ETV Bharat / state

అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కొరడా - ఆ భూముల దస్తావేజు రద్దు

రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ - ఉద్దేశపూర్వకంగా చేస్తే అధికారులపైనా చర్యలు

Prohibited Lands are Registered Using Fake Documents Will be Canceled
Prohibited Lands are Registered Using Fake Documents Will be Canceled (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 3, 2026 at 10:58 AM IST

3 Min Read
Choose ETV Bharat

Prohibited Lands are Registered Using Fake Documents Will be Canceled: నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్​ సారథ్యంలోని ఒక కమిటీకి అప్పగించింది. రిజిస్ట్రార్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సభ్యులుగా ఉంటారు.

ఈ మేరకు రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్​ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్‌ అధికారి ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. ఐజీ (ఇన్‌స్పెక్టర్ జనరల్) అనుమతితో క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేస్తారు.

సుమోటోగా విచారణ:-

ఎలాంటి రుసుము లేకుండానే: 22ఎ, 22బి, 22సి కేటగిరీల కింద జాబితాలోని నిషేధిత భూముల్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్​ చేశారని ఆరోపిస్తూ ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత రిజిస్ట్రార్‌ సుమోటోగా దస్తావేజు రద్దుకు చర్యలు ప్రారంభించవచ్చు. ఫిర్యాదుదారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

పార్టీలకు నోటీసులు జారీ: ఫిర్యాదు అందిన 15 రోజుల్లోనే రిజిస్ట్రార్‌ ప్రాథమిక విచారణ చేయాలి. ఆధారాలు ఉన్నాయని తేలితే గనక రద్దు చర్యలు ప్రారంభించాలి. ఆధారాలు లేకపోతే ఫిర్యాదును తిరస్కరించాలి. అందుకు గల కారణాలను ఫారం-3లో నిర్వహించే రిజిస్టర్‌లో మాత్రమే నమోదు చేయాలి. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలితే విచారణ ప్రారంభిస్తారు. దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

నిబంధనలకు విరుద్ధంగా: దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్‌ అయిందని తేలితే లిఖిత పూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియ కొనసాగించాలి. దాన్ని జిల్లా స్థాయి కమిటీకి పంపాలి. రిజిస్ట్రార్‌ నుంచి వచ్చిన విచారణ నివేదికపై 15 రోజుల్లోపు జిల్లా కలెక్టర్‌ సారథ్యంలోని కమిటీ సమావేశం అవ్వాలి. రిజిస్ట్రార్‌ ప్రతిపాదనలతో పాటు సంబంధిత పక్షాల నుంచి వచ్చిన సమాధానాలు, సాక్ష్యాలను సమీక్షించాలి. తమ నిర్ణయాన్ని రిజిస్ట్రార్‌కు పంపిస్తుంది.

కమిటీ నిర్ణయం అందిన 7 రోజుల్లో రిజిస్ట్రార్‌ తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. దస్తావేజు రద్దు లేదా తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాన్ని అన్ని పక్షాలకు కూడా పంపాలి. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు గుర్తిస్తే ఐజీ నేరుగా చర్యలు తీసుకోవచ్చు. సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేయవచ్చు. వారి నుంచి వివరణ కోరవచ్చు. తర్వాత ఆ దస్తావేజు రద్దు లేదా ఫిర్యాదు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు

రికార్డుల్లో తగిన మార్పులు: రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తే దానికి సంబంధించిన ఉత్తర్వులు సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపిస్తారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ, పురపాలక, పంచాయతీ అధికారులకు పంపాలి. వారు తమ రికార్డుల్లో (మ్యుటేషన్‌/అడంగల్‌) తగిన మార్పులు చేయాలి. రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత 30 రోజుల్లో ఐజీకి అప్పీలు చేసుకోవచ్చు. ఆయన 6 నెలల్లో పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలి.

ఐజీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌) శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే కమిటీకి అప్పీలు చేసుకోవచ్చు. వారు 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. కమిటీ నిర్ణయం తీసుకున్న 3 వారాల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.

ఏదైనా పత్రం నకిలీదని తేలితే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. బుక్‌ నంబర్‌-2లో విధిగా నమోదు చేయాలి. కోర్టు, ట్రైబ్యునళ్లు తాత్కాలిక లేదా శాశ్వత ఎటాచ్‌మెంట్‌ చేస్తే వాటిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. గతంలో రిజిస్టర్‌ అయిన అమ్మకపు దస్తావేజు రద్దు చేయాలంటే క్రయ విక్రయదారులు విధిగా సంతకాలు చేయాలి. పార్టీల మధ్య పరస్పర అంగీకారం తెలిపే డిక్లరేషన్‌ ఉండాలి. లేదా సివిల్‌కోర్టు, హైకోర్టు లేదా కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు అయిన ఉండాలి.

భూ యజమానులకు గుడ్​న్యూస్ - ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగింపు

టీటీడీ, పర్యాటకశాఖల మధ్య జరిగిన భూమార్పిడి విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు