ETV Bharat / state

కిమ్స్ హాస్పిటల్స్​లో లూప‌స్ యోధుల ర్యాంప్ వాక్‌

అంత‌ర్జాతీయ లూప‌స్ డే సంద‌ర్భంగా కిమ్స్​లో ర్యాంప్​ వాక్​ - స‌రైన చికిత్స‌తో లూప‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం - దేశంలో 20వేల మంది రుమ‌టాల‌జిస్టుల అవసరం - అందుబాటులో కేవలం 800 మందే వైద్యులు

Ramp walk by lupus warriors at KIMS Hospital
Ramp walk by lupus warriors at KIMS Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2026 at 8:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ramp walk by lupus warriors at KIMS Hospital : మ‌న దేశంలో చాలామందిని ప్ర‌భావితం చేస్తున్న సిస్ట‌మెటిక్ లూప‌స్ ఎరిథ‌మ‌టోస‌స్ (ఎస్ఎల్ఈ) వ్యాధి విష‌యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స‌రైన స‌మ‌యానికి చికిత్స తీసుకుంటే దీని ల‌క్ష‌ణాల‌న్నింటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని, అదే స‌మ‌యంలో చికిత్స‌కు నిర్ల‌క్ష్యం చేసినా, వైద్యుల వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి ఆల‌స్యం చేసినా ప్రాణాపాయం సంభ‌వించే ప్ర‌మాదం కూడా ఉంటుందని తెలిపారు. అంత‌ర్జాతీయ లూప‌స్ డే సంద‌ర్భంగా సోమవారం కిమ్స్ ఆస్ప‌త్రిలో ఈ వ్యాధితో పోరాడుతున్న వారితో వినూత్నంగా ర్యాంప్ వాక్ నిర్వ‌హించారు.

Ramp walk by lupus warriors at KIMS Hospital
40 మంది లూప‌స్ యోధుల ర్యాంప్ వాక్‌ (ETV Bharat)

సుమారు 40 మంది యోధులు ర్యాంప్ వాక్ చేసి, త‌మ ఆత్మ‌విశ్వాసాన్ని, వ్యాధిని జయించ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శించారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన ప‌లువురు, న‌గ‌రానికి చెందిన ప‌లువురు వైద్య నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆసియాలోనే ఇలా ర్యాంప్ వాక్ నిర్వ‌హించ‌డం ఇది ఐదోసారి. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లినిక‌ల్ ఇమ్యునాల‌జీ, రుమ‌టాల‌జీ విభాగం క్లినిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వీర‌వ‌ల్లి శ‌ర‌త్ చంద్ర‌మౌళి ఆలోచ‌న‌ల ఫ‌లితంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. లూపస్ ఉంద‌ని చెప్పుకోవ‌డానికే ఒక‌ప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. దాన్నుంచి, ఇప్పుడు పోరాడే మ‌హిళ‌గా నేరుగా ఆస్ప‌త్రికి వ‌చ్చి ఇక్క‌డ ర్యాంపుపై మోడ‌ళ్ల‌లా ర్యాంప్ వాక్ చేసే స్థాయికి రావ‌డానికి వైద్యులు ఇచ్చిన ప్రోత్సాహమే ప్ర‌ధాన కార‌ణం.

Ramp walk by lupus warriors at KIMS Hospital
కిమ్స్ హాస్పిటల్స్​లో లూప‌స్ యోధుల ర్యాంప్ వాక్‌ (ETV Bharat)

వ్యాధిగ్రస్తుల్లో మహిళలే అధికం : ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రమౌళి మాట్లాడారు. మ‌న దేశంలో లూప‌స్ ఎక్కువ‌గానే ఉన్నా, ఎంత‌మందికి వ‌స్తోంద‌న్న అధికారిక లెక్క‌లు లేవని ఆయన వెల్లడించారు. తమ వ‌ద్ద‌కు రోజూ వ‌చ్చే సుమారు 100-120 మందిలో 20-25 మంది లూప‌స్ వ్యాధితో పోరాడే వారే ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా ఇది వేర్వేరుగా ఉంటోందన్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్ర‌తి ల‌క్ష మందిలో 20-150 మందికి ఇది ఉంటోందని ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో లూప‌స్ స‌మ‌స్య‌లు వ‌చ్చినా, అవ‌గాహ‌న రాహిత్యం, అందుబాటులో రుమ‌టాల‌జిస్టులు లేక‌పోవ‌డంతో గుర్తించ‌లేక‌పోతున్నారని తెలిపారు. ఈ వ్యాధితో పోరాడుతున్న వారిలో 90% మంది మ‌హిళ‌లే ఉండ‌డం మ‌రో బాధాక‌ర‌మన్నారు. సాధార‌ణంగా 15-45 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు (పున‌రుత్ప‌త్తి ద‌శ‌)లోనే ఇది వ‌స్తుందని వెల్లడించారు.

