గ్రామీణ ప్రాంతాల్లోనూ డెలివరీ సేవలు - 'లోకల్‌బాయ్స్' యాప్ రూపకల్పన
'లోకల్‌బాయ్స్' యాప్ రూపొందించిన యువకుడు రాము - అన్నీ అవసరాలను ఒకే వేదికపై ప్రజలకు అందిస్తూ లాభాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లోకల్‌బాయ్స్ సేవలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 6:41 PM IST
Ramu Local Boys App Designed by Prakasam District: పట్టణాల్లో జీవితం యాప్‌ల చుట్టూ తిరుగుతోంది. ఒక క్లిక్‌తో భోజనం, ఇంకో క్లిక్‌తో ప్రయాణం సిద్ధం అవుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సౌకర్యాలు కలలాగే మిగిలాయి. ఈ లోటును అవకాశంగా మార్చుకున్నాడా యువకుడు. 'లోకల్‌బాయ్స్' పేరుతో యాప్ రూపొందించాడు. అన్ని అవసరాలను ఒకే వేదికపై అందిస్తూ లాభాలు అర్జిస్తున్నాడు. అంతేకాదు గ్రామాలకు డిజిటల్ దారులు వేస్తూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు కందుకూరుకు చెందిన రాము.
పట్టణ ప్రజల బతుకులే గజిబిజి. ఉదయం లేచినప్పటి నుంచి కెరీర్ కోసం ఉరుకుల పరుగులే. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలంటే సమయం ఉండదు. వండుకొని తినాలంటే ఓపిక ఉండదు. అందుకే నగరం అంతటా యాప్‌లే దిక్కు. మరి గ్రామాల్లో పరిస్థితి ఏంటి ? అక్కడ కూడా అవసరాలన్నీ ఉన్నాయి. కానీ యాప్‌లు మాత్రం లేవు. అందుకు ఈ యువకుడు పల్లెల అవసరాలను తీర్చేందుకు లోకల్‌బాయ్స్ యాప్‌తో ముందుకొచ్చాడు.
కుటుంబ నేపథ్యం: ఈ యువకుడు పేరు రాము. ప్రకాశం జిల్లా కందుకూరు స్వస్థలం. తల్లిదండ్రులు రోజువారి కూలీలు. ఆర్థిక ఇబ్బందులతో డిగ్రీ మధ్యలో ఆపేశాడు రాము. బతుకుదెరువు కోసం ఏదైన పని చేయాలనుకున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు రాము. ఆదాయం అంతంతమాత్రమే రావడంతో ఉన్నఫలంగా వాటిని వదిలేసి ఇంటిబాట పట్టాడు.
కస్టమర్లకు అసౌకర్యం కల్పించకుండా: పట్టణాల్లో స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, జెప్టో, అర్బన్ కంపెనీ, ఓలో, ఊబర్, ర్యాపిడో అందిస్తున్న సేవలు గ్రామీణ ప్రాంతాల్లో లేవని గుర్తించాడు రాము. ఊర్లో కూడా అలాంటి సౌకర్యాలు వస్తే బాగుంటుందని భావించాడు. 2019లో 'లోకల్ బాయ్స్' పేరుతో యాప్ రూపొందించాడు. వాట్సాప్ మెసేజ్ చేసినా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారి ఇంటికొచ్చి ఇస్తున్నారు. కస్టమర్లకు ఏలాంటి అసౌకర్యం కల్పించకుండా సమయానికి ఆహారం, మందులు, నిత్యావసరాలు అందిస్తున్నారు.
స్థానికంగా ఉన్న వ్యాపారులతో టైఅప్ కుదుర్చుకొని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాడు రాము. మెుదట్లో కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో విస్తరించామని అంటున్నాడు.
''2019లో లోకల్‌బాయ్స్ యాప్ రూపొందించాను. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే? పబ్లిక్కు డెలివరీ, సర్వీసులతో పాటుగా ఎమర్జెన్సీ సర్వీసులూ అందించాలనే ఈ యాప్ ప్రారంభించాను. కస్టమర్‌కు ఫుడ్, నిత్యావసరాలతో పాటు మందులు కావాలంటే మాకు కాల్ చేసినా లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నా వారికి సర్వీసులు అందిస్తున్నాం. భవిష్యత్‌లో చిన్న చిన్న గ్రామాలకు సైతం తీసుకువెళ్తాం.'' - రాము, లోకల్ బాయ్స్ వ్యవస్థాపకుడు
వ్యాపార పరంగా లాభాలు: మెుత్తం 101 ప్రాంఛైజీలు ఉన్నాయన్న ఆయన 1600 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నాడు. రూ.10 లక్షలకు పైగా కస్టమర్లు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అంటున్నారు రాము. ఎవరికైనా ప్రాంఛైజస్ కావాలంటే ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగానే ఇస్తున్నారు. దాంతో పాటు సాంకేతిక సహకారం, సాఫ్ట్‌వేర్ కూడా అందిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా లోకల్ బాయ్స్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా తమకు ఉపాధి దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు డెలివరీ బాయ్స్. అతి తక్కువ కాలంలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తూ, కస్టమర్ల అభిమానాన్ని సంపాదించడమే కాకుండా, వ్యాపార పరంగా లాభాలు అర్జిస్తున్నాడు లోకల్‌బాయ్స్ యాప్ నిర్వహకుడు రాము.
ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు కావు - కృషి, పట్టుదలతో కానిస్టేబుల్ ఉద్యోగాలు
రీల్స్‌కు బదులు యూట్యూబ్‌లో క్లాసులు - పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నఅభ్యర్థులు

