స్పెషల్షోలకు అనుమతివ్వండి - హైకోర్టులో రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతల పిటిషన్లు
టికెట్ ధరల పెంపు, ప్రత్యేకషోల అనుమతికి అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు - టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటిల పిటిషన్లు

Published : January 6, 2026 at 8:00 PM IST
People Media Factory, Shine Screens Petitions in Telangana High Court : సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అగ్ర కథానాయకులు ప్రభాస్ ది రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు చిత్రాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాల టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో రెండు చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన నిర్మాతలు : తాజాగా రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని అప్పీలు దాఖలు చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో నిర్మాతలు పేర్కొన్నారు.
హోం శాఖ కార్యదర్శికి సూచించండి : టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీనికోసం హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. తమ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. న్యాయవాదుల విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. చిత్రనిర్మాతల పిటిషన్లపై రేపు మంగళవారం విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
సింగిల్ స్క్రీన్స్‌లో ప్రీమియర్‌కు రూ.800 : జనవరి 9న ది రాజాసాబ్ సినిమా విడుదల కానుండగా, ఒకరోజు ముందుగానే అంటే జనవరి 8న రాత్రి ప్రత్యేకంగా ప్రీమియర్‌లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్‌లో రూ.800 (ట్యాక్స్‌లతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.1000 (ట్యాక్స్‌లతో కలిపి) పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. జనవరి 9 నుంచి 11 వరకూ సింగిల్ స్క్రీన్‌లో రూ.105 (పన్నులతో కలిపి) 12 నుంచి 18వ తేదీ వరకూ రూ.62 (పన్నులతో కలిపి) మల్టీప్లెక్స్‌లో వరుస తేదీల్లో రూ.132, రూ.89 మేర పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణను మంగళవారం చేపడతామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి కోర్టు ఇచ్చే ఆదేశాలను అనుసరించి చిత్ర బృందాలు టికెట్ ధరల విషయంలో ముందుకు వెళ్లనున్నాయి.
- సంక్రాంతి 2026 విడుదలయ్యే సినిమాల జాబితా :
ది రాజా సాబ్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్-కామెడీ ఫాంటసీ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.
మన శంకర వరప్రసాద్ గారు : మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి : మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది.
అనగనగ ఒక రాజు : జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ జనవరి 14న విడుదలవుతుంది. మీనాక్షి చౌదరీ ఈ చిత్రంలో కథానాయిక.
నారీ నారీ నడుమ మురారి : యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ కుటుంబ కథా చిత్రం కూడా జనవరి 14 లేదా 15న విడుదలయ్యే అవకాశం ఉంది. తేదీ ఇంకా ఖరారు కాలేదు.
- తమిళ్ డబ్బింగ్ చిత్రాలు
జననాయకుడు : దళపతి విజయ్ నటించిన యాక్షన్ సినిమా జనవరి 9న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని భగవంత్ కేసరి కథతో తమిళ్లో రూపొందించారు.
పరాశక్తి : శివకార్తికేయన్, శ్రీలీల నటించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.
భయం, హాస్యం, విజువల్ ఫీస్ట్- అదిరిపోయిన రాజాసాబ్ 2.0 ట్రైలర్
బాలయ్య మూవీనే విజయ్ రీమేక్ చేస్తున్నారా?- క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

