పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ - సీటుకో రేటుతో ప్రయాణికుల జేబులు లూటీ
అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు - దూరాన్ని బట్టి మూడు, నాలుగు రెట్లు పెంచి వసూలు - అడ్డగోలుగా పెంచిన చార్జీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 2:04 PM IST
Private Travel Ticket Prices in AP : సంక్రాంతికి మూడు రోజుల ముందే కొందరు ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడినవారు ఈ పండుగకి సొంతూళ్లకు కుటుంబాలతో తరలి వస్తారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలతో పిండేస్తున్నారు. విజయనగరం జిల్లాను తీసుకుంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు 1.60 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వస్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో 60 వేల మంది వరకు ప్రయాణిస్తారు. మిగిలిన లక్ష మంది జనాభాకి ప్రైవేటు వాహనాలే దిక్కు.
అడ్డగోలుగా పెంచిన చార్జీలు : సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయనగరానికి ప్రైవేటు బస్సులో సీటర్ ఛార్జీ రూ.1,400 నుంచి రూ.1,600 వరకు ఉంటుంది. అదే స్లీపర్‌కు రూ.2 వేలు వరకు ఉంటుంది. ఈ సంక్రాంతికి మాత్రం ఓ ట్రావెల్స్ సంస్థ ఏకంగా నాలుగు రెట్లు పెంచేసింది. హైదరాబాద్ నుంచి విజయనగరానికి దాదాపు రూ.6,000 వరకు వసూలు చేస్తోంది. మరో ట్రవెల్స్ సంస్థ హైదరాబాద్ నుంచి విజయనగరానికి సీటర్‌కు రూ.3,499 నుంచి రూ.3,999 వరకు వసూలు చేస్తోంది.
సంక్రాంతిని ఆసరాగా చేసుకొని, అడ్డగోలుగా పెంచిన ఛార్జీలతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి ఒక్కో కుటుంబానికి రానూ పోనూ సుమారు రూ.50 వేలు దాటుతోంది. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, పాలకొండ, చీపురుపల్లి, రాజాం పట్టణాలకు వెళ్లాలంటే మరో రూ.అయిదారు వేలు అదనంగా తీసుకుంటున్నారు. గతంలో రూ.1,200 నుంచి రూ.1,400 ఉన్న టికెట్ ధరను దూరాన్ని బట్టి దానిని మూడు, నాలుగు రెట్లు పెంచి వసూలు చేస్తున్నారు.
టికెట్ ధరలు ఇలా :
- విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేపల్లె, భీమవరం, చీరాల, నర్సాపురం, రాజమహేంద్రవరం నుంచి వచ్చివెళ్లేందుకు ఒక్కో టికెట్‌పై దాదాపు రూ.2,500 నుంచి రూ.4,000 వరకు పెంచారు.
- విజయవాడ, గుంటూరు నుంచి విజయనగరానికి ఒక్కో సీటుకు ప్రయాణికులు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే పండగ వేళ అంతేనని ప్రైవేటు ట్రావెల్స్ ఉద్యోగులు బదులిస్తున్నారు.
- హైదరాబాద్ నుంచి విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, రాజాం పట్టణాలకు నాన్ ఏసీ బస్సుల్లో రూ.1,000 నుంచి రూ.1,200, స్లీపర్ ఏసీ రూ.1400 నుంచి రూ.1,600 ఉండేది. కానీ ఇప్పుడు అడ్డూఅదుపూ లేకుండా ఉంది.
ఆన్‌లైన్‌లో ఒకలా, బుకింగ్ మరోలా : ఆన్‌లైన్ బస్ బుకింగ్ వెబ్ సైట్లలో తక్కువ ధరలు చూపుతున్నారు. బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ధరలు చూసి అవాక్కవుతున్నారు. సంస్థలు టికెట్లను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పార్వతీపురానికి చెందిన ప్రైవేటు సంస్థ ఉద్యోగి హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌కు ప్రయత్నిస్తే నాన్ ఏసీ సీటర్ రూ.2,999 చూపిస్తున్నా బుకింగ్ ఆప్షన్‌లో దాదాపు రూ.3,299 ఉంది. అదే బస్సులో సింగిల్ బెర్త్ రూ.4,299 కాగా, డబుల్ బెర్త్ రూ.3,999గా చూపించింది. గుంటూరులో స్థిరపడిన రాజాం వాసి విశాఖపట్నం వరకు వచ్చేందుకు టికెట్ ధర దాదాపు రూ.4 వేలు ఉండడంతో తలపట్టుకున్నారు.
గంట గంటకూ మార్పు : ఆన్‌లైన్‌లో బస్సు టికెట్ల కోసం ప్రైవేటు ట్రావెల్స్ వెబ్‌సైట్లలో ప్రతి గంటకూ ధరలు మారుతున్నాయి. ఒక సంస్థ సైట్‌లో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బెర్త్ సుమారు రూ.5,499 చూపిస్తే, అదే బస్సులో మధ్య సీటు రూ.3,979, చివరలో సీటు ఛార్జీ రూ.3,539 చూపిస్తోంది. మరో గంట తర్వాత అదే సైట్ ఓపెన్ చేసి చూస్తే చాలా వ్యత్యాసం ఉంటోంది.
ట్రావెల్స్ దోపిడీ నివారణకు రవాణా శాఖ చర్యలు - అందుబాటులోకి టోల్‌ఫ్రీ నంబరు
సంక్రాంతికి అరకొరగా బస్సుల కేటాయింపు - 35 బస్సులతో పండగని సర్దేస్తారా?

