వన్యమృగాల మెడలో రేడియో కాలర్ - డిజిటల్ గుప్పిట్లో పులి అడుగులు
జీపీఎస్ రేడియో కాలర్‌తో వన్యప్రాణుల కదలికలు కంప్యూటర్‌లో రికార్డు - ఆరోగ్య పరీక్షలు నిర్వహణ, బరువు, వయస్సు అంచనాల కోసం ఉపయుక్తం - శరీర పరిస్థితి వివరాల నమోదు కోసం రేడియో కాలర్

Published : September 3, 2026 at 12:29 PM IST
Radio Collar Tracking Device For Wild Animals Neck : పెద్దపులి మెడలో గంట కడతారా? వామ్మో భయమే! కానీ పెద్దపులి, చీతా వంటి వన్యప్రాణుల మెడలో కాలర్ కట్టొచ్చు మీకు తెలుసా. దాని పేరే డిజిటల్ గంట. దీనిద్వారా పులి అడుగులు ఎటు పడుతున్నాయి? రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడుస్తోంది? ఏ ఆవాసాన్ని ఎక్కువగా వినియోగిస్తోంది? గ్రామాలు, రోడ్లకు ఎంత దగ్గరగా ప్రయాణం చేస్తోంది? అనే విషయాలను ఈ కాలర్ ద్వారా కరెక్ట్‌గా తెలుసుకోవచ్చు. జంతువుల మెడలో కనిపించేది చిన్న పరికరమే అయినా దాని ద్వారా లభించే సమాచారం మాత్రం చాలా విలువైంది.
ప్రతి పెద్దపులికీ ఓ ఆధార్ : మనుషులకు ఆధార్ సంఖ్య ఉన్న మాదిరిగా అడవుల్లో పెద్దపులుల్లో ప్రతి దానికీ ఓ ప్రత్యేక కోడ్ ఉంటుంది. కే-1, ఎస్-1, కే-6, ఎస్-2 అని వాటికి అధికారులు ఇలా పేర్లు పెడుతుంటారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా వాటి కదలికల్ని చాల క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు. కొంతకాలం పాటు కనిపించకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్లిందేమో అంటూ అక్కడి అధికారులను ఆరా తీస్తారు. అయితే జీపీఎస్(గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం) రేడియో కాలర్ బిగిస్తే పెద్దపులి సహా వన్యప్రాణుల కదలికలన్నీ ఎప్పటికప్పుడు అటవీశాఖలోని కంప్యూటర్‌లో నమోదు అవుతాయి.
పులి మెడలో ఎలా పెడతారంటే : అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని తొలుత జాగ్రత్తగా పట్టుకోవాలి. పులి, చిరుత వంటి వేటాడే జంతువుల్ని పట్టుకోవడం అంత సులభమైన విషయమైతే కాదు, మనుషులకు అత్యంత ప్రమాదకరం కూడా. అందుకే సాధ్యమైనంత వరకు కెమెరా ట్రాప్‌లు, పాదముద్రల వంటి ఆనవాళ్లతో పులి కదలికలను స్పష్టంగా గుర్తిస్తారు. అటవీశాఖ టీమ్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన వెటర్నరీ డాక్టర్ మత్తు మందు ఇస్తారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బరువు, వయస్సు అంచనా, శరీర పరిస్థితి వంటి వివరాల్ని రికార్డు చేసుకుంటారు. ఆ తర్వాత పులి మెడకు జీపీఎస్ ఉన్న రేడియా కాలర్‌ను బిగిస్తారు. మత్తు వీడిన తర్వాత పులిని అడవిలో వదిలిపెడతారు. రేడియో కాలర్ సమాచారం ఆధారంగా పులి ఎక్కడికి వెళ్లింది? ఏ ప్రాంతంలో ఎక్కువ సమయం ఉంటోందనేటువంటి వివరాలు తెలుస్తాయి. పులి మానవ నివాసాలకు చేరువైతే అక్కడి ప్రజల్ని ముందస్తుగా హెచ్చరించడం, మనుషులపై దాడి జరగకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వాకర్ 3,020 కిలో మీటర్లు ప్రయాణం : రేడియో కాలర్‌తో పులి ప్రయాణం ఎలా రికార్డు అవుతుందో చెప్పేందుకు వాకర్‌గా పేరొందిన సీ-1 మగపులి మంచి ఉదాహరణ. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంత నుంచి బయలుదేరిన ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలోకి ప్రవేశించి తిరిగి మహారాష్ట్రకు చేరుకుంది కేవలం 13 నెలల్లో ఏకంగా 3,020 కిలో మీటర్లు ప్రయాణిం చేసిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. రోడ్లను పగటి పూట కంటే రాత్రివేళే అధికంగా దాటుతుందనేటువంటి ఆసక్తికర అంశాలు ఇందులో వెల్లడయ్యాయి.
చిన్న రేడియో కాలర్ అడవికి పెద్ద నిఘా : భారత్‌లో చీతాల పునఃప్రవేశ కార్యక్రమంలో భాగంగా విదేశాల నుంచి తెచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు. చీతాల మెడకు అమర్చిన రేడియో కాలర్‌తో అవి ఎక్కడ తిరిగివస్తున్నాయి? అవి ఏ ప్రాంతాన్ని ఆవాసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి? వంటి విషయాలను ఫారెస్ట్ అధికారులు సులభంగా తెలుసుకుంటున్నారు.
చుట్టపు చూపుగా వచ్చి పోతున్న పులులు - కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో లేని స్థిర ఆవాసాలు
బీడీ ఆకుల కోసం వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి- అక్కడికక్కడే నలుగురు మృతి

