రికార్డు స్థాయిలో తిరుమల లడ్డూల విక్రయం - నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు హర్షం
గత ఏడాది తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయం - లడ్డూ నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన టీటీడీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 7:52 PM IST
Record Breaking Sale of Laddus in Tirumala: గత ఏడాది తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో 10 శాతం అదనంగా భక్తులకు లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్ముడవగా ఆ సంఖ్య 2025లో 13.52 కోట్లకు చేరినట్లు తెలిపింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 27న 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని పేర్కొంది.
ఏడాదిగా ప్రతిరోజూ 4 లక్షల వరకు లడ్డూలను తయారుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. శ్రీవారి పోటులో 700 మంది సిబ్బంది 2 షిఫ్టుల్లో శ్రమిస్తూ నియమ, నిష్టలతో ప్రసాదాలను తయారుచేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కాలంలో లడ్డూ నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం: మరోవైపు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. 10 రోజుల పాటు కొనసాగే ఈ దర్శన భాగ్యం మంగళవారం గోవిందనామ స్మరణల మధ్య ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయం తెరచి, మూలమూర్తికి ధనుర్మాస కైంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం వీవీఐపీలు, వీఐపీలకు వైకుంఠ ద్వారం మీదుగా దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 7.20 గంటలకు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ పర్వదినం సందర్భంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివార్లకు రథరంగ డోలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు, భక్తులు రథాన్ని లాగారు.
శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల వ్యాప్తంగా ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయ మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దివ్యానుభూతికి లోనవుతున్నారు. తూర్పు మాడవీధిలో శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనా అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో దాత సహకారంతో దీన్ని ముస్తాబు చేశారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు: ప్రధాన ఆలయం, బయట క్యూలైన్లలో పరిస్థితిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి నిరంతరం పరిశీలించారు. మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ ‘గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భక్తులకు ఏ ఇబ్బందులూ తలెత్తకుండా అద్భుత ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన పర్యవేక్షణ నడుమ భక్తకోటి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చామని ఈవో సింఘాల్ తెలిపారు. వీఐపీలకు దాదాపు 4,750 టికెట్లు జారీ చేశామని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-డిప్ విధానం విజయవంతమైందని హర్షం ప్రకటించారు.
తిరుమల కొండపై గంటలకొద్దీ నిరీక్షణకు చెక్ -‘కమాండ్’తో దర్శనాల్లో వేగం
శ్రీవారి ఆలయం ముస్తాబు - అర్థరాత్రి నుంచి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు

