మన ఫొటోనే కదా అని డీపీలో పెడితే - మార్ఫింగ్‌తో బెదిరిస్తున్న సైబర్ నేరగాళ్లు
వాట్సప్ డీపీల మార్ఫింగ్ చేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు - 2025లో సైబర్ క్రైం విభాగాన్ని ఆశ్రయించిన 120 మంది బాధితులు - ఈ జాగ్రత్తలు పాటించమంటున్న అధికారులు

Published : January 5, 2026 at 3:07 PM IST
Photo Morphing Frauds In Telangana : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్తరకమైన నేరాలతో రెచ్చిపోతున్నారు. కొందరు మెసేజ్‌ల రూపంలో లింకులు పెడుతూ మరికొందరు ఆఫర్లు అంటూ బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ఫొటోలను మార్చి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ బాధితుల నుంచి నగదును కాజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే,
వాట్సప్ డీపీని వినియోగించి : ఓ వ్యక్తి తన భార్యతో ఫొటో తీసుకున్నారు. దానిని తన వాట్సప్‌లో డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని దానిని మార్ఫింగ్ చేశారు. సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు దానిలో మార్పులు చేశారు. ఆపై దానిని తన భర్తకు పంపించారు. ఈ రకంగా వారిని వేధించారు. ఈ ఫొటోలను వైరల్ చేయకుండా ఉండేందుకు తమకు కొంత డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు. కాగా బాధితుడు ఈ విషయాలను దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
120 మంది బాధితులు : నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ఆధారంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, పలువురిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని 2025లో 120 మంది బాధితులు సైబర్ క్రైం విభాగాన్ని ఆశ్రయించారు. వారిలో ఫేస్బుక్లో 26, ట్విటర్ యూజర్లు 94 మంది బాధితులు ఉన్నారు. దీంతో 7 కేసులు నమోదయ్యాయి.
మాయమాటలతో నమ్మించి : వరంగల్‌కు చెందిన ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఓ రోజు ఆదిలాబాద్‌కు చెంది ఓ యువకుడు సదరు బాలిక డీపీ చిత్రాన్ని అందంగా మార్చి ఆమెను మాటల్లో దింపాడు. ఆపై ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో ఆమెను నమ్మించాడు. అతడు చెప్పిన మాటలు నమ్మియ ఆ యువతి ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అయితే ఆమె మార్గం మధ్యలో నిజామాబాద్ రైల్వే పోలీసుల కంటపడింది.
వ్యక్తిగత సమాచారాన్ని దోచుకొంటూ : సామాజిక మాధ్యమాల్లో పెట్టే డీపీలు ప్రమాదాలను కొనితెస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు, ప్రబుద్ధులు ఇంటర్నెట్లో ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకొంటున్నారు. సంబంధిత వ్యక్తుల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వారిపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. యువతులను లైంగికంగా వేధిస్తున్నారు. ఆపై డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటినుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి :
- ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలు అపరిచితులకు అందుబాటులో ఉండకుండా లాక్ చేసుకోవాలి.
- పేరు, చిరునామా, ఫోన్ నంబరు, చేసే పని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.
- యువత ముఖ్యంగా యువతులు, బాలికలు, అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దు.
- ఫొటోలు, పోస్టుల్లో లొకేషన్ తెలియకుండా ఫోన్లో జియో ట్యాగింగ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలి.
- మైనర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండకుండా తల్లిదండ్రులు నిఘా ఎంతో ముఖ్యం.
ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తాం : సైబర్ వేధింపులు, మోసాలపై 1930 టోల్‌ఫ్రీ, లేదా డయల్ -100కి సత్వరం సమాచారమివ్వాలని నిజామాబాద్ సైబర్ క్రైం, ఆర్ఎస్ఐ నిషిత్ సూచించారు. బాధితులు భయపడకుండా ధైర్యంతో ఉండాలని బాధతో కుంగిపోయి స్వీయహాని చేసుకోవద్దని అన్నారు. ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
"సైబర్ వేధింపులు, మోసాలపై 1930 టోల్‌ఫ్రీ, లేదా డయల్ -100కి సత్వరం సమాచారమివ్వాలి. భయపడకుండా ధైర్యంతో ఉండాలి. కుంగిపోయి స్వీయహాని చేసుకోవద్దు. ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తాం." - నిషిత్, సైబర్ క్రైం, ఆర్ఎస్ఐ, నిజామాబాద్
మీకు కనిపించేదంతా నిజం కాదు! - మ్యాట్రిమోనీల్లో సైబర్ మాయగాళ్లు
ఆ మెయిల్ వస్తే అనుమానించాల్సిందే - దడ పుట్టిస్తున్న ‘బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్’ స్కామ్

