ETV Bharat / state

"నిప్పులాంటిది మా నిజాయతీ" అన్న రామోజీరావు - అన్నట్టే కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన మార్గదర్శి

మార్గదర్శిపై రామోజీరావు ఆనాడే చెప్పిన మాట నేడు నిజమైంది - ‘నిప్పులాంటిది మా నిజాయతీ’ అంటూ నాడు ప్రజలకు బహిరంగ లేఖ - ఖాతాదారుల శ్రేయస్సే ప్రాణప్రదమని చాటుతూ వారికి భరోసా

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 10:30 AM IST

5 Min Read
Choose ETV Bharat

Ramoji Rao Letter On Margadarsi Financiers : పచ్చి అబద్ధాల్ని నిజాలుగా నమ్మించడానికి ఎవరెంత యాగీ చేసినా సత్యం ఎన్నటికీ దాగదు. కఠోర వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చేసే టక్కుటమార విద్యలు నిజాన్ని కప్పిపెట్టలేవు. మార్గదర్శిపై డిపాజిటర్ల గుండెల్లో గూడుకట్టుకున్న అచంచల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కోర్టు మెట్లెక్కిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు చెంపపెట్టులాంటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది.

లక్షల మంది ఖాతాదారుల శ్రేయస్సును కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మార్గదర్శి అకుంఠిత దీక్షకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెన్నుదన్నుగా నిలిచింది. నిప్పులాంటి మార్గదర్శి నిజాయతీలో ఈ నీలాపనిందలు మసికావాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు ఆనాడే ఆకాంక్షించారు. ఈ అసంబద్ధ ఆరోపణల నుంచి పులు కడిగిన ముత్యంలా బయటికి వస్తామని, ఖాతాదారుల సొమ్ముకు సంపూర్ణ భరోసా కల్పిస్తామని వాగ్దానం చేస్తూ 2006 నవంబరు 10వ తేదీన డిపాజిటర్లను ఉద్దేశించి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠాన్ని మరోసారి అందిస్తున్నాం.

ప్రియమైన ఖాతాదారులకు : లక్షలాది ఖాతాదారుల అచంచల నమ్మకానికి మారుపేరు మార్గదర్శి. అన్ని స్థాయుల్లో ఆర్థిక క్రమశిక్షణకు, అన్నివేళలా మదుపుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మరోపేరూ మార్గదర్శి. 1962లో పుట్టిన మార్గదర్శి మీ నమ్మకమే నీరుగా, ఆరోగ్యకర వ్యాపార విలువలే పాదుగా ఎదిగి ఈ నలభైనాలుగేళ్లలో శాఖోపశాఖలై విస్తరించింది. మార్గదర్శి తోడుందన్న భరోసా డిపాజిటర్లది. ఖాతాదారుల కొండంత నమ్మకమే దన్నుగా ముందడుగేస్తున్న చైతన్యం మా గ్రూపు సంస్థలది. నలభై ఏళ్లకు పైగా ఉభయతారకంగా డిపాజిటర్లతో పెనవేసుకున్న సంబంధ బాంధవ్యాల్లో ఏనాడూ, ఏ దశలోనూ, ఎక్కడా ఏ చిన్నమెత్తు తేడాపాడాలు లేని ఘనచరిత్ర మార్గదర్శిది. లక్షలాది ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణనే తనకు ప్రాణసమానమైన కార్పొరేట్‌ సంస్కృతిగా మార్గదర్శి మలచుకుంది. తమ పెట్టుబడులకు, రాబడులకు ఏ దశలోనూ ఢోకా లేదన్న దిలాసా డిపాజిటర్ల గుండెల నిండుగా ఉంది. ఈ సుదృఢ బాంధవ్యమే పునాదిగా శిరసెత్తుకు నిలిచిన మార్గదర్శి మీద అసంబద్ధ, అహేతుక ఆరోపణలు చేసే కుళ్లు రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. నిప్పులాంటి మార్గదర్శి నిజాయతీలో ఈ నీలాపనిందలు మసి కావాలి. పులు కడిగిన ముత్యంలా మన బంధం మరింత వన్నె తేలాలి.

