ETV Bharat / state

కర్నూలు కిమ్స్​లో క్లిష్టమైన సమస్యకు అరుదైన చికిత్స

విజయవంతంగా గర్భధారణ ప్రారంభ దశలో ఉన్న మహిళకు క్లిష్టమైన కిడ్నీలోని రాయిని తొలగించిన వైద్యులు - సంతోషంలో కుటుంబం

Pregnant Woman Undergoes Successful kidney Stone Removal at KIMS Hospital Kurnool
Pregnant Woman Undergoes Successful kidney Stone Removal at KIMS Hospital Kurnool (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 26, 2026 at 4:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pregnant Woman Undergoes Successful kidney Stone Removal at KIMS Hospital Kurnool: గర్భధారణ ప్రారంభ దశలో ఉన్న మహిళకు అత్యంత క్లిష్టమైన కిడ్నీలోని రాయిని తొలగించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి తల్లి, గర్భంలోని శిశువును క్షేమంగా కాపాడిన ఘటన కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్​లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను శస్త్రచికిత్స చేసిన యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, వంధ్యత్వ నివారణ నిపుణుడు, సీనియర్​ సర్జన్ డాక్టర్ వై. మనోజ్​ కుమార్​ వెల్లడించారు.

అన్ని జాగ్రత్తలతో శస్త్రచికిత్స: కర్నూలు జిల్లాకు చెందిన ఓ గర్భిణి తీవ్రమైన నడుము నొప్పి, జ్వరంతో స్థానికి ఆస్పత్రిని ఆశ్రయించగా, పరీక్షల్లో మూత్ర సేకరణ భాగం (కిడ్నీ పెల్విస్‌)లో 16 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. మరో ఆసుపత్రిలో స్టెంట్ అమర్చినప్పటికీ నొప్పి, జ్వరం తగ్గకపోవడంతో ఆమెను ఈ నెల 13న కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రోగికి ముందే యాంటీబయాటిక్స్ అందించారు. గర్భస్రావం, ఇన్‌ఫెక్షన్ తదితర ప్రమాదాలపై కుటుంబ సభ్యులకు పూర్తిగా అవగాహన కల్పించారు. అనంతరం వారు ఒప్పుకున్న తర్వాత 14వ తేదీన శస్త్రచికిత్స చేపట్టినట్లు వెల్లడించారు. వైద్య బృందం జనరల్ అనస్థీషియా కింద రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (ఎంఆర్ఐ) నిర్వహించి లేజర్ సాంకేతికతతో కిడ్నీ రాయిని పూర్తిగా తొలగించినట్లు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం రోగికి జ్వరం, నొప్పి పూర్తిగా తగ్గినట్లు తెలిపారు.

అరుదైన ప్రక్రియ: శస్త్రచికిత్స అనంతరం 10వ రోజు నిర్వహించిన స్కాన్‌లో కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయినట్లు నిర్ధారణ కాగా, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె స్పందనలు సాధారణ స్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే గర్భధారణ సమయంలో కిడ్నీ రాళ్ల సమస్య చాలా అరుదుగా కనిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.03 శాతం నుంచి 0.5 శాతం గర్భిణుల్లో మాత్రమే ఈ సమస్య నమోదవుతుందని పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది మందులు లేదా తాత్కాలిక డ్రైనేజ్ విధానాల ద్వారా కోలుకుంటారని, అయితే 14 వారాల గర్భధారణ దశలోనే ఇన్‌ఫెక్షన్​ కొనసాగుతున్న సమయంలో ఎంఆర్ఐ ద్వారా పూర్తిగా రాయిని తొలగించడం అత్యంత అరుదైన వైద్య ప్రక్రియ అని తెలిపారు.

ఇద్దరూ క్షేమం: కాగా గర్భధారణ సమయంలో కిడ్నీ రాళ్లకు శస్త్రచికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని, తల్లి, శిశువు భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆధునిక సాంకేతిక పరికరాలతో మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. సరైన సమయంలో తీసుకున్న వైద్య నిర్ణయం వల్ల తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. శస్త్రచికిత్సను డా. వై. మనోజ్ కుమార్ నేతృత్వంలోని బహుళ విభాగాల వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ అరుదైన విజయవంతమైన శస్త్రచికిత్సతో కిమ్స్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించిందని వైద్యులు తెలుపుతున్నారు.

క్లిష్టమైన సమస్యకు విజయవంతంగా చికిత్స - వృద్ధుడికి పునర్జన్మిచ్చిన కిమ్స్ వైద్యులు

3సార్లు గుండె ఆగినా, ప్రాణం నిలబెట్టారు- విశాఖ కిమ్స్​ వైద్యుల ప్రతిభ