Ramp walk by lupus warriors at KIMS Hospital
అంత‌ర్జాతీయ లూప‌స్ డే సంద‌ర్భంగా కార్యక్రమం (ETV Bharat)

దేశవ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే : లూప‌స్ శ‌రీరంలో ఏ భాగాన్నైనా ప్ర‌భావితం చేయొచ్చని డాక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రమౌళి తెలిపారు. చాలాసార్లు అస‌లు దాని గురించి తెలియ‌దని అన్నారు. ఇది ఒక దీర్ఘకాలిక ఆటో-ఇమ్యూన్ వ్యాధి అని తెలిపారు. ఇందులో మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి అతిగా క్రియాశీల‌కం అయిపోయి, సాధార‌ణ క‌ణ‌జాలాల‌పై దాడిచేస్తుందన్నారు. దీనివ‌ల్ల కొంద‌రికి చర్మం మీద ద‌ద్దుర్లు రావ‌డం, జుట్టు ఊడిపోవ‌డం, నోట్లో పుండ్లు ప‌డ‌టం, కీళ్ల వాపులు, నొప్పి తీవ్రంగా అనుభవించండం, జ్వ‌రం లాంటివి రావ‌చ్చని వెల్లడించారు. ఇది ఊపిరితిత్తులు, మూత్ర‌పిండాలు, గుండె, మెద‌డు, న‌రాలు, చ‌ర్మం, ర‌క్తం ఇలా దేన్న‌యినా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో 20వేల మంది వ‌ర‌కు రుమ‌టాల‌జిస్టులు అవ‌స‌రం ఉండ‌గా, కేవ‌లం 800 మంది మాత్ర‌మే అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. ఈ వ్యాధికి చికిత్స స‌రిగా అంద‌క‌పోవ‌డానికి ఇదే ప్రధాన కార‌ణమని తెలిపారు.

Ramp walk by lupus warriors at KIMS Hospital
Ramp walk by lupus warriors at KIMS Hospital (ETV Bharat)

లూప‌స్ వ‌చ్చింద‌ని గుర్తించ‌డం ఎలా? : విప‌రీత‌మైన నీర‌సం, అల‌స‌ట‌, జ్వ‌రం, బ‌రువు త‌గ్గ‌డం, శ‌రీరంపై ద‌ద్దుర్లు, ఎండలో వెళ్లినప్పుడు ముఖంపై ఎర్రగా దద్దుర్లు రావ‌డం, జుట్టు రాల‌డం, ఆర్థ‌రైటిస్‌, మూత్రంలో ప్రోటీన్ పోవ‌డం, మూత్రంలో ర‌క్తం ప‌డ‌డం, త్వ‌ర‌గా మ‌ర్చిపోవ‌డం, ర‌క్త‌హీన‌త‌, తెల్ల ర‌క్త‌క‌ణాలు లేదా ప్లేట్‌లెట్లు త‌గ్గ‌డం, త‌ర‌చు గ‌ర్భ‌స్రావాలు కావ‌డం, లేదా త‌ర‌చు నోట్లో పుళ్లు రావ‌డం ఇవ‌న్నీ కూడా లూపస్ ల‌క్ష‌ణాలే. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన తొలిద‌శ‌లోనే రుమ‌టాల‌జిస్టును సంప్ర‌దిస్తే దీన్ని పూర్తిగా న‌యం చేయ‌గ‌లం. అయితే చాలామంది ఈ ల‌క్ష‌ణాల‌ను ఇత‌ర స‌మ‌స్య‌లుగా భావించి, రెండు మూడేళ్ల త‌ర్వాత రుమ‌టాల‌జిస్టుల‌ను సంప్ర‌దించ‌డం లేదు. దాంతో ఇది కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీస్తోంది.

"ఈ స‌మ‌స్య గురించి ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు వైద్యుల్లోనూ అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో వ్యాధి వ‌చ్చిన త‌ర్వాత‌ రుమ‌టాల‌జిస్టు వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి దాదాపు మూడేళ్ల‌కు పైగా సమయం ప‌డుతోంది. స‌రైన చికిత్స పొంద‌క‌పోతే రోగుల్లో ఆయుష్షు కూడా త‌గ్గే ప్ర‌మాదం ఉంటుంది. అయితే, ఆధునిక వైద్య‌విధానాల్లో లూప‌స్ రోగుల‌కు అత్యుత్త‌మ చికిత్స అందుబాటులో ఉంటుంది. త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించ‌గ‌లిగితే అనేకమంది రోగులు త్వ‌ర‌గా ఈ స‌మ‌స్యను గుర్తించి, త‌గిన చికిత్స పొంది, ఆరోగ్య‌క‌రంగా జీవించ‌గ‌ల‌రు" - డాక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రమౌళి, ఇమ్యునాల‌జీ, రుమ‌టాల‌జీ విభాగం క్లినిక‌ల్ డైరెక్ట‌ర్, కిమ్స్​ హాస్పిటల్​

కిమ్స్​లో ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు - తొలి ఫెలోషిప్​ ప్రారంభం

స్ట్రోక్ కేర్​లో కీలక మైలురాయి - క్యూఏఐ అక్రిడేషన్ పొందిన కిమ్స్ హాస్పిటల్