ETV Bharat / state

యువత శక్తి సామర్థాలతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఎన్నో కలలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారు - ఏఐ, డేటా సైన్స్‌ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి -వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైంది -కేంద్రీయ వర్సిటీలో తొలి స్నాతకోత్సవ సభలో రాష్ట్రపతి

President Droupadi Murmu at Anantapur District
President Droupadi Murmu at Anantapur District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 1, 2026 at 1:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

President Droupadi Murmu at Anantapur District : ఏఐ, డేటా సైన్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ముర్ము హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము పట్టాలు ప్రదానం చేశారు. ఎన్నో కలలతో విద్యార్థులు వర్సిటీలో అడుగు పెడతారని భవిష్యత్ కోసం నూతనోత్సాహంతో తయారవుతారని గుర్తుచేశారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్త్​లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. సమాజంలో తమవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత శక్తిసామర్థ్యాలతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యమని రాష్ట్రపతి అన్నారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

"ఈ విశ్వవిద్యాలయం ఒక అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత్ విజన్‌ సాకారంలో గణనీయమైన సహకారం అందిస్తుందని నమ్ముతున్నాను. భిన్న భాషలు, సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వమనే ఉత్సాహపూరిత వాతావరణాన్ని వర్సిటీ సృష్టిస్తోంది. మీ స్వయంకృషి , శ్రమ ఫలితమే మీ విజయం. మీ తల్లిదండ్రుల త్యాగాలు, అధ్యాపకుల మార్గదర్శనం, సమాజం మద్దతు కూడా మిమ్మిల్ని తీర్చిదిద్దాయి. అందువల్ల సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. యువత శక్తి, ప్రతిభ, నిబద్ధతతోనే వికసిత్ భారత్ కల నెరవేరుతుంది. మీలో ప్రతి ఒక్కరూ భవిష్యత్తును నిర్మించే శిల్పులే. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో అంకితభావం, సమగ్రతతో పనిచేసి నైపుణ్యం సాధించాలి."-ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ వర్సిటీకి మంచి గుర్తింపు ఉందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. సెంట్రల్‌ వర్సిటీ సహా ఇతర విద్యాలయాల రాకతో అనంతపురం జిల్లా ఎడ్యుకేషనల్‌ హబ్‌గా ఎదుగుతోందని గుర్తుచేశారు.

"విద్యార్థులను విజ్ఞానవంతులుగా, బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ చర్యలు తీసుకుందని తెలిసి సంతోషిస్తున్నా. విలువ ఆధారిత విద్య ద్వారా ఈ నూతన వర్సిటీలో కేవలం చదువులకే పరిమితం కాకుండా ఇతరులతో చర్చించడం, సొంతంగా ప్రయోగాలు చేసి నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పద్ధతే ఈ వర్సిటీని మిగతావాటి కంటే విభిన్నంగా, ప్రత్యేకంగా నిలబెడుతోంది. పరిశ్రమలతో అనుసంధానమై మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అనుభవపూర్వకంగా నేర్చుకునేలా అనేక స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులు అందించడం హర్షణీయం."-జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, గవర్నర్‌

కాలం గడిచేకొద్దీ వర్సిటీలో వేల మంది విద్యార్థులు చదువుకున్నా తొలి బ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపదీ ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమన్నారు. నూతన సాంకేతికత సద్వినియోగంతో యువత దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

"ప్రతి తరం ఏదో ఒక అంశానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రస్తుత తరం తమ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించుకునే అవకాశం ఉంది. ఇది మీ సమయం, ఇదే మీకు అవకాశం. మీరు ఎక్కడినుంచి వచ్చారనేది మీ భవిష్యత్​ను నిర్ణయించదు. మీ లక్ష్యాలు, కఠోర శ్రమ, వ్యక్తిత్వమే మీరు ఏమవుతారో నిర్దేశిస్తాయి. మీ ప్రారంభమే అంతిమ లక్ష్యాన్ని నిర్ణయించదు. మీ స్థైర్యమే దాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థులారా భారత రాష్ట్రపతి ఒక చిన్న గిరిజన గూడెం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు చేరగలిగినప్పుడు మీ విద్య మీరు ఏం సాధించడానికి సాయపడుతుందో ఒక్కసారి ఊహించుకోండి. నేర్చుకుని, అలవర్చుకుని, మార్పును నడిపించే ధైర్యం ఉన్నవారికే భవిష్యత్ సొంతమవుతుంది. భవిష్యత్ సాంకేతికతను వ్యతిరేకించే వారిదికాదు. టెక్నాలజీ నేర్చుకుని, అలవర్చుకుని, కొత్త ఆవిష్కరణలు చేసే వారిదే భవిష్యత్. అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సిద్ధమవుతోంది. చురుకైన మన ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆవిష్కరణలు, ఉత్పాదకత, సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోంది."-నారా లోకేశ్‌, మంత్రి

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం - ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము