ETV Bharat / state

తెరపైకి 'గ్రేటర్ విజయవాడ' - సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ - 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు ప్రతిపాదన - ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన సీఎం

Proposal to Greater Vijayawada Municipal Corporation
Proposal to Greater Vijayawada Municipal Corporation (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 26, 2025 at 11:45 AM IST

|

Updated : December 26, 2025 at 5:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Proposal to Greater Vijayawada Municipal Corporation : విజయవాడకు ఇంతవరకు 'గ్రేటర్' హోదా రాలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రెండో పెద్ద నగరం విజయవాడ. భౌతికంగా ఈ నగరం అన్ని వైపులా విస్తరించి ఉంది. శరవేగంగా నగరీకరణ చెంది, అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఉన్నత విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా సకల సౌకర్యాలు సమకూరినా అవన్నీ పంచాయతీలే! ఈ గ్రామాలను నగరంలో విలీనం చేయాలని దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి ఫలించలేదు. ఫలితంగా విజయవాడకు గ్రేటర్‌ హోదా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న గ్రేటర్​ హోదా కల్పించే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.

తెరపైకి 'గ్రేటర్ విజయవాడ' - సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు (ETV)

గ్రేటర్‌ విజయవాడను ఏర్పాటు చేసి స్థానికుల దశాబ్దాల కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సీఎంకు గ్రేటర్‌ విజయవాడ ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను సమర్పించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేటర్‌ ప్రతిపాదనపై సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

3 నియోజకవర్గాల పరిధిలో 75 గ్రామాలు : విజయవాడ చుట్టుపక్కల పెనమలూరు, మైలవరం, గన్నవరం 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 75 గ్రామాలలో చాలా వరకు కూడా ఇప్పటికే అనధికారికంగా నగరంతో కలిసే ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. అంశాలన్నీ ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ వివరించారు. ఆ మేరకు నివేదికను సైతం సమర్పించారు.

విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ దారుణంగా ఉందని మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి డ్రెయిన్లు లేవని ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. తాము నగరంలోనే ఉన్నా ఎందుకీ వివక్ష అనేలా ప్రజాగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. గ్రేటర్‌ సాకారంతో ఈ పరిస్థితి మారిపోతుందని సీఎంకు వివరించారు. శివార్లలో జనాభా పెరుగుతున్నా కనీసం తాగునీరు, సరైన రహదారులు, వీధి దీపాలు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.

మాస్టర్‌ప్లాన్‌తో నగరాభివృద్ధి చేసేందుకు : ప్రస్తుతం శివార్లలో అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రేటర్‌తో సరైన నిబంధనలు, మాస్టర్‌ప్లాన్‌తో నగరాభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుందన్నారు. విజయవాడను ఆనుకునే వీటీపీఎస్, ఆటోనగర్, కొండపల్లి పారిశ్రామిక ప్రాంతం, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయని, వీటిని మరింత అభివృద్ధి చేయొచ్చని సీఎంకు వివరించారు.

గణనీయంగా ఉపాధి అవకాశాలు : విజయవాడను గ్రేటర్‌గా మారిస్తే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్‌ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు భారీగా అవకాశాలు పెరుగుతాయని సీఎంకు ఎంపీ శివనాథ్​, ఎమ్మెల్యే గద్దె వివరించారు. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి అన్నారు. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పార్కులు, వినోద కేంద్రాలను మరింత మెరుగ్గా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

సీఎం చంద్రబాబు స్పందన : ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య పరిపాలనా విభజన వల్ల పోలీసు, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ నిర్వహణ వంటి అంశాల్లో ప్రోటోకాల్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రేటర్‌ విజయవాడ ఏర్పాటుతో వీటన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని వివరించారు. తమ విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. వెంటనే గ్రేటర్‌ ప్రతిపాదనలపై దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు.

కొత్త లక్ష్యాలతో విజయవాడ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ - 3 నెల్లలో పనులు పూర్తయ్యేనా?

డీపీఆర్‌లు పంపి ఏడాదైనా లేని పురోగతి - విజయవాడ, విశాఖ మెట్రోకు మోక్షమెప్పుడో?

Last Updated : December 26, 2025 at 5:32 PM IST