ఈ నగరానికి ఏమైంది? - పబ్లిక్ టాయిలెట్లు లేక బహిరంగ ప్రదేశాల్లోనే మూత్రవిసర్జన
గుంటూరు నగరానికి నిత్యం విద్యార్థులు, రైతులు, కార్మికుల రాకపోకలు - నిర్వహణ లోపంతో అధ్వానంగా మారిన ఈ-టాయిలెట్లు - సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా జీఎంసీ ప్రణాళికలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 12:05 PM IST
Public Toilet Problems in Guntur : ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే సామాన్యులు, మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, కళాశాలకు వచ్చివెళ్లే విద్యార్థులతో గుంటూరు రద్దీగా ఉంటుంది. అలాంటి నగరంలో పౌరులకు కనీస అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ కొరత వేధిస్తోంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గుంటూరు నగరపాలకసంస్థ 30 ప్రాంతాల్లో అత్యాధునిక ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రధాన రహదారుల పక్కనే? : గుంటూరులో జనాభాకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల నగరంలో బహిరంగ మల, మూత్ర విసర్జన సమస్య పెరిగిపోతోంది. దుర్వాసన, అపరిశుభ్రత పెరిగి రోగాలు వ్యాప్తికి దారితీస్తోంది. గాంధీ పార్క్, పల్నాడు బస్టాండ్, BR స్టేడియం, నాజ్ సెంటర్, తాలుకా సెంటర్ ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లున్నా, ప్రజా అవసరాలకు తగినట్లు సరిపోవడం లేదు. నగరం మొత్తంలో 17 ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉండగా నిర్వహణ లోపంతో కొన్ని అద్వానంగా మారాయి. గతంలో కొన్ని ఇ-టాయిలెట్లు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగాలేదు. ఫలితంగా ప్రధాన రహదారుల పక్కనే బహిరంగ మూత్రవిసర్జన చేయడం ఇబ్బందికరంగా మారింది.
మరుగుదొడ్లకు భిన్నంగా కొత్త టాయిలెట్లు : స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో GMCని మెరుగ్గా నిలపాలనే సంకల్పంతో కమిషనర్ మయూర్ అశోక్ బహిరంగ మల, మూత్ర విసర్జన సమస్యను గుర్తించారు. దీనికి పరిష్కారం చూపేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 30 అత్యాధునిక మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. సాధారణ మరుగుదొడ్లకు భిన్నంగా కొత్త టాయిలెట్లు నిర్మించబోతున్నామని తెలిపారు.
" గుంటూరు సిటీ పరిధిలో దాదాపు 17 టాయిలెట్స్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు నిర్వహణ లోపంతో అద్వానంగా మారాయి. వాటిని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తిరిగి నిర్మించాము. అంతేగాక నగరంలో ప్రజల రద్దీ పెరుగుతుండటంతో మరో 30 ప్రాంతాల్లో అత్యాధునిక ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి ఏర్పాటుకు మరికొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తాం." - మయూర్ అశోక్, జీఎంసీ కమిషనర్
24 గంటల నీటి వసతి, విద్యుత్ : గతంలో నగరంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నీటివసతి లేకపోవడం, పారిశుద్ధ్య లోపంతో వల్ల ఉపయోగం లేకుండా పోయాయి. ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రతీ టాయిలెట్‌లో 24 గంటల నీటి వసతి, విద్యుత్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటి నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకుగానీ, లేదంటే ప్రత్యేక సిబ్బందికిగానీ అప్పగించాలని భావిస్తున్నారు.
'జీవించే హక్కు'లో భాగం : మరోవైపు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన జీవనం గడిపే హక్కు రాజ్యాంగం కల్పించిన 'జీవించే హక్కు'లో భాగమని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజల సౌకర్యార్థం రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో తగిన సంఖ్యలో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
మరుగుదొడ్ల నిర్మాణం ప్రభుత్వాల ముఖ్య విధి - హైకోర్టు కీలక తీర్పు
అత్యాచార బాధితురాలికి కన్యత్వ పరీక్ష.. పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు!

