ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సందడి - కోలాహలంగా సాగుతున్న ముందస్తు వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సందడి - కోలాహలంగా సాగుతున్న ముందస్తు వేడుకలు - రంగవల్లులతో పోటీపడుతున్న మహిళామణులు - పలుచోట్ల వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Pre Sankranthi Celebrations in Across AP
Pre Sankranthi Celebrations in Across AP (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 8:48 PM IST

|

Updated : January 11, 2026 at 7:17 AM IST

4 Min Read
Choose ETV Bharat

Pre Sankranthi Celebrations in Across AP: రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చదువు, ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకు చేరుకుని ముందుస్తు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఊరూవాడా పండుగ సందడి నెలకొంది. పలుచోట్ల సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని జనం సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నారు.

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ముందుస్తు వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ నేత GVL నరసింహరావు నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో కేంద్రమంత్రి సురేష్‌ గోపి పాల్గొన్నారు. సంక్రాంతి విశిష్ఠత గురించి అడిగి తెలుసుకున్నారు. వేడుకలు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు.

జనంతో కలిసి భోగిమంటలు : ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా లేగ దూడల అందాల పోటీలు నిర్వహించారు. వేడుకలకు హాజరైన మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ ఆవు దూడలను ఎత్తుకుని మురిసిపోయారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగ అని పశువుల సంబంధించిన పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. జనంతో కలిసి భోగిమంటలు వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలగా నిలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. నెల్లూరులో నిర్వహించిన సంబరాల్లో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. మహిళలతో కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు.

మొదలైన సంక్రాంతి సందడి - కోలాహలంగా సాగుతున్న ముందస్తు వేడుకలు (ETV Bharat)

ప్రత్యేక ఆకర్షణగా పూరిళ్ల సెట్టింగ్‌లు : గుంటూరు సమీపంలోని పొత్తూరు ACME స్కూల్‌ ఆవరణలో ఈనాడు 91.9 FM రేడియో, వికాస్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో వేడుకలు కోలాహలంగా సాగాయి. చిన్నారులు ఉత్సహంగా గాలి పటాలు ఎగురవేశారు. సాంస్కృతిక నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులెస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి భోగి మంటలు వేశారు. పూరిళ్ల సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు కోలాటం, నృత్యాలతో అదరగొట్టారు. అనంతపురం జిల్లా కూడేరు శ్రీ సంగమేశ్వర స్కూల్‌లో పండుగ శోభ సంతరించుకుంది. సంప్రదాయ దుస్తులతో పాఠశాలకు వచ్చిన చిన్నారులు వివిధ ఆకృతుల్లో ముగ్గులు వేశారు. భోగిమటలు వేసి హరిదాసుకు ధాన్యం పోసి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

రద్దీగా మారిన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు : మరోవైపు పండుగ కోసం సొంతూళ్లకు వచ్చేవారితో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. దీంతో వాల్తేరు డివిజన్‌లోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అధికారులు అదనపు టికెట్‌ కౌంటర్లు, ఆటోమేటిక్‌ వెండింగ్‌ మిషన్లు, అందనపు విచారణ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక రైళ్లు, ఇతర సదుపాయాలను DRM తనిఖీ చేశారు. ప్రయాణికులు ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని నివారించాలని సూచించారు. అలాగే పల్లెలకు వెళ్లే జనంతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిస్తున్నాయి. జాతీయ రహదారులపై రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టోల్‌ గేట్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యల లేకుండా చూడాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. NH రీజినల్‌ అధికారి RK సింగ్‌తో మట్లాడిన మంత్రి ప్రయాణికులు ఎక్కువ సేపు టోల్‌గేట్లు వద్ద నిరీక్షించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు.

మరోవైపు విద్యాసంస్థలూ ముందస్తు సంక్రాంతి వేడుకలకు వేదికలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ వస్త్రధారణలో భోగిమంటలు, ముత్యాలముగ్గులు వేసిన విద్యార్థినులు మన సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు.

విద్యాసంస్థల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు: సంక్రాంతి ముందస్తు సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రంగవల్లుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న పదహారణాల తెలుగింటి ఆడపిల్లల సందడి మధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దీనికితోడు యువత ఆటపాటలతో ప్రత్యేక ఆకర్షణగా అలరిస్తున్నారు.

సంక్రాంతి కళను ముందే తీసుకొచ్చారు విజయనగరం జిల్లాలోని లెండీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. తెలుగు సంప్రదాయాలను గుర్తు చేస్తూ, సంక్రాంతి వైభవాన్ని చాటారు. కట్టుబొట్టు, రంగువల్లులతో ఆకట్టుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలోని వాణి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో సంక్రాంతి వైభవాన్ని చూపరుల కళ్లకు కట్టారు.

నెల్లూరు నారాయణ ఫార్మసీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ముత్యాలముగ్గులు వేసి కోలాటాలు ఆడి సందడి చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం సాంప్రదాయ వస్త్రాలతో హాజరై చిన్నారులపై భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. రంగవల్లులు, పాలపొంగులు, గంగిరెద్దులు, గాలిపటాలతో పాఠశాలలను అలంకరించారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నారులంతా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. కళాశాల ప్రాంగణంలో రంగు రంగుల ముగ్గులు వేశారు. కోలాటాలు, ఎడ్ల బండిపై ఊరేగుతూ విద్యార్థులు సందడి చేశారు. బొమ్మల కొలువులు, పిండి వంటలు, భోగి మంటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం కోలాటాలు, ఎడ్ల బండిపై ఊరేగుతూ సందడి చేశారు. బొమ్మల కొలువులు, పిండి వంటలు, భోగి మంటలతో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది.

"మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ భారతీయతను ప్రతిబింబించే విధంగా ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలను సందడిగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగను మా కళాశాలలో ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉంది. పల్లెటూర్లో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారో అక్కడ ప్రజలకు అవగాహన ఉంటుంది. కానీ పట్టణాల్లో ఉన్న ఉన్న విద్యా సంస్థల్లో సైతం భారతీయ సంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడమనేది ఆనందించదగిన విషయం. వీటి ద్వారా నేటి తరానికి సంక్రాంతి పండగ అంటే ఏంటో ఓ అవగాహన వస్తుంది. పండుగ సంప్రదాయాలు అందరి కళ్లకు కట్టే విధంగా చూపేందుకు మా కళాశాలలో పండగ శోభ కనపడేలా అన్ని ఏర్పాట్లతో వినూత్న కార్యక్రమాలను ప్రతి సంవత్సరంగా ఇదే రీతిగా అధ్యాపకుల ఆధ్యర్యంలో నిర్వహించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది" -విద్యార్థులు

సిద్ధార్ధ మెడికల్​ కాలేజ్​లో ముందస్తు సంక్రాంతి వేడుకలు - భోగి మంటల నడుమ విద్యార్థుల నృత్యాలు

బస్సులు, రైళ్లు ఫుల్ - సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేదెలా!

Last Updated : January 11, 2026 at 7:17 AM IST