ట్రాఫిక్ కష్టాలకు చెక్ - విజయవాడలో 14 కిమీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్
విజయవాడలో ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన - కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు, హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో నిర్మాణం, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రతిపాదన

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 2:35 PM IST
Proposal To Check Elevated Flyover In Vijayawada: హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి, విజయవాడ నగర పరిధిలో ఉన్న మేరకు ఆ మార్గంలో ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌ను నిర్మించే ప్రతిపాదనను అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ వద్దనున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే మార్గంలో గంగూరు కూడలి వరకు మొత్తం 14 కిలోమీటరల వరకు దాదాపు 6 వరుసలతో పై వంతెనను నిర్మించాలని ఆలోచిస్తున్నారు.
ముఖ్యంగా దీని వలన జాతీయ రహదారిలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలు ఉండవని, అంతేకాకుండా విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలు కూడా తీరతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టవచ్చొన్న భిన్నమైన ప్రణాళికలపై దీల్లీ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్: హైదరాబాద్ - విజయవాడ -మచిలీపట్నం రహదారి-65 విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీ పురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి, పెనమలూరు వైపు వెళ్తుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ - విజయవాడ మధ్య హైవేను ప్రధానంగా 6 వరుసలుగా విస్తరించే ప్రాజెక్టును చేపట్టడం గమనార్హం. దీనిని ముఖ్యంగా గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్కు క్రాస్ అయ్యే పాయింట్ వరకే విస్తరించాల్సిందిగా మొదట భావించారు.
కానీ ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు విస్తరించేందుకు గాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సన్నాహాలను చేసేందుకు సిద్ధపడుతుంది. మరొకవైపు ఉన్న విజయవాడ-మచిలీపట్నం రహదారిని 6 వరుసలుగా విస్తరించేటటుంటి ప్రాజెక్టును సైతం చేపడుతుండటం గమనార్హం. అదే విధంగా దావులూరు టోల్‌ప్లాజా సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్ క్రాస్ అయ్యే ప్రదేశం నుంచి మచిలీపట్నం వరకు 6 వరుసలుగా విస్తరించనున్నారు.
6 వరుసలుగా విస్తరణ: అంతేకాకుండా విజయవాడ నగర పరిధిలోని కనకదుర్గ ఫ్లైఓవర్ తర్వాత నుంచి వరుసగా కృష్ణలంక, వారధి జంక్షన్, స్కూల్ బ్రిడ్జి, బెంజ్ సర్కిల్ వరకు, అక్కడ నుంచి మచిలీపట్నం వైపు కానూరు, పోరంకి, పెనమలూరు, గంగూరు, కంకిపాడు వైపుగా దావులూరు టోల్‌ప్లాజా వరకు 4 వరుసలుగానే ఈ రహదారి మిగిలిపోనుంది. తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
అంతేకాకుండా విజయవాడకు ఇపువైపులా 6 వరుసలుగా విస్తరించి వాహన రద్దీ ఎక్కువగా ఉండే నగరం మధ్యలో మాత్రం 4 వరుసలుగా మిగిలిపోతే ఎలాగైనా ప్రశ్న తలెత్తింది. దీనికి నగరంలో 6 వరుసలతో ఎలివేటెడ్ నిర్మించడమే పరిష్కారమనే ఓ అంచనాకు వచ్చారు. దీని ద్వారా కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు కూడలి వరకు 6 వరుసలతో ఎలివేటెడ్ వంతెన ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు.
కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు: అయితే ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి గాను బెజవాడ నగర పరిధిలో భూసేకరణ అవసరం ఎక్కువగా ఉండదు. వివిధ జంక్షన్ల వద్ద వంతెనపైకి వెళ్లేందుకు, అదే విధంగా బయటకు వెళ్లేందుకు నిర్మించేటటువంటి అప్రోచ్‌లకు మాత్రం భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మొత్తంగా 14 కిలోమీటర్ల పొడవునా ఒకే వంతెనను నిర్మించాలా? లేక 2 భాగాలుగా విభజించాలా అనే చర్చ మాత్రం ఎక్కువగా నడుస్తుంది. దాదాపు ఒకే వంతెనను నిర్మించాలంటే మధ్యలో బెంజ్ సర్కిల్ వద్దన ఇప్పటికే 2 వంతెనలు ఉన్నాయి.
దాంతో వాటిపై నుంచి బందరు వైపు మలుపు తిరిగే విధంగా ఎలివేటెడ్ ప్లైఓవర్ డిజైన్‌ను చేయాల్సి ఉంటుంది. వీటికి బదులుగా కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంక, వారధి కూడలి మీదుగా జెంజ్ సర్కిల్ సమీపం వరకు మొత్తం 5 కిలోమీటర్ల ఒక ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, అదే విధంగా బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు కూడలి వరకు 9 కిలోమీటర్ల మరో ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తే ఎలా ఉంటుదనే విషయాన్ని ప్రస్తుతం పరిశీలించనున్నారు. దాంతో మొత్తంగా హైదరాబాద్ - విజయవాడ మధ్య, విజయవాడ - మచిలీపట్నం మధ్య హైవే విస్తరణ పేరుపై ఒకే హైవేపై మొత్తం 2 ప్రాజెక్టులకు డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అందులోనే ఈ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌ను సైతం చేర్చే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.
బెంజి సర్కిల్ వద్ద వేలాడే సిగ్నల్స్, ప్రయాణికులకు ఇక్కట్లు
విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు.. పరిష్కారం చూపాలంటూ వేడుకోలు!

