ETV Bharat / state

గేటు పడిందంటే అరగంట ఆగాల్సిందే! - అంబులెన్స్​లైనా వెయిట్​ చేయాల్సిందే

జగిత్యాల నుంచి హైదరాబాద్​​ వెళ్లే దారిలో రైల్వే గేట్‌ హింస - నిత్యం 20-30 రైళ్ల రాకపోకలు - ఒక్కసారి గేటు పడితే అరగంట ఆగాల్సిందే - అంబులెన్సులకు సైతం గేటు దగ్గరే నిరీక్షణ

జగిత్యాలలోని మంగపేట రైల్వే గేట్​తో సమస్యలు
NH 563 Traffic Jam At Raiway Gate In Karimnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 17, 2026 at 9:28 AM IST

2 Min Read
Choose ETV Bharat

NH 563 Traffic Jam At Railway Gate In Karimnagar : కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రధాన రహదారి అది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఆ రోడ్డుపై రైల్వే గేటు ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట రైల్వే గేట్‌ వద్ద ఈ పరిస్థితి ఉంది. ఈ కారణంగా అంబులెన్సులు సైతం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఒక్కసారి గేటు వేస్తే కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఆగిపోవాల్సి వస్తోందని వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

గేటు పడితే వాహనాలు ఆగాల్సిందే : హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారి 563పై రైల్వే గేట్​ ఉండటం ప్రధాన సమస్యగా మారింది. కరీంనగర్‌ నుంచి జగిత్యాల, నిజామాబాద్‌ సహా పలు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తుంటాయి. గమ్య స్థానాలకు చేరాలంటే ఈ గేటు తప్పకుండా దాటాల్సిందే. ఏళ్లుగా రైల్వే అండర్‌ బ్రిడ్జి లేకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుమారు రోజూ 20 రైళ్లకు పైగా వెళ్తుండటంతో రైల్వే గేట్‌ పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో మంగపేట వద్ద ట్రాఫిక్ జామ్ పరిపాటిగా మారుతోంది.

జగిత్యాలలోని మంగపేట రైల్వే గేట్​తో సమస్యలు (ETV Bharat)

అంబులెన్స్ అయినా ఆగాల్సిందే : జగిత్యాల నుంచి అత్యవసర వైద్యం కోసం కరీంనగర్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాలంటే ఈ దారి వెంటే వెళ్లాలి. ఈ క్రమంలో అంబులెన్సులు గేటు దాటాలి. ఇప్పుడిదే సవాలుగా మారింది. ఎంతో కీలకమైన ఈ రహదారిపై ఒక్కసారి గేటు పడిందంటే సుమారు అరగంట వరకు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం చూపడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

రోడ్డు దుస్థితి మరో సమస్య : ఇక్కడ రైల్వే గేటు పడటం ఒక సమస్య అయితే, రోడ్డు అధ్వాన పరిస్థితి మరో తలనొప్పిగా మారింది. ఇక వర్షాకాలం వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని స్థానికులు చెబుతున్నారు. స్కూల్‌ పిల్లలు బడికి వెళ్లాలన్నా, వ్యవసాయ అవసరాలకు వెళ్లాలన్నా ఎంతో సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్డు గుంతలమయం కావడంతో వాహనాలు సైతం పాడవుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు.

"ఈ రైల్వే ట్రాక్​ గుండా రోజుకు 20 నుంచి 30 రైళ్లు వెళ్తుంటాయి. దాదాపు 30 నుంచి 40 అంబులెన్సులు కూడా వెళ్తుంటాయి. మెట్​పల్లి, జగిత్యాల, కోరుట్ల వాసులు ఈ రైల్వే గేట్ మీదుగానే కరీంనగర్​, హైదరాబాద్​కు వెళ్తుంటారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో అవి ఇక్కడే నిలిచిపోయి బాధితుల ప్రాణాలకు సంకటంగా మారుతోంది. అలాగే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కొండగట్టు, వేములవాడ, ధర్మపురికి వెళ్లే భక్తులకూ ఎంతో ఇబ్బందిగా ఉంది" - స్థానిక వాహనదారులు

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే గానీ ఆ మార్గాన వెళ్లే వారి సమస్య తీరదు. ఇటీవలే కరీంనగర్ నుంచి జగిత్యాల నాలుగు వరుసల రహదారిని కేంద్రం మంజూరు చేసింది. ఆ రహదారి నిర్మాణం జరిగినప్పుడే ఆర్వోబీ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు పనుల కంటే ముందు ఆర్వోబీ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో రోడ్డు దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే! - మరణాల్లోనూ రెండో స్థానం పాదచారులదే

కుంట్లూరులో కుంటుపడిన అభివృద్ధి - గుంతల రోడ్లు, అధ్వాన్న డ్రైనీజీలతో ప్రజల అవస్థలు