కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం - ఫ్రీజర్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు
కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు - 8 మందికి ఇంకా వెంటిలేటర్ల పైనే చికిత్స - ఫ్రీజర్‌లో కూలెంట్ లీకేజీ పై సమగ్రంగా విశ్లేషించేందుకు ఫ్రీజర్ పంపినట్లు సమాచారం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 11:52 AM IST
Rajamahendravaram Milk Adulteration Latest Update : రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మందికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎనిమిది మందికి ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స అందిస్తున్నారు. ముంబయి నుంచి తెప్పించి ఇంజెక్షన్లను ఎప్పుడు ఎవరికి వినియోగించాలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ సూచించారు.
మరోవైపు నిందితుడు గణేశ్వరరావు పాలశీతలీకరణకు వినియోగించిన ఫ్రీజర్‌ను పోలీసులు మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫ్రీజర్‌లో కూలెంట్ లీకేజీ పై సమగ్రంగా విశ్లేషించేందుకు ఫ్రీజర్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. గణేశ్వరరావును మరింత లోతుగా విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు కోర్టు అనుమతి కోసం వేచిచూస్తున్నారు.
బాధితులకు రాజమహేంద్రవరంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఎనిమిది మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్సీ నరసింహకిశోర్, నగరపాలక కమిషనర్ రాహుల్ మీనా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఘటన వెలుగు చూసినప్పపటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన చర్యల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.
110 ఇళ్లలో వైద్యాధికారుల సర్వే : బాధితుల్లో 12 మంది నుంచి రక్త నమూనాలు, ముగ్గురి మూత్ర నమూనాలు సేకరించారు. ఈ నమూనాలను టాక్సికాలజీ పరీక్షల కోసం తిరుపతి ఐఐటీకి పంపించారు. బాధితులకు వైద్యం అందించే విషయంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ పలు సూచనలు చేశారు. ఆయన సూచన మేరకు చికిత్సకు కావాల్సిన 50 ఇంజిక్షన్లను ముంబయి నుంచి రాజమహేంద్రవరం తెప్పించారు. వీటిని డయాలిసిస్ చేస్తున్న కిడ్నీ బాధితులకు వినియోగించనున్నారని నెఫ్రాలజిస్ట్ తెలిపారు. మరోవైపు కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు నుంచి పాలు తీసుకున్న 110 ఇళ్లలో వైద్యాధికారులు సర్వే చేపట్టారు. వారి ఆరోగ్యం పై ఆరా తీశారు.
ప్రమాదకరమని తెలిసే చేశాడు ఇలా : లాలాచెరువు పరిసరాల్లోని చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నారు. పాల వ్యాపారి గణేశ్వరరావు ఫోన్లో ఉన్న ఫోటోల ఆధారంగా పాల కేంద్రం ఫ్రీజర్‌లో సమస్య ముందే అతనికి తెలుసని స్పష్టం అవుతోందని అన్నారు. కూలెంట్ లీకేజీ, ఫ్రీజర్ మరమ్మతులు, పాలు గడ్డ కట్టడం తదితర అంశాలకు సంబంధించి ఫోన్‌లోని ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
కూలెంట్ లీకేజీ వల్లే పాలు గడ్డ కట్టాయని, ఇథలీన్ గ్లైకాల్ కలవడం ప్రమాదకరమని, పాలు పారబోయాలని బంధువు చెప్పినా గణేశ్వరరావు అతని మాటలను వినిపించుకోలేదు. పైగా ఫ్రీజర్‌లో రాత్రికి గడ్డ కట్టిన పాలను పగల గొట్టి రాజమహేంద్రంలో వినియోగదారులకు పోసినట్టు పోలీసు విచారణలో గణేశ్వరరావు చెప్పినట్టు సమాచారం.
విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు : రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాల పై అధికారులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన మరెక్కడా చోటు చేసుకోకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు జాగ్త్రతలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కల్తీ పాల బాధితులకు డయాలసిస్ - ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలు
పాల ‘కల్తీ’ - ఆహార భద్రతాధికారుల తనిఖీలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

