పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం - B5 ఏసీ బోగీలో మంటలు
అప్రమత్తమై మంటలను అదుపు చేసిన ప్రయాణికులు రైల్వే సిబ్బంది - రాజమహేంద్రవరంలో భోగీని తనిఖీ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్పీఎఫ్ పోలీసులు - ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్న పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 2:10 PM IST
Train Coach Fire Accident : దేశవ్యాప్తంగా గత ఏడాది మొదలుకొని తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా ఏదో ఒక రూపంలో మృత్యువు మింగేస్తుంది. ఇంటినుంచి బయటికి అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. గత సంవత్సరం చివరిలో విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. ఆ సంఘటన మరువక ముందే తాజాగా తుని సమీపంలో పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయబ్రాంతులయ్యారు. అసలేమైంది? ప్రమాదానికి గల కారణాలు ఏమిటి ?
B5 ఏసీ బోగీలో మంటలు : పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) రైలులో B5 ఏసీ బోగీలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మంటలు చెలరేగాయి. తుని-అన్నవరం స్టేషన్ల మధ్య పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. B5 ఏసీ కోచ్‌లో దుప్పట్లు ఉండగా విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళన చెందారు. అప్రమత్తమైన ప్రయాణికులు అందుబాటులో ఉన్న రైల్వే సిబ్బందితో కలిసి మంటల్ని అదుపు చేశారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్పిఎఫ్ పోలీసుల తనిఖీ : ఎనిమిది గంటల తర్వాత రైలు రాజమహేంద్రవరం స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్పీఎఫ్ పోలీసులు, సిబ్బందితో కలిని భోగీని తనిఖీ చేశారు. రైలులో నమూనాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఓ ప్రయాణికుడు బీడీ లేదా సిగరెట్టు విసిరేయటం వల్లే దుప్పట్లు అంటుకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో గంటా 40 నిమిషాల వరకు రైలు ఆగిపోయింది. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత రాజమహేంద్రవరం నుంచి రైలు బయలుదేరి వెళ్లింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్లింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా : కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ముఖ ద్వారం వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూంల నిర్వహణ - ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
మినీ భారత్‌ను తలపిస్తున్న సరస్ మేళా - ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

