ETV Bharat / state

నేషనల్​ హైవేపై అనుకోని సమస్యా? - ఈ నెంబర్​కి కాల్ చేయండి - సేవలు పొందండి

అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులకు ఉపయుక్తం - ఎస్​వోఎస్​ ఫోన్​ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిన నేషనల్​ హైవే అధికారులు

National Highway Emergency SOS
National Highway Emergency SOS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 12:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

National Highway Emergency SOS : జాతీయ రహదారి వినియోగదారులకు అత్యవసర సమయంలో సమస్యను అధిగమించేందుకు నేషనల్​ హైవే అథారిటీ అధికారులు ఎస్​వోఎస్​ ఫోన్​ కేంద్రాలను అందుబాటులో తీసుకొచ్చారు. జాతీయ రహదారి మార్గంలో ప్రయాణించే సమయంలో మీ వాహనానికి సమస్య వచ్చినా, పొరపాటున ప్రమాదానికి గురైనా, ప్రమాదంలో చిక్కుకున్నా 1033 హైల్ప్​లైన్​ను ఉపయోగించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్​ నుంచి ఆ టోల్​ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వడం మాత్రమే. ఈ 1033 నెంబర్​కు కాల్​ చేస్తే ఆపద సమయంలో వాహనదారులకు వెంటనే సేవలందిస్తారు.

మూడు కిలోమీటర్లకు ఒక కేంద్రం : ఆదిలాబాద్​ జిల్లాలో శ్రీరాంపూర్​ నుంచి రేపల్లెవాడ వరకు 363 జాతీయ రహదారి 42 కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరించారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇరువైపులా 25 చోట్ల ఎస్​వోఎస్​ ఫోన్​ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. ఒక కాల్​తో వెంటనే నేషనల్​ హైవే అథారిటీ కంట్రోల్​ రూంకు వెళ్తుంది. సిబ్బంది అక్కడికి చేరుకుని వారు సేవలు అందిస్తారు.

అర్ధరాత్రి వేళ అండగా :

  • అర్ధరాత్రి కుటుంబంతో వెళ్తున్న వాహనంలో పెట్రోల్​, డీజిల్​ అయిపోయినప్పుడు ఎస్​వోఎస్​ నుంచి ఫోన్​ చేస్తే వెంటనే సిబ్బంది వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి బిల్లు తీసుకుంటారు.
  • రహదారిపై వెళ్తుండగా ఆకస్మాత్తుగా వాహనం మరమ్మతులకు గురైనప్పుడు ఫోన్​ చేస్తే సమీపంలో మెకానిక్​ ఫోన్​ నెంబర్​ ఇవ్వడం గాని, వాహనం సురక్షిత ప్రదేశంలో పార్కింగ్​ చేసేలా సూచనలు చేసి చోదకుడిని సమీపంలో దిగబెడతారు.
  • ఇక భారీ వాహనాలు చెడిపోతే ప్రమాదాలు జరగకుండా వాహనం సమీపంలో సేఫ్టీ కోన్స్​ ఏర్పాటు చేస్తారు. క్రేన్​ సహాయంతో వాహనాన్ని సర్వీస్​ రోడ్డుకు దారి మళ్లిస్తారు.

ప్రాణాలు కాపాడారు : ఇటీవల శ్రీరాంపూర్‌ - బొక్కలగుట్ట గ్రామల మధ్య కారు బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మహారాష్ట్ర వాసులు చూశారు. వారికి సరైన లొకేషన్‌ తెలియకపోవడం వల్ల ఎస్​వోఎస్‌ ద్వారా ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దాని చైనేజీ నెంబర్‌ (కిలోమీటర్‌ నెంబర్‌) ఆధారంగా వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది.

ఎప్పుడెప్పుడు ఏవేవో తెలుసా? :

గాయపడితే : 1033 హెల్ప్‌లైన్‌ నెంబర్ నేరుగా అంబులెన్స్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించి ఉంటుంది. దీంతో ఫోన్‌ చేసిన వెంటనే అత్యవసర వాహనం అందుబాటులోకి వస్తుంది. గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అందటం ద్వారా ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండదు.

వాహనం దెబ్బతింటే : వాహనం పాడైపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంటే క్రేన్‌ అందుబాటులోకి వస్తుంది. వెంటనే వాహనాన్ని తొలగిస్తారు. కొన్ని నిమిషాల కాలంలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తారు.

పెట్రోల్​ లేకపోయినా : రహదారి మార్గంమధ్యలో వాహనంలో పెట్రోల్​ అయిపోతే పెట్రోలింగ్​ సిబ్బంది వచ్చి ఐదు లీటర్ల పెట్రోల్​ లేదా డీజిల్​ తెచ్చి ఇస్తారు. ఇంధనం ఇందుకు అయ్యే డబ్బును వాహనదారుడు చెల్లించాల్సి ఉంటుంది.

టైర్‌ పంక్చర్‌ అయితే : వాహనం టైరు పంక్చర్‌ అయితే పెట్రోలింగ్‌ సిబ్బంది వచ్చి టైర్‌ మార్చడానికి సాయపడతారు. యాంత్రిక సమస్య తలెత్తినా మెకానిక్‌లను, సహాయ వాహనాలను సమకూర్చుతారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తారు.

ఏదైనా సమస్య ఎదురైతే : రహదారులపై వెళ్తున్నప్పుడు దాడులు, దోపిడీలు తరహా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ 1033 నంబరుకు ఫోన్ చేయండి. ఈ నెంబరు పోలీసు స్టేషన్లు, హైవే పెట్రోలింగ్‌ యూనిట్లు, సమీప ఆసుపత్రులతో అనుసంధానమై ఉంటుంది.

మీకు జాతీయ రహదారిపై సమస్య వచ్చిందా? - ఈ నెంబర్​ మీ వెంట ఉంటే నో ప్రాబ్లం!

NH-44పై ఆ 10 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ - 6 అడుగుల ఎత్తుతో ఇరువైపులా