క్లిష్టమైన సమస్యకు విజయవంతంగా చికిత్స - వృద్ధుడికి పునర్జన్మిచ్చిన కిమ్స్ వైద్యులు
శ్రీనివాసులు అనే వ్యక్తి మెదడులో ఉబ్బిన రక్తనాళాలు - శస్త్రచికిత్స చేసే సమయంలో అధిక రక్తస్రావం - అయినా సరే విజయవంతంగా ఆపరేషన్ పూర్తి - వివరాలను వెల్లడించిన న్యూరోసర్జన్ ఎన్. సుమంత్ కుమార్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 10, 2026 at 3:56 PM IST
|Updated : June 10, 2026 at 4:38 PM IST
Rare Neurological Disorder Successfully Treated At Kims Hospital In Kurnool: తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల వృద్ధుడికి పునర్జన్మను ప్రసాదించారు కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను చికిత్సను అందించిన సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎన్. సుమంత్ కుమార్ వెల్లడించారు.
మెదడులో ద్రవాలు లీకై ఉబ్బిన రక్తనాళాలు: కర్నూలు పట్టణానికి చెందిన శ్రీనివాసులు (61) వ్యక్తి మెదడుపై భాగంలో రక్తం గడ్డకట్టింది. ఈ సమస్యతో రెండు సర్జరీలు చేయించుకున్నారు. అయినా కానీ ఆశించిన ఫలితం దక్కకపోగా సమస్య మరింత జఠిలమైనది. తర్వాత మా బృందం లోతుగా పరిశీలించారు. వెన్నెముక పైభాగంలో ఉన్న రక్షణ పొర చిట్లిపోవడంతో మెదడు, వెన్నుపామును రక్షించే ద్రవం బయటకు లీకవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెదడులో ఆ ద్రవం ఒత్తిడి అసాధారణంగా తగ్గిపోయి, అత్యంత అరుదైన ఆరోగ్య సమస్య ఏర్పడిందని నిర్ధారించారు. ఈ సమస్యే రోగి పరిస్థితి విషమించడానికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని గుర్తించడం, చికిత్స చేయడం నాడీ సంబంధిత వ్యాధుల్లోనే అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొన్నారు.
విజయవంతంగా శస్త్రచికిత్స: మొదట మెదడు నుంచి లీకయ్యే ద్రవాన్ని ఆపేందుకు మూడు సార్లు ఎపిడ్యూరల్ బ్లడ్ ప్యాచ్ విధానాన్ని అమలు చేశామని న్యూరోసర్జన్ డాక్టర్ ఎన్. సుమంత్ కుమార్ అన్నారు. రోగికి ఉన్న సమస్య తీవ్రంగా ఉండడంతో మేము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చివరి ప్రయత్నంగా ఓపెన్ డ్యూరల్ టియర్ రిపేర్ శస్త్రచికిత్స చేపట్టామన్నారు. డ్యూరా చిట్లిన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడం మాకు పెద్ద సవాలుగా మారిందని వివరించారు. సీఎస్‌ఎఫ్ లీకేజీ కారణంగా వెన్నెముక చుట్టూ ఉన్న సిరలు విపరీతంగా ఉబ్బిపోవడంతో శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం చోటు చేసుకుంది. అయినప్పటికీ వైద్యులు అత్యంత జాగ్రత్తగా రక్తస్రావాన్ని నియంత్రించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
25 రోజుల తర్వాత మెరుగైన ఆరోగ్యం: రోగి దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందగా, అందులో 23 రోజులు ఐసీయూలోనే గడిపారు. ఈ సమయంలో పూర్తిగా పడుకున్న స్థితిలో ఉండాల్సి రావడం, అనేక రోజుల పాటు నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోవడం వల్ల పోషకాహార లోపం, బెడ్‌సోర్స్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. అయితే శస్త్రచికిత్స అనంతరం ఒకరోజు ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ మరుసటి రోజు అకస్మాత్తుగా పరిస్థితి విషమించింది. అయినా సరే వైద్యులు నమ్మకాన్ని కోల్పోకుండా నిరంతర పర్యవేక్షణతో చికిత్సను కొనసాగించారు. అనంతరం రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ఈ విధంగా 25 రోజుల తర్వాత తొలిసారిగా మాట్లాడగలిగారు. ట్రాకియోస్టమీ ట్యూబ్‌ను తొలగించగా, ఆహారం తీసుకోవడం ప్రారంభించి, అనంతరం స్వయంగా నడిచే స్థాయికి చేరుకున్నారని డాక్టర్ ఎన్. సుమంత్ కుమార్ తెలియజేశారు.
ఆనందం వ్యక్తం చేసిన వైద్యులు: దాంతో రోగి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో వైద్యులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ చికిత్సలో న్యూరోసర్జరీ, న్యూరాలజీ, అనస్థీషియా, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, రేడియాలజీ, ఐసీయూ వైద్య బృందాలు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సహాయక విభాగాలు సమన్వయంతో పని చేయడంతో అతను కోలుకున్నాడు. అత్యంత అరుదైన నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో సమగ్ర నిర్ధారణ, బహుళ విభాగాల సమన్వయంతో కూడిన వైద్య సేవల ప్రాముఖ్యతను ఈ కేసు మరోసారి చాటిచెప్పిందని డా. సుమంత్ కుమార్ పేర్కొన్నారు.

