రంజాన్ వేళ ప్రత్యేకంగా 'రాత్ బజార్' షాపింగ్ - కళకళలాడుతున్న చార్మినార్ పరిసర మార్కెట్లు
రంజాన్ ప్రార్థనలు, స్ట్రీట్ ఫుడ్, రాత్ బజార్ షాషింగ్ - నగరంలో నైట్ బజార్‌కు భారీగా తరలివస్తున్న ప్రజలు - రంజాన్ వేళ మక్కామసీదులో ప్రత్యేక ఏర్పాట్లు

Published : February 28, 2026 at 11:52 AM IST
Charminar Night Bazaar During Ramadan Festival : రంజాన్ మాసం పేరు వినగానే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది హైదరాబాద్‌లోని పాతబస్తీ చార్మినార్, శాలిబండ, పురానాపూల్. వాటితో పాటు మక్కా మసీదు. రంజాన్ మాసం కొనుగోళ్లతో చార్మినర్ చుట్టున్న పరిసర మార్కెట్లలో ఉండే ఆ సందడే వేరు. ఈద్-ఉల్-ఫితర్ కోసం కావాల్సిన వస్తువుల కొనుగోలుకు ముస్లింలు తరలివస్తున్నారు. ఈ రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించటంతో నైట్ బజార్ నెల రోజుల పాటు ఇలాగే కొనసాగునుంది.
ఈ పండగకు కొత్త దుస్తులు ధరించే సంప్రదాయం ఉంది. వీటితో పాటు పాదరక్షలు, కాస్మొటిక్ వస్తువులు ఖరీదు చేస్తారు. పండగ రోజున షీర్ కుర్మా తయారీకి వినియోగించే డ్రై ఫ్రూట్స్, పాయసానికి ఉపయోగించే పాత్రలు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత రాత్రి పూట రంజాన్ మాసం సందడి చూసి తమకు అవసరం ఉన్న వస్తువులను కొనుగోలు చేయడానికి నగరంలోని అన్ని వర్గాల ప్రజలు నైట్ బజార్‌కు తరలి వస్తున్నారు.
మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు : ముస్లింలు ఇఫ్తార్‌తో రోజా దీక్ష విడిచిన అనంతరం నుంచి ఇషా, తరావీ ప్రార్థనల్లో పాల్గొనడానికి పలువురు మక్కా మసీదుకు వస్తారు. మసీదు సూపరింటెండెంట్ సయ్యద్ ఉమర్ పాషా, మేనేజర్ హఫీజ్ వాహజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిత్యం ఇఫ్తార్ వేళలో సుమారు 50 కిలోలకు పైగా ఖర్జూర ఫలాలను పంపిణీ చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఉపవాసదీక్ష విడిచిన అనంతరం వివిధ హోటళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో రంజాన్ ప్రత్యేక వంటకాల విక్రయాలు క్రమంగా జోరుగా సాగుతున్నాయి.
జోరుగా పండ్ల విక్రయాలు : ముస్లింలు రోజాను విడవటానికి ఇఫ్తార్ సమయంలో ఎక్కువగా ఖర్జూర ఫలాలను స్వీకరిస్తారు. బొప్పాయి, అరటి, ద్రాక్ష, యాపిల్, కర్బుజా వంటి పండ్లను కూడా తీసుకుంటారు. దీంతో అన్ని రకాల ఫలాల విక్రయాలు బాగా సాగుతున్నాయి. ఇఫ్తార్ అనంతరం పలువురు హలీంతో పాటు హోటళ్లు, ఆరుబయట ప్రత్యేకంగా విక్రయించే కబాబ్‌లు వంటి వాటిని ఆరగిస్తున్నారు.
రంజాన్ వేళలో అర్ధరాత్రి వరకు కొనుగోళ్లు : చార్మినార్ వద్ద నైట్ బజార్ సందర్శకులను కనువిందు చేస్తుంది. హైదరాబాద్ పాతబస్తీలో ఏడాది మొత్తంలో జరిగే షాపింగ్ ఒక ఎత్తు అయితే, ఈ రంజాన్ నెలలో జరిగే షాపింగ్ మరో ఎత్తు అనే చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఇలా ఈ రంజాన్ నెలంతా పాతబస్తీ ప్రాంతమంతా కిటకిటలాడుతుంది. ఈ పండగ వేళలో షాపింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది. ఈ నైట్ బజారులో అలంకార వస్తువులతో సహా అన్ని వెరైటీలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం కొనుగోలు కోసం సరికొత్త సరకును ప్రవేశపెడతారు. దీంతో మిరుమిట్లు గొలిపే వెలుతురులతో వేసవిలో రాత్రి వేళలో వచ్చే ఆ చల్లగాలుల మధ్య చారిత్రక ప్రదేశమైన చార్మినర్ వద్ద రాత్రిపూట షాపింగ్ చేస్తుంటే వచ్చే మజాయే వేరు.
షాపింగ్ కోసం రాష్ట్రాలు, విదేశాల నుంచి : దేశవ్యాప్తంగా హైదరాబాద్ పాతబస్తీ ఎంతో పేరు గాంచిన ప్రాంతంగా పిలుస్తారు. అక్కడ గాజుల తయారీ, అమ్మకాల్లో వివిధ ప్రాంతాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని షాపు యజమానులు కొత్త కొత్త డిజైన్లను ప్రవేశపెడుతున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా కొనుగోలుదారులు నగరానికి వస్తున్నారు. రంజాన్ ఉపవాస నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీలు జోరుగా సాగుతున్నాయి.
నోరూరిస్తున్న రంజాన్ స్పెషల్స్ : నగరంలో చార్మినర్ పాతబస్తీలో దొరికే తినుబండారాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రాంతమంతా వంటల సువాసనలతో వ్యాప్తి చెందుతుంది. మరీ ముఖ్యంగా మరగ్, పాయా, పత్తర్ కా ఘోష్, అచార్ కా ఘోష్, హలీం, షిక్ కబాబ్, చికెన్ మెజెస్టిక్, చికెన్ 65 వంటి నాన్-వెజ్ ఐటమ్స్‌తో వంటకాలు ఈ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. వీటితో పాటు వివిధ రకాల మిఠాయిలతో ఆహార ప్రియులను అలరిస్తున్నాయి.
రేపటి నుంచే రంజాన్ ప్రారంభం - ఈ మాసంలో టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే!
రంజాన్ వచ్చేసింది రారండోయ్ - హలీమ్తోపాటు, కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే!

