ETV Bharat / state

ప్రైవేట్​ బస్సుల్లో సీటుకో రేటు - రానూపోనూ రూ.50 వేలు కావాల్సిందే!

సంక్రాంతికి మూడు రోజుల ముందే పండగ చేసుకుంటున్న ప్రైవేట్​ ట్రావెల్స్ - టికెట్​ ధరలు 4 రెట్లు పెంచి ప్రయాణికుల నిలువు దోపిడీ - ఒక్కో కుటుంబానికి రానూపోనూ రూ.50 వేలు దాటుతున్న ఛార్జీలు

Private Travel Buses
Excessive Fares in Private Travel Buses (ENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 10:44 AM IST

|

Updated : January 11, 2026 at 10:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

Excessive Fares in Private Travel Buses : పిల్లలకు సంక్రాంతి సెలవులొచ్చేశాయ్​. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్​లో స్థిరపడిన వారంతా పండగను తమ తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు కుటుంబసమేతంగా పల్లె బాట పట్టారు. ఇదే అదనుగా ప్రైవేట్​ ట్రావెల్స్​ దోపిడీకి తెరలేపాయి. టికెట్​ ధరలను భారీగా పెంచేశాయి. సీటుకో రేటు నిర్ణయించి, ప్రయాణికుల జేబులను గుళ్ల చేస్తున్నాయి. పండగకు మూడు రోజుల ముందు నుంచే అధిక ఛార్జీలతో పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం వెళ్లి రావాలంటే సుమారు రూ.50 వేల ఖర్చయ్యేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

సీటుకో రేటుతో ప్రైవేట్​ ట్రావెల్స్​ నిలువు దోపిడీ :

⦁ హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో 1.60 లక్షల మంది వరకు వెళ్తారని అంచనా. వీరిలో సుమారు 60 వేల మంది ఆర్టీసీ బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు ప్రయాణిస్తారు. మిగిలిన వారందరికీ ప్రైవేట్​ ట్రావెల్స్ వాహనాలే గతి.

⦁ మామూలు రోజుల్లో హైదరాబాద్​-విజయనగరానికి ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సుల్లో సీటర్ అయితే రూ.1,400 నుంచి రూ.1,600 ఛార్జీ, స్లీపర్ అయితే రూ.2 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఉండటంతో ఓ ట్రావెల్స్​ సంస్థ ఏకంగా 4 రెట్లు ధరలు పెంచేసింది. హైదరాబాద్​ నుంచి విజయనగరానికి రూ.6,000 వసూలు చేస్తోంది. మరో సంస్థ సీటర్​కు రూ.3,499, స్లీపర్ అయితే రూ.3,999 తీసుకుంటోంది.

పండగ వేళ ఇట్లనే ఉంటది సార్ : ప్రైవేట్ ట్రావెల్స్​ ఇష్టారీతిన పెంచిన టికెట్ ధరలతో హైదరాబాద్​ నుంచి విజయనగరానికి రానూపోనూ కలిపి ఒక్కో కుటుంబానికి రూ.50 వేల ఖర్చు దాటుతోంది. మళ్లీ అక్కడి నుంచి బొబ్బిలి, చీపురుపల్లి, సాలూరు, పార్వతీపురం, రాజాం, పాలకొండ పట్టణాలకు వెళ్లాలంటే మరో రూ.5-6 వేలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. హైదరాబాద్‌ నుంచి పార్వతీపురం, విజయనగరం, పాలకొండ, రాజాం పట్టణాలకు నాన్‌ ఏసీ బస్సుల్లో అయితే సాధారణ రోజుల్లో రూ.1,000 నుంచి రూ.1,200, స్లీపర్‌ ఏసీ రూ.1,400 నుంచి రూ.1,600 ఉండగా, పండగ నేపథ్యంలో టికెట్ ధరలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే పండగ వేళ ఇలాగే ఉంటుందని ట్రావెల్స్ ఉద్యోగులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఒకలా - బుక్ చేద్దామంటే మరోలా : ఆన్​లైన్​లో టికెట్​ బుక్​ చేద్దామని చూస్తే బస్​ బుకింగ్ వెబ్​సైట్లలో తక్కువ ధర చూపుతున్నారు. తీరా బుక్​ చేసే సమయంలో ధరలు చూసి అవాక్కయ్యేలా చేస్తున్నారు. టికెట్లను బ్లాక్​ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. విండో సీటుకు ఓ రేటు, ముందు సీటుకు మరో రేటు, వెనక సీటుకు ఇంకో రేటు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ సంస్థలో పని చేసే ఉద్యోగి ఏపీలోని పార్వతీపురానికి వెళ్లేందుకు ఆన్​లైన్​లో టికెట్ బుక్​ చేద్దామని చూస్తే సీటర్ (నాన్​ ఏసీ) రూ.2,999 చూపించింది. సరే అని బుక్​ చేస్తే బుకింగ్ ఆప్షన్లలో రూ.3,299గా ఉంది. అదే బస్సులో డబుల్​ బెర్త్​ రూ.3,999 చూపెట్టగా, సింగిల్​ బెర్త్​ రూ.4,299 చూపించడం గమనార్హం.

గంటగంటకూ ధరల మార్పు : ప్రైవేట్ ట్రావెల్స్​ వెబ్​సైట్లలో బస్సు టికెట్ల ధరలు ఆన్​లైన్​లో గంటగంటకూ మార్చేస్తున్నారు. ఓ సంస్థకు సంబంధించిన వెబ్​సైట్​లో హైదరాబాద్​-విజయనగరం బెర్త్​ రూ.5,499 చూపిస్తే, అదే బస్సులో చివరలో సీటు ఛార్జీ రూ.3,539గా, మధ్యలో సీటు అయితే రూ.3,979 చూపిస్తోంది. అదే వెబ్​సైట్​లో మరో గంట తర్వాత చూస్తే టికెట్​ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటోంది.

సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి షాక్ - జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - హైదరాబాద్ టూ విజయవాడ 10 ప్రత్యేక రైళ్లు

Last Updated : January 11, 2026 at 10:57 AM IST