ఉన్నట్లుండి మార్గదర్శిపై ఏమిటీ గగ్గోలు? ఢిల్లీ నుంచి గల్లీదాకా పాలకపార్టీ పెద్దలే పాత్రధారులుగా సాగుతున్న ఈ రగడకు కారణం ఏమిటి? విజ్ఞులకు, విశేషించి మార్గదర్శి ఖాతాదారులకు తెలియనిది కాదు- ఈనాడు, ఈటీవీ నెట్‌వర్క్‌ ఏళ్లూపూళ్లుగా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసమే పోరాడుతున్న సంగతి! ఇటీవలి కాలంలో పెచ్చుమీరిన అధికార పార్టీ పెద్దల హస్తలాఘవాన్ని సాక్ష్యాధార సహితంగా బట్టబయలు చేయడంలో ఈనాడు, ఈటీవీ అక్షరాలా అసిధారావ్రతం చేస్తున్నాయి. దాంతో ఈనాడు, ఈటీవీల మీదా, వాటి అధిపతిని అయిన నామీదా కక్ష పెంచుకున్న పాలకపార్టీ నేతలు రామోజీ గ్రూపు సంస్థల్ని ఒక్కపెట్టున దెబ్బ తీయడానికి దొంగదారులు వెతికారు. ఖాతాదారుల నమ్మకంతో ముడివడిన సున్నిత అంశం కాబట్టి మార్గదర్శిపై దుష్ప్రచారం చేస్తే తేలిగ్గా తమ లక్ష్యం నెరవేరుతుందనుకున్నారు. అసలేమీ లేనిదాన్ని పెను వివాదంగా సృష్టించడం ద్వారా నన్ను దెబ్బ తీయాలనుకుంటున్న ప్రబుద్ధులు, మీలో భయానుమానాలు పెంచడం ద్వారా మీ ప్రయోజనాల్నీ బలిపీఠంపైకి నెట్టాలనుకుంటున్నారు. కపటబుద్ధుల ఆటలు సాగవంటూ మార్గదర్శి వెన్నంటి నిలిచిన మీకు కృతజ్ఞతాభివందనాలు.

మార్గదర్శి ఏమిటో, దాని పనితీరు ఎలాంటిదో మీకు తెలుసు. ఏ ఒక్కరి డిపాజిట్‌ అయినా సకాలంలో చెల్లించకపోవడం అనేది మార్గదర్శి చరిత్రలోనే లేదన్న సంగతీ మీకు తెలియనిది కాదు. ఆర్థికంగా మార్గదర్శి పూర్తి బలిష్ఠంగా ఉందనేందుకు తిరుగులేని రుజువు అది. అలాంటిది- మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నష్టాల్లో ఉందనీ, మార్గదర్శి మునిగిపోతోందనీ కొందరు పనిగట్టుకు చేసే ప్రచారంలో పస ఏముంది? అవిభాజ్య హిందూ కుటుంబ (హెచ్‌యుఎఫ్‌) నష్టాలను భూతద్దంలో చూపుతూ యాగీ చేస్తున్నవారు- రామోజీగ్రూపు సంస్థలన్నింటికీ హెచ్‌యుఎఫ్‌ మాత్రమే సొంతదారు అని నేనిచ్చిన వివరణను కావాలనే పెడచెవిన పెడుతున్నారు. శ్రేయోభిలాషులైన ఖాతాదారులందరికీ నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నాను. హెచ్‌.యు.ఎఫ్‌.లో నష్టం కేవలం సాంకేతికమే. మా సంస్థల ఆస్తుల విలువలో విశేష పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే- అధికార పార్టీ కామందులు గుండెలు బాదుకుంటూ చూపిస్తున్న నష్టం ఓ లెక్కలోనిది కాదు. ఇక్కడే మరొక్క విషయమూ స్పష్టం చేయదలచుకున్నాను. ఎన్నడూ, ఏ దశలోనూ హెచ్‌యుఎఫ్‌ ఏ చట్టాన్నీ ఉల్లంఘించలేదు. చట్టవిరుద్ధంగా ఏ ఒక్కపనీ చేపట్టనూ లేదు!

