'మా కుమార్తె చికిత్సకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' - పునర్విక తల్లిదండ్రులు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స కోసం ముందుకొస్తున్న దాతలు - ఇంజెక్షన్‌కు అవసరమైన రూ.6 కోట్లు సమకూరుస్తానని తెలిపిన నారా లోకేశ్ - మంత్రికి, దాతలందరికీ ధన్యవాదాలు తెలిపిన చిన్నారి తల్లీదండ్రులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 7:58 PM IST
|Updated : February 26, 2026 at 8:49 PM IST
Punarvika Parents Thank to Minister Lokesh and Donors: చిన్నారి పునర్విక పేరు గత కొద్ది రోజులుగా వైరలవుతోంది. ఈ పసి ప్రాణానికి పునర్జన్మను ఇవ్వడం కోసం 2 తెలుగు రాష్ట్రాల యువత కలిసి విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. పునర్విక వైద్యం కోసం ఎంతోమంది తమకు తోచిన విధంగా సాయం చేశారు. తమకు సాయం చేయాలని మంత్రి నారా లోకేశ్ దృష్టికి కూడా ఈ విషయం చేరింది.
ఆ రూ.6 కోట్లు నేను సమకూరుస్తా: కాగా దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స బాధ్యత తాను తీసుకుంటానని అందుకు అవసరమైన రూ.6 కోట్లు సమకూరుస్తానని భరోసా ఇచ్చారు. పునర్విక ప్రాణాలు కాపాడే ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు కాగా ఇప్పటికే దాతలు ముందుకొచ్చి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమని అన్నారు. పాప ఆరోగ్యం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలూ తీసుకోవాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు. పాప పరిస్థితిని వివరిస్తూ ఆమె తల్లిదండ్రులు ఎక్స్ వేదికగా నారా లోకేశ్‌కు చేసిన విజ్ఞప్తిపై ఆయన ఈ మేరకు స్పందించారు.
ఈ పునర్విక ఎవరంటే: పునర్విక కర్నూలు జిల్లాలోని వెల్దుర్తికి చెందిన సురేశ్‌కుమార్, పుష్పావతి దంపతులకు 2025 ఏప్రిల్ 12న జన్మించింది. అయితే 6 నెలలైనా పాపలో కదిలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు పాప అరుదైన ఎస్‌ఎంఏ టైప్-1(స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ) అనే సమస్యతో బాధ పడుతున్నట్లు బయటపడింది. దీనికి రూ.16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ మాత్రమే చికిత్స అని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ చిన్నారి కోసం తెలుగు రాష్ట్రాల యువత కదిలింది. చిన్నారి పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. ఇప్పటి వరకూ ఆ పాప కోసం రూ.10 కోట్లు సేకరించారు.
SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage.
— Lokesh Nara (@naralokesh) February 25, 2026
Her… https://t.co/eCuFHBbybk
ధన్యవాదాలు తెలిపిన చిన్నారి తల్లీదండ్రులు: ఈ సందర్భంగా చిన్నారి తల్లీదండ్రులు సురేష్, పుప్పావతి దంపతులు మంత్రి నారా లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. సురేష్, ఉమ దంపతుల కూతురు పునర్విక చికిత్స కోసం 16 కోట్ల రూపాయలు విలువ చేసే జోల్ జెలిస్మా ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. సాదారణ కుటుంబానికి చెందిన పునర్విక తల్లిదండ్రులు ఈ విషయంపై మొదట సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున దాతలు సహకరించి రూ.10 కోట్లు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. పాప ఆరోగ్యం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారు, రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్‌కి, దాతలందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.
నా హృదయం ముక్కలైంది: అలానే పునర్విక పరిస్థితిపై నటుడు మంచు మనోజ్ కూడా స్పందించారు. చిన్నారి పరిస్థితి గురించి తెలిసి తన హృదయం ముక్కలైందని తెలిపారు. పాప కోసం ఇంతమంది కదిలి ఫండ్ కలెక్ట్ చేయడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఆ చిన్నారికి సాయం అందేలా చూడాలంటూ పీఎంవో, తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడగలిగితే ఆ కుటుంబంతో పాటు అందరూ గెలిచినట్లేనని అన్నారు. అలానే దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్‌కి మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.
This broke me.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 24, 2026
Baby Punarvika. SMA Type 1. A rare, fatal condition. One injection can save her life. That injection costs ₹16 crores.
₹16 crores for a baby to live.
But here’s what hit me harder. People didn’t look away. Strangers, families, regular people came together and… pic.twitter.com/ul7jUzi5Uc
ఎస్‌ఎంఏ టైప్-1 అంటే ఏంటి?: స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ అనేది ఓ జన్యు సమస్య. ఇది వెన్నుపాములోని ప్రత్యేకమైన నాడీ కణాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కూర్చోవటం, నిల్చోవటం, పాకటం, నడవటం, మింగటం, శ్వాస తీసుకోవటం వంటి పనులకు సాయం చేసే కండరాలను నియంత్రించేవి ఈ కణాలే. ఇవి క్షీణించినా, మరణించినా కండరాలు క్రమంగా బలహీనమవుతాయి. వీటి పనితీరు అస్తవ్యస్తమవుతుంది. దీంతో పిల్లలు కూర్చోవటం, లేవటం, నడవటం కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవటం, మింగటమూ ఇబ్బంది కావొచ్చు. అయితే వీరిలో తెలివి తేటలు సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్లూ చేతుల వంటి భాగాలు కదలికలు దెబ్బతింటాయి. మానసికంగా చురుకుగా, అప్రమత్తంగా ఉన్నప్పటికీ కండరాల బలహీనత మూలంగా అంత వేగంగా స్పందించలేరు.
'వారి ఇంటిపై అప్పు తీర్చారు' - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
నిరుపేదకు అమరిన గుండె - లోకేశ్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు

