read
Choose ETV Bharat

Red Custard Apples Cultivation In Alluri District : కాలం మారుతోంది, దాంతో పాటు ప్రజల అభిరుచులు కూడా మారుతున్నాయి. వారు ప్రతి దానిలోనూ ప్రత్యేకతను కోరుకుంటున్నారు. వాటిని ఆస్వాదిస్తున్నారు. ఈ ధోరణి క్రమంగా వ్యవసాయ రంగానికి కూడా విస్తరించింది. సాధారణంగా సీతాఫలం పండు పైభాగం ఆకుపచ్చగా, లోపలి గుజ్జు తెల్లగా ఉంటుంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలానికి చెందిన కొందరు రైతులు ఎరుపు రంగులో ఉండే సీతాఫలాలను సాగు చేస్తున్నారు.

సహజంగా వచ్చిన రంగులేనా : చింతపల్లి మండలంలో కొందరు అభ్యుదయ రైతులు ఎర్రబెండ, ఎర్రముల్లంగి, ఎర్రని కాలీఫ్లవర్‌ సాగు చేస్తున్నారు. బియ్యాన్ని నలుపు, ఎరుపు రంగుల్లో పండిస్తున్నారు. వీటిని బ్లాక్, బ్రౌన్‌రైస్‌గా పిలుస్తున్నారు. చాలామందికి పంటల్లో ఈ రంగులేమిటి వాటికి అవి ఎలా వస్తున్నాయి అన్న సందేహం కలుగుతుంది. ఇవి నిజంగా సహజసిద్ధంగా వచ్చిన రంగులేనా లేక కృత్రిమంగా ఏవైనా రసాయనాలు కలిపి అలా ఎర్రని రంగులోకి మారేలా చేశారా అన్న అనుమానాలు కొందరిలో కలుగుతుంటాయి.

వర్ణ ద్రవ్యాలే కారణం : పండ్లకు అసలు ఆ రంగులు ఎలా వస్తాయన్న విషయాన్ని చింతపల్లి ఉద్యాన పరిశోధనాస్థానం అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వి. రమణ వివరించారు. సీతాఫలాలకు ఎరుపు రంగు రావడానికి వాటిలో సహజంగా ఉండే ఆంథోసైనిన్స్‌ అనే వర్ణ ద్రవ్యాలే ప్రధాన కారణమన్నారు. ఈ అరుదైన రకానికి ఉండే ప్రత్యేకమైన జన్యు నిర్మాణం వల్ల వర్ణద్రవ్యాలు పండు తోలుతోపాటు కొన్నిసార్లు లోపలి గుజ్జుభాగం కూడా రంగు మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. 'రెడ్‌కస్టర్డ్‌ ఆపిల్‌' 'లాల్‌ఆట' 'రెడ్‌సుగర్‌ ఆపిల్‌' వంటి పేర్లతో పిలిచే ఈ ఎరుపురంగు సీతాఫలాలు అధికంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సాగులో ఉన్నాయి.

అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు : ఏపీలో అనంతపురం, వైఎస్సార్‌ కడప, కర్నూలు, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొందరు రైతులు సాగు చేస్తున్నారన్నారు. అల్లూరి జిల్లాలోని భిన్నమైన వాతావరణం వీటి సాగుకు అనుకూలంగా గుర్తించినట్లు తెలిపారు. పండ్లు, కూరగాయలు ఇలా ఎర్రని రంగుల్లో ఉన్నా అవన్నీ పూర్తిగా సహజసిద్దమైనవిగానే భావించాలన్నారు. కృత్రిమంగా వీటి రంగులను రూపొందించేందుకు ఆస్కారం లేదని వివరించారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని పేర్కొన్నారు.

గోదావరిలో దూకి దంపతుల గల్లంతు - సోషల్​ మీడియాలో దంపతుల ఆడియో, వీడియోలు

విజయవాడలో భారీగా పెరిగిన శానిటైజర్ల విక్రయం - అసలు విషయం తెలిస్తే షాక్​!