మార్గదర్శి సహా రామోజీ గ్రూప్‌ సంస్థలన్నింటికీ హెచ్‌యుఎఫ్‌ అధిపతి. ఆ గొడుగు నీడలోనే ఈనాడు, ఈటీవీ నెట్‌వర్క్, ఫిలింసిటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మార్గదర్శి డిపాజిట్లను ఆయా సంస్థల బహుముఖ విస్తరణ కోసమే ఖర్చు చేశాం. పటిష్ఠ ప్రణాళికతో వాటిని లాభాల బాట పట్టించాం. ఈ క్రమంలో గ్రూపు సంస్థల ఆస్తుల విలువా ఎన్నో రెట్లు పెరిగింది. గతంలో మాదిరి పెట్టుబడి నిధుల అవసరం లేకపోబట్టి మా అంతట మేముగా డిపాజిట్ల సేకరణ తగ్గించుకుంటున్నాం. గతంలో కనీస మొత్తం పది వేలుగా డిపాజిట్లు స్వీకరించేవాళ్లం. ఆ పరిమితిని మొన్న సెప్టెంబరు నుంచి లక్ష రూపాయలకు పెంచడంలో ప్రధాన ఉద్దేశం- డిపాజిట్ల సేకరణను పరిమితం చేయాలన్నదే. రామోజీ గ్రూపు సంస్థలన్నీ అభివృద్ధిపథంలో నడుస్తున్న తరుణమిది. అవాకులు చెవాకుల ద్వారా కొందరు రాజకీయ దుమారం ఎందుకు సృష్టిస్తున్నారో విజ్ఞులైన డిపాజిటర్లు గుర్తించాలి.

ఈనాడు, ఈటీవీ నెట్‌వర్క్‌ ద్వారా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు, మార్గదర్శి ద్వారా ఖాతాదారుల అకళంక సేవకు అంకితమై రామోజీగ్రూపు పనిచేస్తోంది. ప్రజల పట్ల మేం నెరవేరుస్తున్న విధ్యుక్త ధర్మమే స్వార్థపర శక్తులకు కంటగింపు అయ్యింది. అందుకే ఇలాంటి దుష్ప్రచారం ద్వారా మా సంస్థల పట్ల మీకు గల ప్రబల విశ్వాసాన్ని కదలబార్చి, నన్ను నష్టపరిచి తగిన శాస్తి చేశామని పైశాచిక సంతృప్తి పొందేందుకు కొన్ని శక్తులు కాచుకుని ఉన్నాయి. నన్ను దెబ్బతీయాలనే దుష్టచింతనతో బరితెగిస్తున్నవారు లక్షలాది డిపాజిటర్ల ప్రయోజనాల్నీ కాలరాచేందుకు సిద్ధపడుతున్నారు. అన్నివేళలా ప్రజాహితమే పరమావధిగా ముందడుగేస్తున్న మా సంస్థల తరఫున నా వాగ్దానం ఒక్కటే. డిపాజిటర్ల దన్నుతో ఎదిగిన మార్గదర్శి, ఇదివరకటి మాదిరిగానే మీ ప్రయోజనాల్ని సంపూర్ణంగా పరిరక్షిస్తుంది.

డిపాజిట్లుగా సేకరించిందంతా నా కుటుంబం అజమాయిషీలో గల హెచ్‌.యు.ఎఫ్‌. ఆధ్వర్యంలోని సంస్థల్లోనే పెట్టుబడులుగా పెట్టాం. హెచ్‌.యు.ఎఫ్‌. యాజమాన్యం మా కుటుంబానిదే కాబట్టి- అవసరమైతే, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నుంచి వేటిలో పెట్టుబడులు పెట్టామో, ఆ సంస్థల్లో వాటాలు తగ్గించుకుని అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను పరిపుష్టం చేస్తాం. గతంలో మాదిరే కాలపరిమితి ముగిసిన డిపాజిట్లకు ఖాతాదార్ల సంతృప్తి మేరకు చెల్లింపులు సాగిస్తాం. మా డిపాజిటర్ల పట్ల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో ఏ మచ్చా లేని ఇన్నేళ్ల సంప్రదాయాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తామని కుటుంబ పెద్దగా మా కుటుంబ సభ్యులందరి తరఫునా నేను మాట ఇస్తున్నాను. అవసరమైతే మా ఆస్తులు అమ్మి అయినా సరే ఖాతాదారుల శ్రేయాన్ని కంటికి రెప్పలా కాచుకుంటామని వాగ్దానం చేస్తున్నాను.

"లక్షలాది ఖాతాదారులతో కళకళలాడుతున్న మార్గదర్శి కుటుంబం మనది. మన మధ్య చెదరని నమ్మకమే మార్గదర్శికి పటిష్ఠ పునాది. ఆ విశ్వాసమే శ్రీరామరక్షగా మునుముందుకు సాగుదాం, మరింత ప్రగతి సాధిద్దాం" -రామోజీరావు

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

న్యాయం గెలిచింది : కడిగిన ముత్యంలా 'మార్గదర్శి' - తమ నమ్మకమే నిజమైందంటూ చందాదారుల హర్షం