దుర్గగుడిలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు - పక్కాగా మూడంచెల ప్రణాళిక!
ఏడు ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం జాబితా విడుదల - చివరి స్థానానికి పరిమితమైన దుర్గగుడి - ఏడాదిలో మార్పులు చేయాలనే లక్ష్యంతో ఆలయ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 23, 2025 at 12:15 PM IST
Provide Services to Devotees at Kanaka Durga Temple in Vijayawada : విజయవాడ కనకదుర్గ ఆలయంలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు ఆరంభమయ్యాయి. సేవల్లో సంతృప్తి స్థాయి ఆధారంగా ఇటీవల రాష్ట్రంలో 7 ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దుర్గగుడి చివరి స్థానానికి పరిమితమైంది. దీంతో ఆలయ అధికారులు అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం 3 నెలలు, ఏడాదిలో ఎలాంటి మార్పులు చేయాలనే లక్ష్యంతో పక్కాగా మూడంచెల ప్రణాళిక రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు దీనిపై దృష్టి సారించారు.
తాగునీటి ప్లాంట్ ఏర్పాటు : ఇకపై తాగునీటిని బాటిళ్ల రూపంలో అందించనున్నారు. ఆలయ పరిసరాల్లో15 తాగునీటి పాయింట్ల ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు కొత్తవి నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఘాట్‌రోడ్డు పై ట్రాఫిక్ రద్దీ తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు. వయోవృద్ధులు, వీఐపీలను కింద నుంచి దర్శనాలకు తీసుకు వెళ్లేందుకు వాహనాల ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి ప్లాంట్‌ను కొత్తగా నిర్మించనున్నారు. భక్తులు కూర్చునేందుకు వీలుగా వందకు పైగా బెంచీల ఏర్పాటు చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికులు పెంపు : తడి, పొడి చెత్త బుట్టలు వేర్వేరుగా పెట్టి, గతంలో కంటే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచారు. సూపర్‌వైజర్లను పెంచి, పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర పర్యవేక్షణ వారి ద్వారా నిర్వహిస్తున్నారు. చెత్త నిర్వహణపై భక్తులకు అవగాహన పెంచుతున్నారు. త్వరగా భవన నిర్మాణాలు పూర్తి అయితే నిర్మాణ సామగ్రి తొలగించేందుకు సాధ్యం అవుతుంది.
గంటకోసారి క్యూలైన్ల శుభ్రత పరిశీలన : ఆలయ అధికారులు భక్తుల దర్శనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సెక్యూరిటీ సిబ్బందితో క్యూలైన్ల క్రమబద్ధీకరణ చేస్తున్నారు. గంటకోసారి క్యూలైన్ల శుభ్రత చెక్ చేస్తున్నారు. తాగునీరు, మజ్జిగ క్యూలైన్లలో వేచివున్న వారికి అందజేస్తున్నారు. క్యూలైన్లు దర్శనాలకు మరింత అనువుగా ఉండేలా మార్పులు చేయనున్నారు. ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసం నూతనంగా లిఫ్ట్‌ల ఏర్పాటు చేశారు. మహామండపం ఏడో అంతస్తులో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సౌకర్యాల కల్పన.
భక్తుల అభిప్రాయ సేకరణ : ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉచిత ప్రసాదాల పంపిణీ అందిస్తున్నారు. అన్న ప్రసాదం ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశ్యంతో చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి నాణ్యతను చూసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అన్నదాన భవనంలో బెంచీకి ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు. వారు భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం వేళ అల్పాహారం ఏర్పాటుతో పాటు వారాంతాలు, పర్వదినాల్లో క్యూలైన్లలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు. అదే విధంగా రాత్రి వేళ కూడా అన్నప్రసాదం నిర్వహిస్తున్నారు. ఏడాదిలో నూతన అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఐవీఆర్‌ఎస్ ద్వారా భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాల సేకరణ మేరకు ప్రభుత్వం ర్యాంకులను కూడా విడుదల చేసింది. ఆలయ సౌకర్యాల్లో ఏఏ అంశాల్లో ఎంత మేర సంతృప్తిగా ఉన్నారు వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| అంశం | సంతృప్త శాతం |
| తాగునీరు, వసతులు | 59.9 |
| పారిశుద్ధ్యం నిర్వహణ | 62.4 |
| దర్శనాలు | 67.9 |
| ప్రసాదం (రుచి, శుచి) | 75.7 |
మరోవైపు రాష్ట్రంలోని దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచాలని ప్రభుత్వం సీరియర్‌గా ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 ప్రధాన ఆలయాలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గగుడిలో ఇకపై సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. భక్తులకు క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది ఇక ఉండదు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదుల కోసం కూడా డిజిటల్ పేమెంట్‌నే చేయాల్సిందే. చివరకు కేశఖండన టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకురానున్నారు. హుండీ కాకుండా, ఆలయానికి ప్రత్యేకంగా ఇచ్చే విరాళాలు ఇకపై ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించనున్నారు.
గతి తప్పిన దుర్గగుడి రాజమార్గం - భక్తుల రాకపోకలకు ఇబ్బందే
దుర్గమ్మ గుడిలో 'నో క్యాష్' - దర్శనం నుంచి ప్రసాదం వరకు అంతా డిజిటల్ మయం

