గ్రూప్-2 ఉద్యోగం సాధించిన రైతు బిడ్డ - డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైన రవి
2018లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం - ఏఎస్ పేట మండలంలో కార్యదర్శిగా బాధ్యతలు - రవికి తోడ్పాటును అందించిన భార్య పద్మావతి - నేడు ప్రభుత్వ పాలనలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 1:14 PM IST
|Updated : March 4, 2026 at 2:54 PM IST
Ravi Inspiring Journey to Deputy Tahsildar at Nellore District : ఆపేసి ఓడిపోయిన వాళ్లున్నారు. కానీ ప్రయత్నించి ఓడిపోయిన వాళ్లు లేరు. ఇది ఫేమస్ సినిమా డైలాగ్ కావచ్చు. కానీ ఓ యువకుడు ఈ అక్షరాలను నిజం చేసి చూపించాడు. కలెక్టర్ కావాలని కసితో చదివినా ఫలితం రాలేదు. వెంటనే గ్రూప్స్ మెుదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. పదే పదే ఎదురుదెబ్బలు తగిలినా పరుగు ఆపలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి పంచాయతీ కార్యదర్శి అయ్యాడు. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ గ్రూప్-2 డిప్యూటీ తహసీల్దార్ కొలువు కొట్టేశాడు నెల్లూరుకు చెందిన రవి.
కుటుంబ నేపథ్యం : ఆకాశమే హద్దుగా శ్రమిస్తే పేదరికం అడ్డుకాదని నిరూపించాడీ యువకుడు. రెక్కాడితే గానీ డొక్కాడని వ్యవసాయ కూలీల బిడ్డ. నేడు ప్రభుత్వ పాలనలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. పట్టుదలకు పేదరికం అడ్డుకాదని, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు. ఈ యువకుడి పేరు రవి. నెల్లూరు జిల్లా గోనుపల్లి స్వస్థలం. తల్లిదండ్రులు దశయ్య, రమాదేవిలు నిరుపేద వ్యవసాయ కూలీలు. తాము పడ్డ కష్టం తమ బిడ్డ పడకూడదని, వానా కాలం, ఎండ కాలం అనకుండా పొలం పనుల్లో శ్రమిస్తూ రవిని చదివించారు. అమ్మనాన్న ఆశయానికి తగ్గట్టే రవి కూడా చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు.
ఉద్యోగం చేస్తూనే పుస్తకాలతో కుస్తీ : 2018లో ఏపీపీఎస్సీ పరీక్ష రాశాడు రవి. ఉత్తీర్ణత సాధించి ఏఎస్.పేట మండలంలో పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. ఉద్యోగం వచ్చినా ఆయనలోని కసి తగ్గలేదు. గ్రూప్-2 సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు. ఉద్యోగం చేస్తూనే పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఆ పట్టుదలే ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి చేర్చింది. ఈ విజయం సాధించడానికి సాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు చెబుతున్నాడు రవి. ప్రభుత్వంలో మరింత ఉన్నత హోదా పొంది సమాజానికి సేవ చేయడమే తన ధ్యేయమంటున్నాడు.
"సివిల్స్, గ్రూప్స్ మీద ఉన్నా ఆసక్తితో హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డిలో కోచింగ్ తీసుకున్నాను. రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. 2018లో ఏపీపీఎస్సీ పరీక్ష రాయగా, ఉత్తీర్ణత సాధించి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాను. గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది." - రవి, గ్రూప్-2 ర్యాంకర్
రవికి తోడ్పాటును అందించిన భార్య పద్మావతి : భార్య పద్మావతి రవికి అండగా నిలబడింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె రవి ఉన్నత లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంది. ఆమెతో పాటు రవి తల్లిదండ్రులు, స్నేహితులు కూడా ప్రోత్సాహం అందించారు. సమస్యలు వస్తాయి, సవాళ్లు ఎదురవుతాయి. అయినా సరే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం తప్పక వస్తుందనడానికి రవి జీవితమే నిదర్శనం.
రక్షణ రంగంలో సత్తాచాటిన యువతీ యువకులు- 50 శాతం మహిళలే
సైబర్ నేరాలు, ఫొటో మార్ఫింగ్‌లకు అడ్డుకట్ట - వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన స్నేహితులు

