వంటింటి నైపుణ్యమే ఉపాధి - సద్ద రొట్టెలతో సత్తా చాటుతున్న పులివెందుల మహిళ
కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచేందుకు సద్ద రొట్టెల వ్యాపారం - ఆర్థిక కష్టాలను అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలిచిన స్వప్న - వేరుశనగ, నువ్వుల మేళవింపుతో రోజుకు 100 నుంచి 150 రొట్టెల విక్రయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 6:17 PM IST
Pulivendula Woman Roti Business : చిన్న వయసులోనే పెళ్లి, వెంటనే పిల్లలు, ఆపై కుటుంబ బాధ్యతలు. వీటికి తోడు ఆర్థిక కష్టాలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఆమె కుంగిపోలేదు. భర్తకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకుంది. తనకు తెలిసిన వంట విద్యనే ఉపాధి మార్గంగా మలుచుకుంది. ఇంట్లోనే సద్ద రొట్టెలు తయారు చేస్తూ నేడు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ప్రతినెలా ఆదాయం గడిస్తూ కుటుంబ పోషణలో అండగా నిలుస్తున్న వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన వెలిదండ్ల స్వప్న స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
చిన్న వయసులోనే పెళ్లి : ఆడపిల్ల ఎక్కువ చదువుకోకూడదనే పాతకాలపు ఆలోచనలతో పెద్దలు స్వప్నకు పదహారేళ్లకే వివాహం చేశారు. హరినాథరెడ్డితో ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టారు. కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ పోషణ భారం అంతా భర్త పైనే పడింది. హరినాథరెడ్డి సంపాదన కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు.
గాజు ఫ్యాక్టరీలో పని : పెరుగుతున్న ఖర్చులతో భర్త పడుతున్న కష్టాన్ని స్వప్న చూడలేకపోయింది. ఎలాగైనా ఆయనకు ఆర్థికంగా చేయూతనివ్వాలని బలంగా అనుకుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఒక గాజు ఫ్యాక్టరీలో పనికి కుదిరింది. ఫ్యాక్టరీలో కష్టం ఎక్కువగా ఉండేది. దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా వచ్చేది. ఆ వచ్చే చాలీచాలని జీతం కుటుంబ అవసరాలకు ఎటూ సరిపోయేది కాదట. దీంతో ఆ పనికి స్వస్తి పలికి సొంతంగా ఏదైనా చేయాలని ఆమె ఆలోచనలో పడింది.
సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నా, పెట్టుబడి పెట్టే స్తోమత ఆమెకు లేదు. పెద్దగా చదువుకోలేదు. తనకు తెలిసిందల్లా రుచికరంగా వంట చేయడం మాత్రమే. ఆ వంటనే తన ఆదాయ వనరుగా మలుచుకోవాలనుకుంది. మూడేళ్ల క్రితం ఇంటి దగ్గరే చిరుధాన్యాలతో సద్ద రొట్టెలు (సజ్జ రొట్టెలు) చేయడం మొదలుపెట్టింది. వేరుశనగ, నువ్వులు, కారం పొడి తదితర దినుసులు కలిపి ఎంతో రుచికరంగా ఈ రొట్టెలను తయారు చేసి అమ్మడం ప్రారంభించింది.
విదేశాలకు ఎగుమతులు : స్వప్న తయారు చేసే సద్ద రొట్టెల్లో రుచితో పాటు నాణ్యత అద్భుతంగా ఉంటుంది. దీంతో వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రారంభంలో కొద్ది మందికే పరిమితమైన ఆమె వ్యాపారం, ఇప్పుడు రోజుకు 100 నుంచి 150 రొట్టెలు విక్రయించే స్థాయికి చేరింది. కేవలం స్థానికంగానే కాకుండా, మన దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు సైతం ఈ సద్ద రొట్టెలను ఆమె ఎగుమతి చేస్తుండటం విశేషం.
పాతతరం ఆహారమే శ్రీరామరక్ష : ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి పాతతరం ఆహారపు అలవాట్లు తోడైతే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని స్వప్న చెబుతున్నారు. చిరు ధాన్యాలను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. చిరుధాన్యాల్లో పోషకాలు మెండుగా లభిస్తాయంటున్నారు. రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వ్యాధులతో బాధపడేవాళ్లు వీటిని తింటే ఎంతో మంచిది. వైద్యులు కూడా చిరుధాన్యాలు తినమని సూచిస్తుండటంతో, స్వప్న తయారు చేసే సద్ద రొట్టెలకు మంచి గిరాకీ పెరిగింది.
"పెళ్లి తర్వాత నేను సొంతంగా సాధించడానికి ఏమీ లేదనుకున్నా. నా జీవితం నాలుగు గోడలకే పరిమితం అనుకున్నాను. కానీ, ఇప్పుడు నాకు ఇష్టమైన పని చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇతరుల వద్ద తక్కువ జీతానికి కష్టపడే బదులు, మనకు వచ్చిన పనినే నమ్ముకుంటే కచ్చితంగా విజయం సాధిస్తాం. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయాలి. అందరికీ రుచికరంగా వండిపెడుతూ సమాజానికి ఆరోగ్యాన్ని పంచాలన్నదే నా జీవిత ఆశయం." -వెలిదండ్ల స్వప్న
చివరి రోజుకు చేరిన రొట్టెల పండుగ - జనసంద్రమైన స్వర్ణాల చెరువు
జొన్నపిండితో రొట్టెలు చేయడం రావట్లేదా? - ఇలా "చిల్లా" ట్రై చేయండి!

