పబ్ డ్యాన్సర్ రేణుక ఆత్మహత్య - ఆమె కథ వింటే కన్నీరు ఆగవు!
హోటల్లో ఫ్యాన్ ఉరేసుకుని చనిపోయిన రేణుక - ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసిన సన్నిహితులు - జీవితంలో ఎదురవుతున్న అనుభవాలకు కుంగిపోయి బలవన్మరణం

Published : July 5, 2026 at 11:58 AM IST
Pub Dancer Renuka Dead : చిన్న వయసులో ఏర్పడిన ఆకర్షణను ' ప్రేమ' అనుకుంది. ప్రేమించినవాడే సర్వం అనుకోని ఏడడుగులు వేసింది. భర్త, పిల్లలతో సంతోషంగా కలిసి జీవించాలనుకుంది. కానీ గర్భం దాల్చాక పిల్లలుంటే కలిసి జీవించలేనని భర్త తెగేసి చెప్పాడు. పెళ్లి బంధం కంటే పేగు బంధం గొప్పదని భర్తకు దూరమైంది. తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంది. తన ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఆసరగా ఉంటామని నమ్మిస్తూ మోసగించారు. జీవితం అడుగడుగునా ఎదురవుతున్న అనుభవాలతో కుంగిపోయి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. రేణుక (26) లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఓ హోటల్ గ్రాండ్లాడ్జీలో రేణుక (26) ఆత్మహత్య చేసుకుంది.
ఒంటరి జీవితంతో కుంగిపోయిన రేణుక : రేణుక తన చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒంటరి జీవితంలో కుంగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రాథమిక విద్యను మధ్యలోనే ఆపేసింది. హోటల్లో పనిచేస్తుండగా పాతబస్తీలో శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇరువురు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె గర్భం దాల్చాక శివ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడే పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తనకు బిడ్డ కావాలని నిర్ణయించుకుని భర్తకు దూరమైంది. ఎనిమిదేళ్ల బాబుతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. రేణుక అమ్మనాన్నలు వారికి దూరంగా ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా కూకట్‌పల్లిలోని పబ్బులో డ్యాన్సర్స్‌గా పనిచేస్తూ జీవితాన్ని సాగించేవారు.
ఆత్మహత్య చేసుకుంటానని పదేపదే చెప్పేది : గోల్కొండకు చెందిన ఫారూఖ్(35) తరచుగా పబ్‌కు వచ్చేవాడు. దీంతో రేణుకకు ఫారూఖ్ పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెలిగేవారు. రేణుక ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటానని, మానసిక వేదనను భరించలేకపోతున్నానని తన సన్నిహితులతో చెబుతుండేది. గురువారం ఉదయం రేణుక, ఫారుఖ్లు హోటల్ గ్రాండ్ లాడ్జీలో దిగి మద్యం సేవించారు. ఫారూఖ్ రాత్రి 10.30 గంటలకు సమయంలో హోటల్ నుంచి బయటికి వెళ్లిపోయాడు.
చనిపోతున్నానంటూ ఫోన్ చేసిన రేణుక : గురువారం రాత్రి ఫారూఖ్ బయటికి వెళ్లిపోయాక రేణుక గదిలో ఒంటరిగానే ఉంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన స్నేహితురాలు సత్యావాణికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. రేణుక ఎప్పుడూ అలానే చెబుతుండడం వల్ల ఆమె అంత సీరియస్‌గా తీసుకోలేదు. వెంటనే వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని అంటూ ఫ్యాన్వైపు చూపించింది. భయపడిపోయిన సత్యవాణి తమ స్నేహితుడైన ఫారూఖ్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఆయన వెంటనే రేణుక వద్దకు వెళ్లి పరిశీలించగా ఉరేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేణుక మరో ఏడుగురితో సన్నిహితంగా ఉండేదని విచారణలో తేలడంతో వారిని కూడా విచారించారు. రేణుక స్నేహితురాలు సత్యవాణి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు విచారణ చేపట్టారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు : జీవితమన్నాక ఏదో ఒక సందర్భంలో సమస్యలు ఎదురవడం సాధారణమని, వాటికి తగిన విధంగా ఆలోచిస్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా, మీ సమస్యను ఇతరులతో పంచుకోవాలని భావిస్తున్నా, మీకు సహకరించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24x7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు ఆదివారం మినహాయించి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కార మార్గాలను పొందవచ్చు.
వీకెండ్ పార్టీలో చిన్న గొడవ - కట్‌చేస్తే ఈత కొలనులో తేలిన యువకుడు - ఆ రాత్రి ఏం జరిగింది?
హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి - ఆ గదిలో అసలేం జరిగింది?

