అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు - ఇకపై ఏ సర్టిఫికెట్ అయినా ఆన్లైన్లోనే
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఆదాయ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ - దశల వారీగా కుల, నివాసం వంటి ఇతర ధ్రువపత్రాలు సులువుగా జారీ చేసే విధానం -ఇబ్బందులు దూరం చేసేలా ప్రభుత్వ విధానం

Published : March 2, 2026 at 3:00 PM IST
|Updated : March 3, 2026 at 6:44 AM IST
Caste, Income Certificate Issue in Telangana : చదువు కోసం, ఉద్యోగాల కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే మీ సేవ కేంద్రంలో అప్లై చేసుకుని, ఆ తర్వాత ఆ దరఖాస్తుకు జత చేసిన ఆధార్, రేషన్‌కార్డు, ఇతర పత్రాలతో రెవెన్యూ ఆఫీసుకు వెళ్లి సిబ్బందిని బతిమాలే రోజులు త్వరలోనే దూరం కానున్నాయి. మీ సేవ కేంద్రం ద్వారా అప్‌లోడ్ చేసిన పేపర్ల ఆధారంగా ఎక్కడికీ వెళ్లకుండానే సర్టిఫికెట్లు జారీ చేసే పారదర్శక సేవలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత అత్యవసరంగా భావించే ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ ప్రారంభం కాగా, దశలవారీగా క్యాస్ట్, రెసిడెన్సీ వంటి ఇతర ధ్రువపత్రాలు సులువుగా జారీ చేసే విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు.
చేతులు తడపనిదే పని కాదు : పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ ఆఫీస్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇదే అదునుగా అక్కడ కొంతమంది సిబ్బంది అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని అన్ని సవ్యంగానే ఉన్నా, చేతులను తడపనిదే సర్టిఫికెట్లు జారీ చేయడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మీ సేవ ద్వారా దరఖాస్తు సమర్పించినా మళ్లీ కార్యాలయానికి, రెవెన్యూ సిబ్బంది వద్దకు పరుగులు పెడుతున్న తరుణంలో దరఖాస్తుదారుల ఇబ్బందులు దూరం చేసేలా సర్కారు కొత్త విధానం ఊరటనివ్వనుంది.
ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ : మీ సేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత గ్రామ రెవెన్యూ పాలనాధికారి (జీపీవో) లాగిన్‌లోకి వస్తుంది. ఆయన విచారణ తర్వాత మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఎంఆర్‌ఐ)కి, తదనంతరం ఆర్‌ఐ నేరుగా డిప్యూటీ తహసీల్దార్(డీటీ) లాగిన్‌కి చేరవేరుస్తారు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేసే వీలుండదు. ఇప్పటికే చాలా చోట్ల ఆదాయ పత్రాన్ని ఆన్‌లైన్‌లో ధ్రువీకరించే ప్రక్రియ మొదలైందని ఆదిలాబాద్ జిల్లా మీ సేవల విభాగం మేనేజర్ బండి రవి తెలిపారు.
ఆఫీసులకు రాకుండా పనులు జరగాలి : ఇటీవల ఐఏఎస్‌లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తేవాలని అధికారులందరికీ సూచించారు. విద్యుత్ మీటర్, ఇంటి నిర్మాణానికి పర్మిషన్, నల్లా కనెక్షన్ ఇలా ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ ఫైలు, ఏ అర్జీ ఎక్కడ ఉందో అప్లికేషన్ చేసిన వ్యక్తి తెలుసుకునే విధంగా సులభమైన పద్దతులు ఉండాలన్నారు. అలాగే రైతుల భూ సమస్యలు వేగంగా పరిష్కరించే విధంగా ఉండాలన్నారు.
ఈ-ఆఫీస్, డిజిటల్ గవర్నెన్స్ విధానం అమలు చేయండి : సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 3 వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించాలని నిర్దేశించారు. ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా క్లారిటీతో అప్‌గ్రేడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరాలన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అందించాలన్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం చెప్పారు.
ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం
'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' - మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు కార్యక్రమం

