ఇంటి వద్దకే నిపుణుల సేవలు - 'హోం ట్రయాంగిల్ యాప్' సర్వీసెస్
రాష్ట్రంలో వివిధ వృత్తుల్లో నిపుణులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక యాప్ - దాదాపు 30 రకాల సేవలు అందించే ఉద్దేశంతో హోం ట్రయాంగిల్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 2:10 PM IST
Home Triangle App Services in AP : ఉన్నట్టుండి ఏసీ ఆగిపోతుంది, మిక్సీ పాడైపోతుంది, బాత్రూమ్‌లోని పైపు లీకై నీరుగారుతూ ఉంటుంది. ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం నగరాలకు, పట్టణాలకు వచ్చిన చాలా కుటుంబాలకు అటువంటి సమయంలో ఎవరి సహాయం తీసుకోవాలో, ఏం చేయాలో కూడా తెలియదు. వృత్తిదారులు వచ్చే వరకు కూడా ఇబ్బందులుంటాయి. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం త్వరలోనే అందుబాటులోకి రానుంది.
సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ : ఇటువంటి వాటిని తొలగించేందుకు వివిధ వృత్తుల్లో నిపుణులైన వారి సేవలను ఇంటికే చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళల కుటుంబ సభ్యుల్లోని వృత్తిదారులకు జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రజలకు సత్వర సేవలందించే విధంగా ప్రణాళికకు రూపకల్పన చేసింది.
30 రకాల సేవలు అందించే ఉద్దేశంతో : కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, శానిటరీ, పెయింటింగ్, రిఫ్రిజిరేటర్లు, ఏసీ, గీజర్లు, వాషింగ్ మిషన్లు, వాటర్ ఫ్యూరియర్, చరవాణుల మరమ్మతులు తదితర మొత్తం సుమారు 30 రకాల సేవలు అందించే ఉద్దేశంతో "మెప్మా హోం ట్రయాంగిల్" అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సేవల్లో సర్వీసు ప్రొవైడర్లుగా నమోదైన వారికి ప్రతినెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వచ్చేలా చేయడం దీని లక్ష్యం.
హోం ట్రయాంగిల్ యాప్ : వివిధ వృత్తుల్లో నిపుణులైన వారిని గుర్తించడంతోపాటు హోం ట్రయాంగిల్ యాప్‌లో వారి వివరాలు నమోదు చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా కొందరికి 60 గంటల నైపుణ్య శిక్షణను ఇప్పిస్తున్నారు. వారి సేవల్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
810 మంది వృత్తి నిపుణుల సేవలు జిల్లావ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రీషియన్లు 296 మంది, టీవీ మెకానిక్‌లు 50, ఏసీ 31, రిఫ్రిజిరేటర్ 9, వాటర్ ఫ్యూరిఫయర్ మెకానిక్‌లు 9, వాషింగ్ మెషిన్ 11, గీజర్ 4, ఫ్లంబర్లు 59, కార్పెంటర్లు 139, సెలూన్ (మహిళలు) 56, సెలూన్ (పురుషులు) 146 మంది నమోదయ్యారు. వీరి సేవల్ని పట్టణ ప్రజలకు త్వరలోనే హోం ట్రయాంగిల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెప్మా అధికారులు వెల్లడించారు.
హోం ట్రయాంగిల్‌లో మున్సిపాలిటీ వారిగా చిలకలూరిపేటలో 103 మంది, మాచర్ల 109, నరసరావుపేట 119, పిడుగురాళ్ల 157, స్తతెనపల్లి 111, వినుకొండ 136, గురజాల 28, దాచేపల్లి 47 మంది వివిధ వృత్తుల్లో నిపుణులైన వృత్తిదారులు నమోదయ్యారు.
యాప్ నిర్వాహకులతో మెప్మా ఎంవోయూ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు వంటి వృత్తులు చేసిన వారిని ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. వారికి ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచేలా నూతన విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికోసం ఇటీవలే హోం ట్రయాంగిల్ యాప్ నిర్వాహకులతో మెప్మా ఎంవోయూ చేసుకుంది.
ఇంటి వద్దకు వెళ్లి సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా యూనిఫాం, ఐడీ కార్డు ఇవ్వనున్నారు. ఈ విధంగా నకిలీలు, మోసాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి శిక్షణతో పాటు తొలి మూడు నెలల పాటు ఉచితంగా ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఆపై నామమాత్రపు రుసుముతో నెలకు 25 ఆర్డర్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ యాప్ ద్వారా జరిగే సేవలు, నగదు చెల్లింపు, సేవాలోపం లేకుండా చర్యలు తీసుకుంటారు.
పీపీపీ విధానంతో నష్టం లేదు - వైద్య విద్య వ్యవస్థలో మార్పులు తప్పనిసరి :ఎన్‌ఎంసీ ఛైర్మన్
రాజధానిలో భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం - అభివృద్ధిపై స్పష్టత కోరుతున్న రైతులు

