పిల్లల విక్రయాల కేసు - తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితురాలు ప్రియాంక
పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంకపై నిఘా - గత నెలలో మేరఠ్‌లో తృటిలో తప్పించుకుని - ఇప్పటికే అరెస్టయిన నిందితులు దిల్లీలో ప్రియాంక నుంచి తాము పిల్లలను తీసుకున్నట్లు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 12:10 PM IST
Priyanka is the key Accused in the Sensational Child Trafficking Case : రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల విక్రయాల కేసు సంచలనం రేపింది. ఈ కేసులో కీలక నిందితురాలు ప్రియంక తప్పించుకు తిరుగుతోంది. గత నెలలో మేరఠ్‌లో త్రుటిలో తప్పించుకుంది. నిందితురాలు ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తోంది. బెజవాడ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. దీంతో నిందితురాలు సిమ్‌లు మారుస్తూ ఏమారుస్తోంది. దిల్లీ ముఠాకు ఈమే సూత్రధారి. ఈమె దొరికితేనే కేసు ముందుకు సాగేది.
నిందితురాలి బాయ్‌ఫ్రెండ్ పై పోలీసులు నిఘా పెట్టారు. ఆమె వివరాల కోసం రెక్కీ బృందం మేరఠ్ వెళ్లనుంది. అతడిని అదుపులోకి తీసుకుని విషయం తేల్చానుంది. మరో బృందం ప్రియాంకను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లనుంది. మరోవైపు ముంబై ముఠాలోని కవిత సహాయకురాలు నూరిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. థానేలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈమె రెండు సార్లు పిల్లలను విజయవాడకు తెచ్చి, సరోజినికి ఇచ్చింది. నిందితుడు అనిల్ విచారణలో అతని బంధువు బాబు పేరు బయటకు వచ్చింది. అతడిని కూడా నిందితుడిగా చేర్చారు. వీరందరినీ అరెస్టు చేసేందుకు ముంబైకి మరో బృందం వెళ్లనుంది.
పేదింటి బిడ్డలను తెచ్చి : ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు దిల్లీలో ప్రియాంక నుంచి తాము పిల్లలను తీసుకున్నట్లు వెల్లడించారు. కిరణ్‌శర్మ కూడా ఇదే తెలిపింది. దిల్లీలో కిరణ్‌శర్మ ప్రియాంక ఒకేచోట ఉండేవారు. పేదింటి బిడ్డలను ఈమె ప్రియాంక నుంచి తీసుకునేది. ఆ తర్వాత అమ్మకానికి విజయవాడలో బలగం సరోజినికి చేర్చేది. దీంతో కేసు దర్యాప్తు ప్రియాంక వద్ద ఆగిపోయింది. ఈమె ఎక్కడి నుంచి పిల్లలను తెచ్చిందనేది తేలలేదు. ఉత్తరాది నుంచి పలు ప్రాంతాల కార్మికులు దిల్లీ వచ్చి మురికి వాడల్లో జీవిస్తుంటారు. వీరిలో పోషించే స్థోమత లేని వారి పిల్లలను తీసుకుందని అనుమానాలు ఉన్నాయి.
పాపపు సొమ్ముతో విలాస జీవితం : పిల్లల విక్రయాలతో వచ్చే సొమ్ములో ప్రియాంక విలాస జీవితం గడిపేది. ఈమెకు దిల్లీ, యూపీలో మేరఠ్లోనూ ఇళ్లు ఉన్నాయి. దిల్లీలో పశ్చిమ విహార, హరియాణాలో ఫరీదాబాద్‌తో పాటు బెజవాడలో 3 స్టేషన్లలో ప్రియాంకపై కేసులు నమోదు అయ్యాయి. ప్రియాంక ఫోన్లో లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నారు. పాత సిమ్‌ను తీసేసి, కొత్తది ఉపయోగిస్తోంది. మేరఠ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత కొద్ది రోజులకే ఆ సిమ్ స్విచాఫ్ అయింది. కొత్తది తీసుకున్నట్లు గుర్తించారు. ఆ నెంబరును కూడా పట్టుకున్నారు. కానీ దానినీ మార్చేసింది.
పిల్లల్ని తీసుకుని విక్రయాలు : ప్రియాంకకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె దిల్లీతోపాటు యూపీలోని మీరట్‌లోనూ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దిల్లీ సబర్బన్, యూపీలోని శివారు గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకుని వివిధ ప్రాంతాల్లోని ముఠాలకు విక్రయిస్తుంది. ఈమెపై దిల్లీలోని పశ్చిమ విహార పోలీసు స్టేషన్, హరియాణాలోని ఫరీదాబాద్ స్టేషన్లతోపాటు విజయవాడలో మూడు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇది ఒక ఎత్తైతే ప్రియాంక తల్లి, సోదరి, తమ్ముడి పై దిల్లీలోని బేగంపూర్ స్టేషన్‌లో పిల్లల విక్రయాల కేసులు నమోదు అయ్యాయి. అక్కడి పోలీసులు వీరిని అరెస్టు చేశారు. తల్లి దేవకి, సోదరి ప్రియ దిల్లీలోని మందాలి కారాగారంలో, సోదరుడు పీయూష్ తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
ప్రియాంక కదలికలపై పోలీసుల నిఘా - దొరికితేనే మూలాలు బయటకు
పిల్లల విక్రయాల కేసు - లొంగుబాటులో దిల్లీ ముఠాలో కీలక సూత్రధారి ప్రియాంక

