ETV Bharat / state

మార్చిలోనే ఎండలు షురూ- ఈ సారి ఖరీఫ్​లో కష్టాలు తప్పవు: స్కైమెట్‌

ఎల్‌నినోతో రుతుపవనాలపై ప్రభావం -స్కైమెట్‌ అంచనా - ఏప్రిల్‌లో రుతుపవనాలు ఎలా ఉన్నాయనే దాని గురించి ఐఎండీ నివేదిక

Rainy Conditions in Andhra Pradesh
Rainy Conditions in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 12:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rainy Conditions in Andhra Pradesh: ఇటీవల వాతావరణ మార్పులు చాలా భిన్నంగా ఉంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా ప్రకారం ఎల్‌నినో కారణంగా.. వచ్చే ఖరీఫ్‌ సీజన్​లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఎల్‌నినో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వెయ్యాలని, దానికి తగినట్లుగా వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించింది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. వ్యవసాయ అనుబంధ శాఖలు అన్నింటికీ సిద్దంగా ఉండాలని తెలియజేశాయి. దీంతో పాటు రైతులకు కూడా పరిస్థితులపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. సాగు తీరుపై ఎప్పటికప్పుడు రైతన్నలను అప్రమత్తం చెయ్యాలని చెప్పారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల అధికారులతో నేడు సమావేశం ఏర్పాటు చేసింది. అయితే దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నుంచి ఇంకా ఒక స్పష్టత రాలేదని పలువురు తెలుపుతున్నారు. ఏప్రిల్‌లో రుతుపవనాలు ఎలా ఉన్నాయనే దాని గురించి ఐఎండీ నివేదిక విడుదల చేయనుంది.

ఎల్​నినోతో అన్నదాతకు కష్టాలు: మే నెల నుంచి జులై మధ్య కాలంలో, లేదంటే ఆగస్టు మాసంలో ఎల్‌నినో వచ్చే అవకాశం 50%- 61% పైనే ఉన్నట్లు ప్రైవేట్‌ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇది అక్టోబరు నెల వరకూ కొనసాగొచ్చని వెల్లడిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ వాతావరణపరంగా సున్నిత రాష్ట్రమని, అధిక మొత్తంలో పంట సాగు వర్షాలపైనే ఆధారపడుతుందని తెలుపుతున్నారు. ఎల్‌నినో ఏర్పడితే రుతుపవనాలు బలహీనపడతాయని, ఫలితంగా వర్షపాతం తగ్గుతుందని వివరిస్తున్నారు.

ఎల్​నినో ప్రభావంతో పొడికాలాలు పెరుగుతాయని, ఒకవేళ ఇలాంటి పరిస్థితులే ఏర్పడినట్లైతే వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్రమైన ప్రభావం ఉండనున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. వర్షాధార పంటల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. అన్నదాతలు కనీసం పెట్టుబడులు కూడా పొందలేరు. సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన రైతులు కొంతమేర బయటపడే అవకాశం ఉందని, కూరగాయలు, పండ్లు, వాణిజ్య పంటల ధరలు పెరగొచ్చని సంబంధిత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే నెలలోనే ఎండలు: ఇదిలా ఉండగా మరోవైపు మార్చిలో సూర్యుడి తాపానికి వేడి, ఉక్కపోత మరింత పెరగనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. మార్చి మాసం ప్రారంభంలోనే అంటే మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి: మార్చి తొలి రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశముందని చెప్పింది. ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేసింది. గురువారం అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలుగా నమోదైంది.

వేసవి ముందే భానుడి భగభగలు - వేడి, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు

బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం - ఆ జిల్లాలకు వర్ష సూచన