ETV Bharat / state

రాయదుర్గం ‘జీన్స్’ - తక్కువ ధరకే బ్రాండెడ్ లుక్ - ఆన్‌లైన్ మోడల్స్‌ను తలదన్నేలా తయారీ

ఉమ్మడి అనంతలో వస్త్ర ప్రపంచం - సంక్రాంతికి సిద్ధమవుతున్న సరికొత్త డిజైన్లు - 20 వేల మందికి జీవనోపాధి

RAYADURGAM JEANS INDUSTRY
రాయదుర్గం ‘జీన్స్’ - తక్కువ ధరకే బ్రాండెడ్ లుక్ (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 17, 2025 at 9:12 AM IST

3 Min Read
Choose ETV Bharat

Rayadurgam Jeans Industry Thrives: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది 'జీన్స్' పరిశ్రమ. ఒకప్పుడు సాధారణ పట్టణంగా ఉన్న రాయదుర్గం నేడు 'మినీ ముంబయి'గా మారింది. ఇక్కడ తయారయ్యే జీన్స్ ప్యాంట్లు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఇక్కడ సంక్రాంతి సందడి నెలకొంది. వేల మంది కార్మికుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న వెరైటీ ప్యాంట్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. జీన్స్ అంటే పడిచచ్చే యువత కోసం సరికొత్త డిజైన్లు సిద్ధమవుతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఇస్తుండటంతో రాయదుర్గం జీన్స్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

వేల మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ: రాయదుర్గం పట్టణంలో వస్త్ర పరిశ్రమ కుటీర పరిశ్రమ స్థాయిని దాటి విస్తరించింది. పట్టణంలో సుమారు 2 వేలకు పైగా జీన్స్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. టైలరింగ్, కటింగ్, ప్యాకింగ్, రవాణా, ఇలా అనేక రకాలుగా వేల కుటుంబాలకు ఇది ఆసరాగా నిలుస్తోంది. కేవలం తయారీ యూనిట్లే కాదు, ఇక్కడ 4 భారీ వాషింగ్ యూనిట్లు కూడా నడుస్తున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఈ పరిశ్రమలే ప్రధాన జీవనాడి.

ముంబయి స్టైల్, రాయదుర్గం తయారీ: ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును ఇక్కడి కార్మికులు ఇట్టే పసిగడతారు. వారి నైపుణ్యం అద్భుతం. ముంబయి వంటి మహానగరాల్లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో అలాంటి డిజైన్లనే ఇక్కడ తయారు చేస్తారు. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే లేటెస్ట్ మోడల్స్‌ను చూసి, అచ్చం అలాగే కుట్టడం ఇక్కడి కార్మికుల ప్రత్యేకత. సీజన్‌ను బట్టి, యువత అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు డిజైన్లు మారుతుంటాయి. కార్గో, ఫార్మల్, బ్యాగీ జీన్స్, టాన్‌ జీన్స్, రెగ్యులర్ ఫిట్, కాటన్, లెనిన్, పెన్సిల్‌కట్, ఇలా ఒకటేమిటి? అన్ని రకాల వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. యువత మెచ్చే 'త్రీ ఫోర్త్' (3/4th) షార్ట్స్ కూడా భారీగా తయారవుతున్నాయి.

పండగ కళ, 30 శాతం వృద్ధి: రానున్న సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, కార్మికులు బిజీగా మారారు. రాత్రింబవళ్లు మిషన్లు పనిచేస్తున్నాయి. గిరాకీకి తగ్గట్టు సరుకును సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం సుమారు 30 శాతం వృద్ధి చెందిందని పెద్ద వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తయారైన సరుకును రాయదుర్గం, బెంగళూరు, బళ్లారి వంటి నగరాల్లోని వాషింగ్ ప్లాంట్లకు పంపిస్తారు. అక్కడ వాషింగ్ పూర్తయిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇస్తారు. అనంతరం ప్యాకింగ్ చేసి దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే రాయదుర్గానికి విస్తృత మార్కెట్ సదుపాయం ఉంది.

ధర తక్కువ, లుక్ ఎక్కువ: రాయదుర్గం జీన్స్ విజయ రహస్యం వాటి ధరలే. బ్రాండెడ్ జీన్స్ కొనలేని మధ్యతరగతికి ఇవి వరంగా మారాయి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండటంతో గిరాకీ బాగుంటోంది. స్థానికంగా తయారీ కేంద్రాల వద్ద ఒక జీన్స్ ప్యాంట్ ధర రూ. 400 నుంచి రూ. 600 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే సరుకు వివిధ పట్టణాల్లోని షోరూమ్‌లకు వెళ్లేసరికి దాని ధర రూ. 600 నుంచి రూ. 1200 వరకు పలుకుతుంది. షోరూమ్ క్వాలిటీతో, తక్కువ ధరకే లభిస్తుండటంతో స్థానికంగా కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకే ట్రెండీ లుక్ ఇస్తుండటంతో యువత రాయదుర్గం జీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

అచ్చం ఒరిజినల్​ మాదిరిగానే - కంపెనీ ప్రతినిధులే గుర్తుపట్టలేనంతగా

భార్య భర్తల మధ్య చిచ్చు - 4 ఏళ్ల బాలుడిని గొంతు నులిమి చంపిన పక్కింటి వ్యక్తి