అనధికారికంగా వరలక్ష్మి డెయిరీ నిర్వహణ - కొంపముంచిన కూలెంట్ లీకేజీ
కల్తీ పాల ఘటనలో ఐదుకు చేరిన మృతులు - వరలక్ష్మి డెయిరీలో పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలవడంతోనే ప్రమాదం - అధికారుల దర్యాప్తులో నిర్ధారించినట్లు సమాచారం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 8:57 AM IST
Rajamahendravaram Adulterated Milk Case : రాజమహేంద్రవరంలో పాల కల్తీకి శీతలీకరణ యంత్రంలో కూలెంట్‌గా వినియోగించిన ఇథలీన్ గ్లైకాలే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ కలవడం వల్లే కిడ్నీ సమస్యలకు దారి తీసిందని అనుమానిస్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ కలవడం వల్లే కిడ్నీ సమస్యలకు దారితీసిందని అనుమానిస్తున్నారు.
రాజమహేంద్రవరంలో కిడ్నీలు దెబ్బతిని ఐదుగురి మరణానికి కారణమైన పాల కల్తీ కారణాలను అధికారులు భిన్న కోణాల్లో విశ్లేషించారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్ అనధికారికంగా వరలక్ష్మి డెయిరీని నిర్వహిస్తున్నారు. డెయిరీని పరిశీలించగా అందులోని శీతలీకరణ కేంద్రంలో ఈనెల 15న కూలెంట్ లీకై ఓ క్యాన్‌లోని పాలల్లో కలిసినట్లు అధికారులు గుర్తించారు. అతను రోజూ 3 క్యాన్లలో 120 లీటర్లు పాలు సేకరిస్తారు. వాటిని మర్నాడు ఇళ్లకు సరఫరా చేస్తాడు. అయితే ఈనెల 15వ తేదీన కూలెంట్ లీకై ఓ క్యాన్ పాలల్లో కలిసిన విషయాన్ని గణేశ్ గుర్తించలేదు. దీంతో వాటినే 16న ఇళ్లకు రోజులాగానే యథావిధిగా సరఫరా చేశాడని తేల్చారు. ఈనెల 17న శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ప్రొపైలీన్ గ్లైకాల్కి బదులు: ఇథలీన్ గ్లైకాల్‌ను కార్లు, హెచ్‌వీఏసీ సిస్టమ్స్, ట్రక్కులు, పరిశ్రమల్లోని చిల్లర్‌లో మాత్రమే కూలెంట్‌గా వాడతారు. పెయింట్లు, ప్లాస్టిక్, డీ-ఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ఫ్లూయిడ్లు, పాలిస్టర్ ఫైబర్ల తయారీలోను కూడా వినియోగిస్తారు. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో దీన్ని వినియోగించరు. ఇథలీన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలిస్తే అత్యంత ప్రమాదకరం. కాబట్టి డెయిరీల్లో సురక్షితమైన, ఫుడ్ గ్రేడ్ ప్రొపైలీన్ గ్లైకాల్‌ను వినియోగిస్తారు. అయితే కొన్ని అనధికారిక డెయిరీలో ఖర్చు తక్కువని ప్రొపైలీన్ గ్లైకాల్కి బదులు ఇథలీన్ గ్లైకాల్ వాడుతుంటారు. వరలక్ష్మి డెయిరీలోనూ దీన్నే వినియోగించినట్టు అనుమానిస్తున్నారు.
ఇథలీన్ గ్లైకాల్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది 100 నుంచి 200 మిల్లీ లీటర్లు మనిషి శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకరంగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ తాగిన అరగంట నుంచి సుమారు 12 గంటల వరకు కూడా మద్యం సేవించినట్టుగా మత్తుగా ఉంటుంది. అదే విధంగా తలనొప్పి, నిద్రమత్తు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని, 12 నుంచి 24 గంటల వరకు శ్వాస తీవ్రంగా తీసుకోవడం, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
24 నుంచి 72 గంటల వ్యవధిలో మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏర్పడి మూత్రపిండాలు విఫలమవుతాయి. నొప్పి, మూత్రం తక్కువగా రావడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మెదడు, ఊపిరితిత్తులు, నరాలు, గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. తక్షణ చికిత్స అందించకపోతే ప్రాణాలు పోతాయి. ఇథలీన్ గ్లైకాల్ తీపిగా ఉంటుంది. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు పొరపాటునైనా తాగకుండా చేదు రుచిని ఇచ్చే మిశ్రమాన్ని దానికి కలుపుతారు. గణేశ్ ఈనెల 16న సరఫరా చేసిన పాలు కూడా చేదుగా ఉన్నట్లు కొందరు బాధితులు చెప్పారు. దీంతో కూలెంట్ కలిసిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యల కలకలం! - ఐదుగురు మృతి
రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

