ETV Bharat / state

సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి షాక్ - జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

సంక్రాంతికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వైపు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు - టికెట్‌ ధరలు పెంచిన ప్రైవేట్‌ట్రావెల్‌ సంస్థలు - అదనంగా వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు

Private Travel Buses Are Increasing Ticket Fare
Private Travel Buses Are Increasing Ticket Fare (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 7:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

Private Travel Buses Are Increasing Ticket Fare : సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో జాప్యం చేయడంతో ప్రజలు ప్రైవేట్ బాటపట్టారు. ఈ పరిస్థితుల్ని ప్రైవేటు ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా 10,11వ తేదీల్లో ప్రైవేట్ ట్రావెల్స్​కు భారీ డిమాండ్ నెలకొంది. ఆ తర్వాత రోజుల్లోనూ డిమాండ్ భారీగానే ఉంది. రెండు రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు.

రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు : ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50 శాతానికి మించడం లేదు. ప్రైవేటు బస్సుల యజమానులు మాత్రం రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్-విశాఖపట్నం రూట్​లో ఆర్టీసీలో టికెట్ ధర రూ.1889 ఉంటే అదే ప్రైవేటులో రూ.5 వేల నుంచి రూ.5.998ల వరకు ఉంది. అదే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర రూ.6.988 వరకు పలుకుతుంది. హైదరాబాద్-రాజమహేంద్రవరం ఆర్టీసీ సూపర్ లగ్జరీలో రూ.1,082 ఉంటే ఆర్టీసీ స్లీపర్​లో రూ. 2,888 చార్జీ వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ స్లీపర్​లో మాత్రం ధర రూ.5,990లు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ - విజయవాడ రూట్​లో ఆర్టీసీలో సీటర్ టికెట్ రూ.440లుగా ఉంది. ప్రైవేట్​లో మాత్రం రూ.1,750 నుంచి రూ.1,799 వరకు పలుకుతుంది. ఇక స్లీపర్​లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి రూ.3,500- 5999గా నిర్ణయించారు. హైదరాబాద్-బెంగళూరు రూట్​లో ఆర్టీసీ స్లీపర్ బస్సు టికెట్ రూ.1,206 ఉంటే అదే ప్రైవేట్ బస్సుల్లో ఒక్కో బెర్త్​కు ఆపరేటర్​ను బట్టి రూ.2,799 నుంచి రూ.6,899 వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నా రవాణాశాఖ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 5,432 బస్సులు, ఏపీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఇసీఐయల్, కేపీహెచ్​బీ, ఎస్ఆర్​ నగర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్, దిల్​సుఖ్​నగర్ పాయింట్లతో పాటు జంట నగరాలలోని వివిధ శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి నడపడానికి ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. బస్సుల ఆపరేషన్ పర్యవేక్షించుటకు ప్రత్యేక అధికారులను, ఉద్యోగులను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

సుమారు 9 లక్షల వరకు తరలివెళ్లినట్లు అంచనా : దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్బంగా 160 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. హైదరాబాద్​ నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయినప్పటికీ రైళ్లు సరిపోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొంది.

నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ప్రయాణికులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక టోల్ గేట్ల వద్ద సైతం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. సొంత వాహనాల్లో తరలివెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులు, టోల్ గేట్లలో భారీగా రద్దీ నెలకొంది. గత సంక్రాంతి పండుగకు సుమారు 9 లక్షల వరకు తరలివెళ్లినట్లు రహదారుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది పండుగకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు.

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - హైదరాబాద్ టూ విజయవాడ 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం - హైవేలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద పెరిగిన రద్దీ