శాస్త్రోక్తంగా గోదావరిలో సీతారామలక్ష్మణ విగ్రహాల నిమజ్జనం
ఆరేళ్ల క్రితం రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహం - కోర్టు తీర్పుతో విగ్రహ నిమజ్జనం - కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు - కోటిపల్లి తీరంలో విగ్రహాల నిమజ్జనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 13, 2026 at 8:48 PM IST
Ramatheertham Idols Immersion in Godavari: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆరేళ్ల క్రితం ధ్వంసమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను పవిత్ర గోదావరి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రామతీర్థం నుంచి ఆయా పుణ్యక్షేత్రాల మీదుగా ఊరేగింపుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి క్షేత్రానికి తీసుకువచ్చారు. భక్తుల జై శ్రీరామ్ జయ జయ ధ్వానాల మధ్య గౌతమీ గోదావరిలో జలాధివాసం చేశారు.
ఆరేళ్ల క్రితం విగ్రహాల ధ్వంసం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచల కొండపై కొలువైన కోదండరామస్వామి ఆలయంలో విగ్రహాలను 2020 డిసెంబర్ 28వ తేదీన దుండగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భక్తులు నివ్వెరపోయారు. సీతారామచంద్ర లక్ష్మణ స్వాములకు అపచారం జరిగిందని బాధపడ్డారు. ఈ ఘటనపై పోలీసు కేసులు, కోర్టు విచారణలు ఎన్నో కొనసాగాయి. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. తాజాగా కోర్టు అనుమతితో సీత, రామ, లక్ష్మణ స్వామి విగ్రహాలను గోదావరిలో జలాధివాసం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది.
కోటిపల్లి తీరంలో విగ్రహాల నిమజ్జనం: అందుకు అనుగుణంగా ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా నిమజ్జనం చేయాలని ఆదేశించింది. దేవతామూర్తుల విగ్రహాలను విజయనగరం పైడితల్లి, అనకాపల్లి నూకాంబిక, సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, కాకినాడ భానుగుడి భాను లింగేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిల మీదుగా దేవతామూర్తుల విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా కోటిపల్లి తీసుకువచ్చారు.
కోటిపల్లి పవిత్ర గౌతమి గోదావరి తీరంలో శాంతి హోమం నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలను పంటుపై గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఆ తర్వాత సీత రామ లక్ష్మణ స్వాముల విగ్రహాలను పవిత్ర గౌతమీ గోదావరిలో జలాధివాసం చేశారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, అధికారులు సిబ్బంది, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం, తదితరులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఆలయంలో పూజలు చేసిన అర్చకులు దేవతామూర్తుల విగ్రహాల నిమజ్జనం చేసే సమయంలో భావోద్వేగాన్ని గురయ్యారు. జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించగా పూజారులు మౌనంగా కన్నీటి పర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్ట భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజాప్రతిని తెలిపారు. ఇలాంటి ఘటనలకు దుండగులు పాల్పడకుండా భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
"2020 వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన నీలాచల కొండపై కొలువైన కోదండరామస్వామి ఆలయంలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది కానీ ధ్వంసమైన విగ్రహాలకు జలాధివాసం చేయలేదు. అయితే తాజాగా కోర్టు అనుమతితో సీత, రామ, లక్ష్మణ స్వామి విగ్రహాలను గోదావరిలో జలాధివాసం చేస్తున్నాం"-రామచంద్ర మోహన్, దేవదాయ శాఖ కమిషనర్
"గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాముడి విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరం. అయితే ఆ తర్వాత నూతన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ధ్వంసమైన విగ్రహాలు ఆలయంలో ఉండకూడదు. అందుకే దేవాదాయశాఖ ఆగమన శాస్త్రం ప్రకారం ధ్వంసమైన విగ్రహాలను రామతీర్ధం ఆలయం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన విజయనగరం పైడితల్లి, అనకాపల్లి నూకాంబిక, సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, కాకినాడ భానుగుడి భాను లింగేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిల మీదుగా ఊరేగించి కోటిపల్లి తీరంలో రామతీర్థం విగ్రహాలను నిమజ్జనం చేశాం"-దాట్ల బుచ్చిరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే
సర్పవరంలో విగ్రహాల ధ్వంసం...ఆకతాయిల పనిగా అనుమానం
దేవతా విగ్రహాల ధ్వంసం - టీడీపీ ఆదరణ జీర్ణించుకోలేక చేసుంటారని స్థానికుల ఆరోపణ

