ETV Bharat / state

గత రికార్డులను అధిగమించేలా హైవే నిర్మాణం - గిన్నిస్‌ రికార్డే లక్ష్యం!

7 రోజుల పాటు 6 వరుసలు 26 కి.మీ. రోడ్డు నిర్మాణం - నిర్విరామంగా నిర్మించి రికార్డు సృష్టించే యత్నం - కోడూరు-ముప్పవరం హైవేలో సన్నద్ధం

Guinness World Record Goal in Highway Construction
Guinness World Record Goal in Highway Construction (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 1, 2026 at 10:18 AM IST

3 Min Read
Choose ETV Bharat

Guinness World Record Goal in Highway Construction: గ్రీన్​ ఫీల్డ్ హైవేలో 7 రోజుల పాటు నిర్విరామంగా రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు. ఏకంగా 26 కిలోమీటర్ల మేర 6 వరుసలలో తారురోడ్డు పూర్తి చేశారు. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్రణాళిక సైతం సిద్ధమైంది.

శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా ముప్పవరం వరకు హైవే నిర్మాణం చేపడుతున్నారు. బెంగళూరు, కడప, విజయవాడ మీదుగా 6 వరుసలతో యాకెస్స్ కంట్రోల్ గ్రీన్​ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. హైవేకు రికార్డు స్థాయిలో తారు రోడ్డు పనులు చేసేందుకు రాజ్​పథ్ ఇన్​ఫ్రాకాన్​ అనే కాంట్రాక్టర్ సంస్థ సన్నద్ధమైంది.

శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఓబుళదేవర చెరువు మండలంలోని సాతర్లపల్లి సమీపం నుంచి ములకవేముల క్రాస్‌ సమీపం వరకు 26 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని ఈనెల 5న ఉదయం ఆరంభించనున్నారు. దీన్ని 11వ తేదీ నాటికి పూర్తి చేసి రికార్డు సృష్టించడమే కాంట్రాక్టర్​ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ముందస్తు ఏర్పాట్లతో సన్నద్ధం: ఇరువైపులా మూడేసి వరుసల చొప్పున మొత్తం 6 వరుసలతో ఈ హైవే నిర్మిస్తున్నారు. 29.5వ కి.మీ. నుంచి 55.5వ కి.మీ. వరకు (26 కి.మీ.) ఒకవైపు 3 వరుసలతో తారు రోడ్డు వేస్తారు. మళ్లీ రెండోవైపు కూడా అంతే దూరం 3 వరుసలతో నిర్మిస్తారు. మొత్తంగా మూడేసి వరుసలతో ఇరువైపులా కలిపి 52 కి.మీ. మేర రోడ్డు నిర్మిస్తారు.

మరో 4 రోజుల్లో చివరి లేయర్​: ఇప్పటికే అక్కడ డెన్స్‌ బిటమిన్‌ మెక్డమ్‌ (బీడీమ్‌) వరకు పనులను పూర్తి చేశారు. ఈనెల 5 నుంచి చివరి లేయర్‌ అయిన తారు రోడ్డు (బిటుమినస్‌ కాంక్రీట్‌) వేయనున్నారు.

100 టిప్పర్లు రెడీ: సెన్సర్‌ పేవర్‌ రోడ్డు వేస్తుంటే వెనుక రోలింగ్‌ చేసేందుకు 4 రోలర్లు సిద్ధం చేశారు. అవసరమైన బిటమిన్‌ సరఫరా కోసం 5 హాట్‌మిక్స్‌ ప్లాంట్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్లాంట్ల నుంచి నిరంతరం బిటుమినస్‌ను తరలించేందుకు 100 టిప్పర్లను కూడా రెడీ చేశారు.

వారి సమక్షంలో పనులు మొదలు: కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, నేషనల్ హైవే అధికారులు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల సమక్షంలో ఈ పనులు ఆరంభించి కొనసాగించనున్నారు. 11వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి అయ్యాక 12న హైవే వద్ద జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొంటారు. ఆయన చేతుల మీదగా గిన్నిస్‌ రికార్డు అందుకోనున్నట్లు రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రతినిధులు తెలిపారు.

గత రికార్డులను అధిగమించేలా: రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ సంస్థ 2021 మేలో మహారాష్ట్రలోని పుసెగావ్‌-మహాసుర్నేల మధ్య 24 గంటల్లో 39.69 కి.మీ. మేర ఒక వరుస రహదారిని నిర్మించి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించింది. తర్వాత మహారాష్ట్రలోనే అమరావతి-అకోలా మధ్య 42.2 కి.మీ. మేర 2 వరుసల హైవేలో తారు రోడ్డును రికార్డు స్థాయిలో నిర్మించింది.

2022 జూన్‌ 3న ఉదయం నుంచి 7వ తేదీ రాత్రి 9.30 గంటల వరకు ఈ పనులు చేసింది. దీంతో మళ్లీ గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. తాజాగా కోడూరు-ముప్పవరం హైవేలో 26 కి.మీ. 6 వరుసలు కేవలం 7 రోజుల్లో నిర్మించాలని భావిస్తున్నారు. తమ రికార్డును తామే అధిగమించేందుకు ఆ సంస్థ ఇప్పటికే సిద్ధమైంది.

మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు - ఏపీలో రెండు ఆసియా హైవేలు

అనంతపురం-గుంటూరు NH 544-D విస్తరణకు మరో ముందడుగు - భూసేకరణకు నోటిఫికేషన్‌