ETV Bharat / state

సవాళ్లను అధిగమించి - బిజినెస్​లో రాణించి

మగవాళ్లే చేయలేక నష్టపోతున్నారని, నీలాగే ఎంతోమంది ప్రయత్నించి తర్వాత వ్యాపారాన్ని మూసేసి వేరే పనులు చేసుకుంటున్నారన్న మాటలు దాటి గెలిచి స్ఫూర్తిగా నిలుస్తున్న రత్నకుమారి

Ratnakumari Successfully Runnning a Rooster Farm With Profit
స్ఫూర్తిగా నిలుస్తున్న యడ్లపల్లి రత్నకుమారి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 30, 2026 at 10:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ratnakumari Successfully Runnning a Rooster Farm With Profit: మగవాళ్లతో పోటీ అవసరమా?’ ‘నువ్వు చేయలేవు నష్టాలు వస్తాయి’ ‘అసలు నీకేం తెలుసని?’ వ్యాపారం చేస్తాననగానే ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలే ఇవి. అయినా అడుగుపెట్టారు యడ్లపల్లి రత్నకుమారి. రాణిస్తుండటమే కాదు మరికొందరికి ఉపాధినీ చూపిస్తున్నారు. ఇంతకీ తన వ్యాపారమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

రత్నకుమారి పదో తరగతి మాత్రమే చదివింది. వారిది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధి రుస్తుంబాద. పెళ్లైన కొత్తలో తన భర్త రాజేశ్‌ రకరకాల నాటు కోళ్లు పెంచేవారు. వాటికే ఎక్కువ సమయం కేటాయించేవారు. మొదట్లో కోపం వచ్చినా క్రమంగా తానూ ఆయనతో కోళ్ల షెడ్లకు వెళ్లడం ప్రారంభించింది. తన కూడా వీటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. మొదట్లో ‘కోళ్లు పెంచడం ఏముంది? మేత వేసి, నీళ్లు పెడితే చాల’ నుకునేది. అందులోకి దిగిన తర్వాతే కష్టమెంతో తెలిసిందని చెబుతుంది రత్నకుమారి. కోళ్ల జాతులు, వాటి పెంపక విధానాలు, తెలుగు జాతుల ప్రత్యేకతలు, వాటిని పెంచే శాస్త్రాలు ఇలా ఎన్నో ఉంటాయని తెలిసి నేర్చుకోవడం ప్రారంభించారు.

నవ్వారని వెనుదిరగలేదు: ఇంతలో వ్యాపారంలో నష్టాలు రావడంతో పెంపకం ఆపేద్దామన్నారు రత్నకుమారి భర్త. అందరూ అదే మంచి నిర్ణయమన్నా కూడా ఆమెకు మాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అందుకే తానే వ్యాపారాన్ని నిర్వహిస్తానని, లాభాల్లోకీ తీసుకొస్తానని ముందడుగేసింది. తను అలా చెప్పినప్పుడు అందరూ నవ్వారని ఆమె అన్నారు. ‘మగవాళ్లే చేయలేక నష్టపోతున్నారని, నీలాగే ఎంతోమంది ప్రయత్నించి తర్వాత వ్యాపారాన్ని మూసేసి వేరే పనులు చేసుకుంటున్నారన్నారు. నీ వల్ల ఏమవుతుంది అని ఇంట్లోవాళ్లూ వద్దన్నారని ఆమె వివరిస్తుంది. తాను మాత్రం ఒక్క అవకాశమిస్తే నిరూపించుకుంటా అన్నారు, దానికి తన భర్త రత్నకుమారిని ప్రోత్సహించారు.

రత్నకుమారి ముందు వ్యాపారంలో రాణిస్తున్న కొందరిని సంప్రదించారు. సాధారణంగా ఎవరూ కోళ్ల పెంపక రహస్యాలను చెప్పరు. కానీ తనకు దీనిపై ఉన్న అంకితభావాన్ని చూసి, వాళ్లు మార్గనిర్దేశం చేశారు. తక్కువ ధరకే సీడ్‌ కోళ్లు ఇచ్చారు. తర్వాత తమ పొరపాట్లు, ఏం చేస్తే లాభాలొస్తాయనే విషయాలపై దృష్టిసారించారు. ఉత్పత్తి ఎంత నాణ్యమైనదైనా వినియోగదారులకు తెలియకపోతే వ్యర్థమనే విషయాన్ని గ్రహించారు. తెలిసేలా ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఓ ఫ్రెండ్‌ ద్వారా సోషల్‌ మీడియా గురించి తెలుసుకున్నారు. షెడ్లు శుభ్రం చేయడం, కోళ్లకు ప్రొటీన్‌ ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, వాటికి ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటివన్నీ వీడియోలు తీసి ‘రత్న ఫామ్స్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేవారు. వాటిని చూసి తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి కోళ్లు తీసుకెళ్లడం మొదలుపెట్టారని రత్నకుమారి పేర్కొన్నారు. అలా వ్యాపారం క్రమంగా పెరిగి, విస్తరించిందంటున్నారు.

స్ఫూర్తిగా నిలుస్తున్నారు: ఒక్కో పుంజును జాతి, రకం, వయసు, రంగు ఆధారంగా విక్రయిస్తుంటారు. వీటిని కోడి పందేల కోసం ఎక్కువగా తీసుకెళ్తుంటారు. రూ.లక్ష పలికేవీ ఉంటాయి. ఫలదీకరణ గుడ్లను ఒక్కొక్కటి రూ.300 నుంచి అమ్ముతున్నామన్నారు. కోళ్లను పెంచాలనుకునేవారు వీటిని తీసుకెళ్తుంటారని తెలుపుతున్నారు. తెలుగు కోళ్ల జాతుల్లో పచ్చకాకి, సేతువా, నెమలి, కాకిడేగ, గట్టికాకులు, కోడికాకి, అబ్రాసు, పింగళ వంటివెన్నో జాతులు తమ వద్ద ఉన్నాయంటారీమె. మొత్తంగా ఏడాదికి రూ.20లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు తెలుపుతున్నారు. పలువురికి ఉపాధినీ కల్పిస్తున్నారు.

అయితే ఇది ఒక్క రాత్రి, నెలలో సాధ్యమవ్వలేదంటారు రత్నకుమారి. ఇది తమ అయిదేళ్ల కష్టమని, ఈ రంగంలో మహిళలు అరుదు. తాను అందరికీ స్ఫూర్తిగా నిలిచి మహిళలూ కోళ్ల పెంపకంలో ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడమే తన లక్ష్యమంటారు. దేశీ కోళ్ల పెంపకం చాలా పెద్ద శాస్త్రంమని, ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేశానన్నారు. తాను నేర్చుకున్న విషయాలను నలుగురికీ నేర్పిస్తున్నట్లు అందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలుపుతున్నారు.

అరటి నారతో అలంకరణ వస్తువులు - మహిళల జీవితాలను మార్చేసిన ఆలోచన

స్టెతస్కోప్​కి గుడ్​బై - 'ఫ్రోత్ అండ్ ఫ్రెండ్స్' పేరుతో కేఫ్​ ఏర్పాటు