పేదలకు మెరుగైన బియ్యం - రేషన్ బియ్యంలో నూకలు ఇక 10% మాత్రమే
సెప్టెంబరు 1వ తేదీ నుంచే 17 జిల్లాల్లో మొదలైన పంపిణీ - రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రతి కార్డుదారుకు 10 శాతం నూకలతో కూడిన బియ్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 3, 2026 at 10:53 AM IST
Ration Rice with Only 10% Broken Rice : రేషన్ బియ్యంలో నూకలు ఇక 10 శాతమే ఉంటాయి. మరింత మెరుగైన బియ్యం పంపిణీలో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు వీటిని అందిస్తోంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచే 17 జిల్లాల్లో పంపిణీ మొదలైంది. వచ్చే నెలలో 20 జిల్లాలకు విస్తరిస్తారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రతి కార్డుదారుకు 10 శాతం నూకలతో కూడిన బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి.
ఒకప్పుడు రేషన్ బియ్యంలో 25శాతం నూకలు : ఒకప్పుడు రేషన్ బియ్యంలో 25శాతం నూకలు ఉండేవి. తర్వాత సార్టెక్స్ పేరుతో 15 శాతం నూకలతో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు మరింత తగ్గించి 10 శాతం నూకలతోనే పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దుకాణాలకు బియ్యం చేరగా, కొన్ని దుకాణాల్లో పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కొన్ని చోట్ల గత నెలలో సరఫరా చేసిన నిల్వలు (15% నూకలు) ఉన్నాయి. అవి పంపిణీ చేశాక కొత్తగా వచ్చిన 10% నూకలున్న బియ్యాన్ని కార్డుదారులకు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ బియ్యాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అనుమతి కోరుతూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖకు కమిషనర్ కన్నబాబు లేఖ రాశారు. అనుమతి వస్తే 10% నూకలతో కూడిన స్టీమ్ బియ్యం పంపిణీ చేస్తారు.
నాణ్యతను మెరుగు పరచడం ద్వారా : రాష్ట్రంలో 4.35 కోట్ల మంది పేదలకు నెలకు 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యానికి ప్రభుత్వానికి సగటున రూ.46 వరకు ఖర్చవుతోంది. అయితే అధికశాతం కార్డుదారులు రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంట్లో వినియోగానికి మార్కెట్లో దొరికే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం నాణ్యతను మరింత మెరుగు పరచడం ద్వారా అమ్ముకునే పరిస్థితి ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే నూకలు తగ్గించడంతోపాటు స్టీమ్ రైస్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్ల పేరుతో విక్రయించేవాటిలో అధికశాతం స్టీమ్ బియ్యమే. కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. 10% నూకలతో పంపిణీ చేసే బియ్యాన్ని క్యూఆర్ కోడ్‌తో ఉన్న బస్తాల్లో సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో 29,844 రేషన్ దుకాణాలున్నాయి.

