ETV Bharat / state

సేంద్రియ సాగుకు రైతు సాధికార సంస్థ ప్రోత్సాహం - ఈనెల 21, 22న రైతు ఉత్సవం

ప్రకృతి సేద్యం వైపు రైతన్న అడుగులు - సేంద్రియ సాగుపై అవగాహనకు రైతోత్సవం నిర్వహణ, సాగును ఏ విధంగా చేయాలో 15 స్టాళ్లు ఏర్పాటు, ఉత్పత్తులను అమ్మేందుకు అందుబాటులో ప్రత్యేక వాహనాలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 1:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

Raithu Utsav Will Be Held in Vijayawada: రసాయనాలతో కూడిన మందులతో సాగు పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి సేద్యం వైపు రైతన్న అడుగులు వేసే బృహత్కర కార్యక్రమం రైతోత్సవానికి సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ విధానంలో సాగును ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రైతు సాధికార సంస్థ అడుగేస్తోంది.

తయారీ విధానంపై రైతులకు శిక్షణ: సేంద్రియ విధానంతో కూడిన వ్యవసాయపు సాగును విస్తృతంగా ప్రోత్సహించడం, అదే విధంగా సేంద్రియ సాగు చేసే భూముల విస్తీర్ణాన్ని పెంచాలి. అంతేకాకుండా మార్కెటింగ్​లో మధ్యవర్తుల ప్రమేయనేది లేకుండా చూడాలి. ఫిబ్రవరి 21వ తేదీన ఎ. కొండూరులో ప్రకృతి సాగుపై మేళాను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ సాగులో విజయం సాధించిన రైతుల ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, కషాయాలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా తయారీ విధానంపై రైతులకు శిక్షణను ఇస్తారు.

వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించి వీటి ద్వారా పంటలను ఏ విధంగా లాభసాటిగా మార్చుకోవాలో వివరిస్తారు. పంట సాగు నుంచి అమ్మకం వరకు సేంద్రియ సాగుపై ఏ ఏ దశల్లో ఏం చేయాలో స్పష్టంగా వివరిస్తూ మొత్తం 15 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా సాగు చేసిన రైతులే నేరుగా అమ్ముకునే విధంగా ఫిబ్రవరి 22వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిపుణులు, ఉన్నతాధికారులతో సదస్సును నిర్వహిస్తారు.

4 సేంద్రియ అమ్మకం దుకాణాలు: ఎన్టీఆర్ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలు జాతీయ రహదారుల మీదుగా ఉండటంతో హైదరాబాద్ రహదారిలో విజయవాడ నుంచి జగ్గయ్యపేట మధ్య 6, తిరువూరు జాతీయ రహదారిపై 4 సేంద్రియ అమ్మకపు దుకాణాలను నెలకొల్పి మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తారు. దీనికితోడు ఎక్కువ కొనుగోలు సామర్థ్య ప్రాంతాల్లో సేంద్రియ సాగు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రత్యేకమైన వాహనాలను అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఆన్​లైన్​లో యాప్​ల ద్వారా ఉత్పత్తులను అమ్మడంపై శిక్షణను ఇస్తారు.

ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలి: సేంద్రియ సాగు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చని ఎన్టీఆర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ శంకర్​నాయక్ అన్నారు. దీనికితోడు ప్రజలకు తమ ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యాన్ని సైతం అందించినవారవుతామని ఆయన పేర్కొన్నారు. రైతులు రసాయనాల సాగును విడనాడి అందరికీ మేలు చేకూర్చే ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందుకోసం రైతోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరుకావాల్సిందిగా శంకర్​నాయక్ సూచించారు.

ఆచరణలో పెడితే సత్ఫలితాలు: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రకృతి సాగు చేస్తుంటే అధిక దిగుబడులు వస్తున్నాయి. రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ విధానంలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన చిట్కాను ఆచరణలో పెడితే సత్ఫలితాలను సాధించవచ్చు. ఈ ఫలితాలను చూసిన తరువాత ఎంతోమంది రైతులు పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాలని చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం నేలను నమ్ముకున్న వారికి సిరుల పంటనిస్తుంది. ప్రకృతితో మమేకమైతే లాభాల బాటలో పయనించవచ్చు.

సేంద్రియ సాగులో రాణిస్తున్న మహిళ - ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు

సేంద్రియ సాగులో మహిళా రైతు ఆదర్శం - ప్రమాదంలో కాలు కోల్పోయినా నిండైన ఆత్మస్థైర్యంతో!